విజయ్ చుట్టూ ఆంక్షలు ....డీఎంకే భయపడుతోందా ?

తమిళనాడులో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం అన్నది దాదాపుగా ఎనభై ఏళ్ల నుంచి ఉన్న వ్యవహారమే.;

Update: 2025-09-14 03:41 GMT

తమిళనాడులో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం అన్నది దాదాపుగా ఎనభై ఏళ్ల నుంచి ఉన్న వ్యవహారమే. నాటకాలు సినిమా రంగం నుంచే కరుణానిధి రాజకీయాల్లోకి వచ్చారు ఎంజీఆర్ జయలలిత అలాగే వచ్చారు. మరి ఈ రోజున అధికారంలో ఉన్న డీఎంకే మూల పురుషులకు సినీ వాసనలు ఉన్నాయి. సాక్ష్యాత్తు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సినీ హీరో అన్నది తెలిసిందే. మరి ఇంతలా సినీ అనుబంధం రాజకీయంగా పెనవేసుకున్న చోట ఒక హీరో రాజకీయాల్లోకి వస్తూంటే ఎందుకు అంత కలవరం అన్నదే చర్చగా ఉంది. అధికారంలో ఉన్న డీఎంకే తమిళ హీరో టీవీకే అధినేత అయిన విజయ్ విషయంలో కఠినంగా వ్యవహరించదలచిందా అన్న చర్చ అయితే సాగుతోంది.

రాష్ట్ర పర్యటనకు ఆంక్షలు :

తాను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయాలని నిర్నయించుకున్నాను అని ఈ నెల 9న విజయ్ రాష్ట్ర డీజీపీ కి ఒక లేఖ రాశారు. తనకు అన్ని రకాలైన అనుమతులతో పాటుగా భద్రత కూడా కల్పించాలని ఆయన ఆ లేఖలో కోరారు. సాధారణంగా అయితే ఇదేమీ పెద్ద విషయం కాదు, ఎవరైనా ప్రజల వద్దకు వెళ్తారు, వారి ప్రజాదరణ బట్టి జనాలు రిసీవ్ చేసుకుంటారు. తమ పార్టీ విధానాలు వారు చెప్పుకుంటారు. అలా వెళ్ళిన నాయకులకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికి అయినా ఉంటుంది. కానీ విజయ్ విషయంలో మాత్రం కఠినమైన ఆంక్షలతో అనుమతులు ఇవ్వడమే ఇక్కడ విశేషం.

తిరుచనాపల్లి సభతో స్టార్ట్ :

ఇక విషయానికి వస్తే తమిళ హీరో విజయ్ తన టీవీకే పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్త పర్యటనలను తిరుచనాపల్లి సభలో శనివారం ప్రారంభించారు. ఆయన ఉదయం సరిగ్గా పది గంటల ముప్పయి అయిదు నిముషాలకు సభను మొదలు పెడితే పోలీసులు పెట్టిన ఆంక్షలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కేవలం ఇరవై అయిదు నిముషాలలో సభను ముగించాలని. అంటే 11 గంటలకే ముగించాలి అన్న మాట. మరి ఒక సూపర్ స్టార్ డం ఉన్న హీరో కొత్తగా పార్టీ పెట్టి మొదటి సారి జనంలోకి వచ్చినపుడు తన గురించి తన పార్టీ గురించి చెప్పుకోవాలి. తన అభిమానులను అలరించాలి. వారితో సభ వేదిక నుంచే మాట్లాడాలి. ఇవన్నీ చేయాలి అంటే ఇంతటితో ఆపేయాలి అని అతి తక్కువ సమయం ఇస్తే ఎలా కుదురుతుంది, ఇదే ఇపుడు టీవీకే పార్టీ వర్గాలలో చర్చగా ఉంది.

పలు నిబంధనల నడుమ :

ఇక ఈ ఒక్కటే కాదు అనేక ఇతర నిబంధనలు కూడా విధించారు. అవేంటి అంటే ఎటువటి ప్రచారం చేసుకోకూడదుట. అలాగే ర్యాలీలు రోడ్ షోలు చేయరాదుట. ఇక ఆయన వాహనం వెనకాల అయిదు వాహనాలు మాత్రమే అనుసరించాలట. పాదయాత్ర చేయరాదు, ఆయన సభకు మహిళకు గర్భిణీ స్త్రీలు రాకూడదుట. ఇలా ఎన్నో నిబంధనలు ఉన్నాయి. వీటిని చూసిన వారు ఇవేమి వింత నిబంధనలు అనుకుంటున్నారు.

విజయ్ ప్రజాదరణ చూసేనా :

ఈ మధ్యనే తమిళనాడులో ఒక అతి పెద్ద సభను విజయ్ నిర్వహించారు. దానికి ఏకంగా నాలుగు లక్షల మంది జనాలు వచ్చారని ఒక అంచనా. ఆ సభ విజయ్ కి ఉన్న క్రేజ్ ఏంటో తెలియజేసింది. ఒక విధంగా విజయ్ ఫీవర్ తో అక్కడ యూత్ ఊగుతోంది. ప్రభుత్వం మారాలి అనుకుంటున్న వర్గాలూ మద్దతు ఇస్తున్నాయి. దీంతో పాటు దశాబ్దాల ద్రవిడ రాజకీయం చూసిన వారు కొత్త దనం కోరుకుంటున్నారు. ఇవన్నీ విజయ్ కి ప్లస్ గా మారనున్నాయి. దీంతో డీఎంకే విజయ్ మీద ఆంక్షలు పెడుతోంది అని అంటున్నారు.

అర్జునుడుగా గర్జిస్తారా :

అయితే అధికారం చేతిలో ఉంది కదా అని ఆంక్షలు పెడితే జనాలు రివర్స్ లో ఆలోచిస్తారని అది అంతిమంగా విజయ్ కే మేలు చేస్తుందని అంటున్నారు. డీఎంకే సర్కార్ దగ్గరుండి మరీ విజయ్ కి సింపతీ పెంచేసేలా ఈ పరిణామాలు ఉన్నాయని అంటున్నారు. 2026 మేలో ఎన్నికలు ఉన్నాయి. ఈలోగానే విజయ్ మీద ఇలా కండిషన్లు పెడుతూ పోతే ఎన్నికల వేళకు టీవీకే ఒక విధంగా బలమైన శక్తిగా మారేందుకు చేజేతులా అధికార పార్టీయే సహకరిస్తోంది అని అంటున్నారు. చూడాలి మరి ఈ రాజకీయ కురుక్షేత్రంలో విజయ్ అర్జునుడుగా గర్జిస్తారా లేక అభిమన్యుడిలా పద్మవ్యూహంలో చిక్కుకుంటారా అన్నది.

Tags:    

Similar News