విజయ్‌-త్రిష టార్గెట్...డీఎంకే సక్సెస్ అవుతుందా ?

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సినీ నటుడు అన్నది తెలిసిందే. ఆయన దళపతిగా జనం చేత జేజేలు కొట్టించుకున్నారు.

Update: 2026-08-19 04:00 GMT

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సినీ నటుడు అన్నది తెలిసిందే. ఆయన దళపతిగా జనం చేత జేజేలు కొట్టించుకున్నారు. రాజకీయాల మీద ఆసక్తితో ఆయన టీవీకేని స్థాపించి ఎన్నికల్లో అనూహ్యంగా గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక త్రిష సినీ హీరోయిన్. విజయ్ తో జంటగా అనేక సినిమాల్లో నటించింది. ఈ ఇద్దరి జోడీ సక్సెస్ ఫుల్ గా వెండితెర మీద నడిచింది. జనాలు కూడా వారిని అలాగే ఆరాధించారు. ఇపుడు విజయ్ సీఎం అయ్యారు. త్రిష ఆయన స్నేహితురాలిగా ఉంటూ కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా తాజాగా జరిగిన ఆగస్టు 15 వేడుకల్లో ఆమె పాల్గొనడం చర్చనీయాంశం కావడమే కాదు వివాదంగా మారింది. సాధారణంగా జాతీయ ఉత్సవాలలోనూ అధికారిక కార్యక్రమాలలోనూ ముందు సీటు అన్నది కేటాయింపునకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అయితే దానిని తోసిరాజని త్రిషకు మొదటి వరస కేటాయించారు అని ప్రతిపక్ష డీఎంకే విమర్శలు చేస్తోంది.

మురసోలి లో ఘటు వ్యాఖ్యలు :

డీఎంకేకు ఒక అధికారిక పత్రిక ఉంది. దాని పేరు మురసోలి. ఆ పత్రికలో విజయ్ త్రిషల గురించి ఘాటుగానే రాస్తూ వ్యాఖ్యానం చేయడం చర్చనీయాంశం అయింది. పైగా స్వాతంత్య్ర వేడుకల్లో త్రిష ముందు వరుసలో కూర్చోవడంపైన కూడా ఈ కధనంలో మురసోలి పత్రిక తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక విజయ్‌కు త్రిష ఏ విధంగా సెల్యూట్‌ చేస్తారు అంటూ ప్రశ్నించింది. ఈ మొత్తం వ్యవహారం అంతా సిగ్గుచేటైన దృశ్యంగా మురసోలి పత్రిక అభివర్ణించింది. ఇక అంతకు ముందు విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా త్రిష హాజరైంది. అప్పుడు కూడా కొంత చర్చ సాగింది. ఇపుడు చూస్తే మరోసారి దీని మీదనే విపక్షాలు తమిళనాడులో విమర్శలు చేస్తున్నాయి. అన్నా డీఎంకే కూడా ఘాటుగానే రియాక్ట్ అవుతోంది.

ఇష్యూ ఇదేనా మరి :

ఇక తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మీద ద్రవిడ పార్టీలకు ఇదే ఇష్యూగా మారుతోంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో నటి త్రిషను మొదటి వరుసలో కూర్చోబెట్టి సెల్యూట్‌ చేయించుకోవడం పైన డీఎంకే అన్నాడీఎంకే విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. దీన్ని అనైతికంగా అభివర్ణిస్తూ రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. అన్నాడీఎంకే నాయకుడు ఆర్‌బీ ఉదయ్‌కుమార్ కూడా త్రిష ప్రస్తావన తెస్తూ ఘాటు విమర్శలు చేశారు. ఇక త్రిషపై ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి వ్యాఖ్యలు కూడా గతంలో వివాదాస్పదం అయి దుమారం రేపాయి. ఇపుడు డీఎంకే అధికారిక పత్రిక మురసోలిలో కూడా ఇదే అంశం మీద ఏకంగా సంపాదకీయం రాయడంతో ఇది రాజకీయంగా అతి పెద్ద చర్చగా మారుతోంది.

బూమరాంగ్ అవుతుందా :

నిజానికి విజయ్‌-త్రిష వ్యవహారాన్ని రాజకీయంగా విమర్శించడం ద్వారా విజయ్‌ ఇమేజ్ ని దెబ్బ తీయాలన్నది ద్రవిడ పార్టీల ప్రయత్నం అయితే మాత్రం అది వర్కౌట్ అవుతుందా అన్న చర్చ కూడా ఉంది. ఎందుకంటే మహిళల విషయం పూర్తిగా ప్రైవేట్ వ్యవహారం మీద అనుభవం కలిగిన రాజకీయ పార్టీలు గురి పెట్టి విమర్శలు చేస్తే బూమరాంగ్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. పైగా తమిళనాడుతో రాజకీయం సినిమా కలిసిపోతూ ఉంటాయి. విజయ్ త్రిష ఇద్దరూ హీరో హీరోయిన్లు అన్నది జనాలకు బాగా తెలుసు. వారి మధ్య స్నేహం ఉందనీ తెలుసు. ఆమె అధికార కార్యక్రమాల్లో హాజరైతే తప్పేంటి అని కూడా అన్న వారూ ఉన్నారు.

పని తీరు ఆయనకు శ్రీరామరక్ష :

ఆమె ప్రభుత్వంలో చేరి ఏమైనా ప్రభావితం చేస్తే అపుడు జనాలు ఆలోచిస్తారేమో కానీ ముఖ్యమైన వేడుకలలో కనిపిస్తే ఎలా తప్పు పడతారు అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. దీని మీద మాజీ బీజేపీ నేత కె.అన్నామలై చేసిన వ్యాఖ్యలు కూడా ఇక్కడ కీలకంగా ఉన్నాయి. ఎవరైనా సరే రాజకీయ ప్రత్యర్థులను విమర్శించేందుకు మహిళలను వ్యక్తిగత అంశాల్లోకి లాగడం అన్నది తగదు అని ఆయన హితవు చెప్పారు. ఇవన్నీ పాత రాజకీయ ధోరణి అని ఆయన చెప్పడం ద్వారా జనాలు మెచ్చరు అన్నట్లుగానే పేర్కొన్నారు. ఏది ఏమైనా విజయ్ పని తీరు ఆయనకు శ్రీరామరక్ష అని అంటున్నారు. అంతే తప్ప మిగిలిన విషయాలు జనాలు పట్టించుకోరు అని కూడా చెబుతున్నారు. విపక్షాలు కూడా ఈ ఇష్యూని పక్కన పెట్టి టీవీకే ప్రభుత్వం చేసే తప్పులతో జనంలోకి వెళ్తే బాగుంటుంది అన్న సూచనలు వస్తున్నాయి.

Tags:    

Similar News