స్పీడ్ పెంచిన గంటా...చాన్స్ కోసమేనా ?
అసెంబ్లీలో వరసబెట్టి ప్రశ్నలు వేస్తున్నారు సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఆయన విశాఖ జిల్లాకు సంబంధించిన ప్రజా సమస్యలను సభ ముందు ఉంచుతున్నారు.
అసెంబ్లీలో వరసబెట్టి ప్రశ్నలు వేస్తున్నారు సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఆయన విశాఖ జిల్లాకు సంబంధించిన ప్రజా సమస్యలను సభ ముందు ఉంచుతున్నారు. అంతే కాదు పలు సందర్భాలలో ప్రభుత్వ విధానాలకు మద్దతుగా మాట్లాడుతున్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామ క్రిష్ణం రాజు ఆయనకు మైక్ ఇస్తున్నారు. దాంతో గంటా అసెంబ్లీలో ప్రత్యేక ఆకర్షణ అవుతున్నారు. గతంలో గంటా పెద్దగా స్పందించేవారు కాదు అన్న విమర్శలు ఉండేవి. ఇటీవల కాలంలో ఆయన వైఖరి మారింది అని అంటున్నారు. గంటా జోరు పెంచడం మీద అయితే విశాఖ జిల్లాతో పాటు టీడీపీలో రాజకీయంగా చర్చ సాగుతోంది.
జిల్లా సమస్యలతో :
గంటా భీమిలీ నియోజకవర్గం ప్రతినిధి. అక్కడ నుంచే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. సాధారణంగా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల సమస్యల గురించే ఎక్కువగా ప్రస్తావిస్తూంటారు. అయితే గంటా మంత్రిగా గతంలో పనిచేసి ఉండడంతో ఆ అనుభవంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యల మీద అవగాహనతో మాట్లాడుతున్నారు. విశాఖ ఉత్తరం పశ్చిమం నియోజకవర్గాల పరిధిలో ఉన్న విశాఖ ఎయిర్ పోర్టులో ఉద్యోగాలు కోల్పోయిన సిబ్బంది సమస్యలను గంటా అసెంబ్లీలో తాజాగా ప్రస్తావించారు. విమానాశ్రయం క్లోజ్ కావడంతో వారంతా ఉపాధి కోల్పోయారు అని ఆయన సభ దృష్టికి తెచ్చారు. వందలలో వారు ఉన్నారని వారికి కొత్త విమానాశ్రయంలో అకామిడేట్ చేయాల్సి ఉందని కూడా సూచించారు.
ఫోకస్ పెట్టి మరీ :
ఇక జిల్లా రాజకీయాల్లో కూడా గంటా చురుకుగా ఉంటున్నారు. వైసీపీ మీద విమర్శలు చేయడంతో పాటు డోస్ పెంచుతున్నారు. ఈ మధ్యనే ఆయన వైసీపీ మీద తీవ్ర విమర్శలు చేశారు. భోగాపురం ఎయిర్ పోర్టు క్రెడిట్ వైసీపీకి ఎలా దక్కుతుందని ప్రశ్నిస్తూ ఈ విషయంలో ఆ పార్టీ ఎంత తగ్గి ఉంటే అంత మంచిది అని సూచనలు చేశారు. ఇలా రాజకీయంగా గంటా ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. ఇక అసెంబ్లీలో అనేక అంశాలతో అటు టీడీపీ పెద్దల దృష్టిలోకి వెళ్తున్నారు అని అంటున్నారు. త్వరలో ఏపీ మంత్రి వర్గ విస్తరణ జరుగుతుంది అని ప్రచారం సాగుతున్న నేపధ్యంలో గంటా స్పీడ్ పెంచారని అంటున్నారు. తన నియోజకవర్గంలో ఆయన గట్టిగా తిరుగుతూ ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని కూడా బాగానే చేపడుతున్నారు.
సెంటిమెంట్ కూడా ఉంది :
ఈ ఎన్నికలతో తాను తప్పుకుని తన కుమారుడు రాజకీయ వారసుడిగా రంగంలోకి దించాలని గంటా చూస్తున్నారు. అయితే మంత్రి హోదాలోనే పదవీ విరమణ చేస్తే హుందాగా ఉంటుందని భావిస్తున్నారు అని అంటున్నారు. అంతే కాదు మంత్రిగా ఉంటే తన కుమారుడికి సీటు ఈజీగా వస్తుందని నమ్ముతున్నారు. పైగా మంత్రిగా భీమిలీ నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడితే అది భవిష్యత్తులో కుమారుడికి ఎంతగానో కలసి వస్తుందని కూడా అంచనా వేస్తున్నారు. గతం మాటెలా ఉన్నా ప్రస్తుతం గంటా టీడీపీ హైకమాండ్ గుడ్ లుక్స్ లో ఉన్నారు అని అంటున్నారు. ఇతర ఎమ్మెల్యే మాదిరిగా ఆయన వైసీపీ వారితో చెట్టాపట్టాల్ వేయడం లేదు, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం లేదు, పైపెచ్చు తన నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాలకు అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరం అయిన భూముల సేకరణ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చి శభాష్ అనిపించుకుంటున్నారు. గూగుల్ వంటి పెద్ద ప్రాజెక్టుకు వేలది ఎకరాలు ఆ విధంగానే భీమిలీలో సేకరణ సాధ్యమైంది అని గుర్తు చేస్తున్నారు. మరి గంటా పడుతున్న శ్రమకు రిజల్ట్ ఉంటుందా అంటే వెయిట్ అండ్ సీ.