వైఎస్ డీఎస్...రేవంత్ మహేష్...ఈ పోలిక కరెక్టేనా ?
సరిగ్గా ఇప్పటికి పాతికేళ్ళ క్రితం ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో ఒక సరికొత్త కాంబినేషన్ అవతరించింది.
సరిగ్గా ఇప్పటికి పాతికేళ్ళ క్రితం ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో ఒక సరికొత్త కాంబినేషన్ అవతరించింది. కాకలు తీరిన కాంగ్రెస్ నాయకుడుగా ఉన్న వైఎస్సార్ పీసీసీ చీఫ్ గా ఉంటూ కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చి సీఎం అయ్యారు. ఇక ఆయన ప్లేస్ లో తెలంగాణాకు చెందిన బీసీ నాయకుడు డీ శ్రీనివాస్ పీసీసీ చీఫ్ అయ్యారు. ఈ ఇద్దరి కాంబో సూపర్ హిట్ గా నిలిచింది. స్థానిక ఎన్నికల నుంచి 2009లో జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల దాకా అన్నీ విజయాలనే నమోదు చేసింది. రాజకీయాల్లో అలాంటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ ని ఎవరూ అంతవరకూ చూడలేదు, ఇక కాంగ్రెస్ సంప్రదాయం ప్రకారం సీఎం కి పీసీసీ చీఫ్ కి మధ్య గ్యాప్ ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. ఒకరితో ఒకరికి పొసగక వేరు కుంపట్లు పెట్టడం పార్టీ వర్గాలుగా చీలిపోవడం అధినాయకత్వానికి ఫిర్యాదులు చేసుకోవడం ఇలా ఎన్నో జరుగుతూ ఉండేవి. అలా దేశమంత సాగినా ఉమ్మడి ఏపీ మాత్రం దానికి భిన్నం. కారణం అక్కడ ఉన్నది వైఎస్సార్ డీఎస్. వైఎస్సార్ గ్లామర్ అయితే డీఎస్ ది వ్యూహం. అలా కాంగ్రెస్ బండిని ఏక త్రాటిపైన నడిపారు.
రేవంత్ నోట అదే మాట :
ఇక చాలా కాలానికి కాంగ్రెస్ 2023లో తెలంగాణాలో అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి కూడా ప్రజాకర్షణ కలిగిన నాయకుడు. ఆయన పీసీసీ చీఫ్ గా ఉంటూ కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చారు. ఆయన సీఎం కాగానే పీసీసీ చీఫ్ పదవికి బీసీ వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ ని ఎంపిక చేయడం ద్వారా వ్యూహాత్మక వైఖరిని ప్రదర్శించారు. ఇక గడచిన రెండున్నరేళ్లుగా పీసీసీ చీఫ్ అలాగే సీఎంల మధ్య పొరపొచ్చాలు అయితే రాలేదు అన్నది నిజం. అంతే కాదు మహేష్ కుమార్ గౌడ్ చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్నారు. దాంతోనే రేవంత్ రెడ్డి పదే పదే ఈ విషయాన్ని చెబుతున్నారు అనుకోవాలి. తమది వైఎస్ డీఎస్ మాదిరిగా సక్సెస్ ఫుల్ జోడీ అని కూడా అంటున్నారు. అయితే ఈ పోలిక ఎంతవరకూ కరెక్ట్ అన్న చర్చ కూడా ఉంది.
పక్కా కాంగ్రెస్ వాదిగా :
ఇక వైఎస్సార్ పక్కా కాంగ్రెస్ వాదిగా ఉన్నారు. ఆయనకు అధినాయకత్వం అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఆయనకంటూ సొంత వర్గం ఎపుడూ కాంగ్రెస్ లో ఉండేది. ఇక ఇమేజ్ పరంగా వైఎస్సార్ ది కాంగ్రెస్ లో శిఖరాయమానమైన స్థానంగా చెబుతారు. వైఎస్సార్ ని ఎవరూ ఏ దశలోనూ ఆనాడు ఎదిరించలేని వాతావరణం ఉండేది. ఆయన ఏది అంటే అదే జరిగేది. ఒక విధంగా ప్రాంతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీని మార్చి ఒంటి చేత్తో పాలించారు. ఆయనకు కాంగ్రెస్ లో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం అలా కలిసి వచ్చింది. ఆయన మంత్రులను కానీ రాజ్యసభ సభ్యులను కానీ తానే ఎంపిక చేసేవారు. అలాగే అభ్యర్ధుల ఎంపిక కూడా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో చేసి హైకమాండ్ చేత లాంచనంగా ఓకే చేయించుకునేవారు. మరి అలాంటి పవర్ కాంగ్రెస్ లో ఎవరికీ ఉండదని అంటారు. రేవంత్ విషయానికి వస్తే ఆయన ఆది నుంచి కాంగ్రెస్ లో ఉన్న వారు కాదు, పైగా టీడీపీ మనిషి అన్న ముద్ర ఉంది అంటారు.
మంత్రివర్గంలో ఖాళీలు :
ఇక తెలంగాణా కేబినెట్ లో ఖాళీలు ఉన్నాయి. అయినా సరే భర్తీ చేయలేకపోతున్నారు అని విమర్శలు ఉన్నాయి. ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటు విమర్శలు చేస్తూ ఏకంగా రేవంత్ రెడ్డికే చికాకు తెప్పిస్తున్నారు. కాంగ్రెస్ అనే మహా సముద్రంలో సీనియర్లు ప్రస్తుతానికి మౌనంగా ఉన్నారు. మళ్లీ కాంగ్రెస్ గెలవాలి. తానే 2034 వరకూ సీఎం అని రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రకటనలు సీఎం పదవి మీద మోజు పెంచుకున్న వారికి ఇష్టంగా ఉండవని అంటారు. అయితే వైఎస్సార్ కి రేవంత్ కి పోలికలు కొన్ని ఉన్నాయి. ఇద్దరూ ప్రజాభిమానం ఉన్న వారే. ఇక హైకమాండ్ వద్ద రేవంత్ రెడ్డికి కూడా చాలా వరకూ పలుకుబడి ఉంది. ఆయన కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చారు అన్న భావన కేంద్ర పెద్దలలో ఉంది. లోపల ఎలా ఉన్నా బయట ఎక్కువ మంది తనకు వ్యతిరేకం అన్న భావన రానీయకుండా రేవంత్ రెడ్డి అయితే జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నారు. ఇక పీసీసీ చీఫ్ తో మంచి రిలేషన్స్ ని మెయిన్ టెయిన్ చేస్తున్నారు. ఇదే విధంగా కొనసాగి 2028లో మరోసారి కాంగ్రెస్ ని తెలంగాణాలో తెస్తే మాత్రం వైఎస్ డీఎస్ కాంబో రిపీట్ అని కాంగ్రెస్ జనాలతో పాటు సగటు జనాలూ కచ్చితంగా ఒప్పుకుంటారు.