సోఫియా ఖురేషీని అలా చూడటం ఏమిటి మంత్రివర్యా?
కలలో కూడా కొందరు గురించి తప్పుగా అనుకోకూడదు. ఒకవేళ అనుకుంటే అంతకు మించిన పాపం మరొకటి ఉండదు.;
కలలో కూడా కొందరు గురించి తప్పుగా అనుకోకూడదు. ఒకవేళ అనుకుంటే అంతకు మించిన పాపం మరొకటి ఉండదు. క్రమశిక్షణకు మారుపేరుగా.. దేశ భక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే వారిని ఉద్దేశించి పల్లెత్తు మాట అన్నా అది పెద్ద తప్పే అవుతుంది. అందులోనా కీలక స్థానాల్లో ఉన్న వారు మరింత ఒళ్లు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎవరేం చెప్పినా.. ఈ దేశంలో అన్ని మతాల వారు ఉండాల్సిందే. అప్పుడే భారతదేశం అవుతుంది. సనాతన ధర్మాన్ని అభిమానించి.. ఆరాధించే వారు ఎవరైనా సరే ఇందుకు ఒప్పుకుంటారు.
ఎందుకంటే హిందూ సనాతన ధర్మం ఎప్పుడూ అన్య మతాల్ని ద్వేషించలేదు. అకారణంగా నిందించలేదు. ఆ సంస్కారం హిందూ సనాతన ధర్మానిది. అందరికి తగినంత స్వేచ్ఛను ఇచ్చిందన్నది నిజం. అలాంటి గొప్ప ధర్మాన్ని పరిమిత దృక్పథంతో చూస్తూ.. తప్పుడు వ్యాఖ్యలు చేయటం తప్పు అవుతుంది. ఇదంతా ఎందుకంటే మధ్యప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా చేసిన ఘన కార్యం కారణంగానే.
తాజాగా ఆయన మాట్లాడుతూ చేసిన ఒక వ్యాఖ్య వివాదాస్పదంగా మారటమే కాదు.. ఆయన వ్యాఖ్యలు విన్న ప్రతి ఒక్కరు తిట్టిపోస్తున్నారు. పాకిస్తాన్ తో జరిగిన పోరుకు సంబంధించిన వివరాల్ని మీడియాకు అందజేసిన వీర నారీమణుల్లో సోఫియా ఖురేషీ ఒకరు. ఆమెను మతం కోణంలో చూడటం మధ్యప్రదేశ్ మంత్రి చేసిన ఘోర తప్పిదం. ‘ఉగ్రవాదులు మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచేసి వితంతువుల్ని చేశారు. ఉగ్రవాదుల మతానికి చెందిన సోదరిని.. సైనిక విమానంలో మోడీజీ పాక్ కు పంపించి పాఠం నేర్పించారు’ అంటూ నోరు పారేసుకున్నారు.
ఈ వ్యాఖ్యలు విన్న వారెవరూ ఆయనో బాధ్యత కలిగిన మంత్రిగా భావించరు. ఆయన వ్యాఖ్యలు పెనుదుమారంగా మారాయి. ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న వేళ.. మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఆయన్ను పిలిచి చివాట్లు పెట్టింది. దీంతో తన తప్పును తెలుసుకున్న సదరు మంత్రి.. తాను చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పిస్తే పదిసార్లు క్షమాపణలు చెప్పేందుకు సిద్దంగా ఉన్నట్లు చెప్పారు.
ఉగ్రవాదుల దుశ్చర్యలతో తన మనసు వికలమై అలాంటి వ్యాఖ్యలు చేసినట్లుగా పేర్కొన్నారు. కులాలకు.. మతాలకు అతీతంగా ఖురేషీ చేసిన సేవలకు తాను సెల్యూట్ చేస్తున్నట్లుగా షా స్పష్టం చేశారు. అయినా.. సోఫియా ఖురేషీ లాంటి వారికి మతాన్ని అంటకట్టటానికి మించిన దుర్మార్గం మరొకటి ఉండదు. ఇలాంటి తప్పులు తమ నేతలతో జరగకుండా బీజేపీ అధినాయకత్వం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.