బీజేపీ జనసేన... విజయసాయి షాకింగ్ డెసిషన్ !

త్వరలో కొత్త పార్టీ పెడతాను అని చెబుతూ వస్తున్న వైసీపీ మాజీ నాయకుడు, మాజీ ఎంపీ వి విజయసాయిరెడ్డి ఏపీ రాజకీయాల విషయంలో కొన్ని లెక్కలతో ముందుకు సాగుతున్నారు అని అంటున్నారు.

Update: 2026-10-07 03:41 GMT

త్వరలో కొత్త పార్టీ పెడతాను అని చెబుతూ వస్తున్న వైసీపీ మాజీ నాయకుడు, మాజీ ఎంపీ వి విజయసాయిరెడ్డి ఏపీ రాజకీయాల విషయంలో కొన్ని లెక్కలతో ముందుకు సాగుతున్నారు అని అంటున్నారు. ఆయన ఇపుడు న్యూట్రల్ గానే ఉన్నారు. అయితే ఆయనకు రాజకీయంగా ఏ పార్టీ దగ్గర ఏ పార్టీ దూరం అన్నది కూడా చర్చకు వస్తోంది. వైసీపీని వీడిన ఆయనకు తొలి రాజకీయ ప్రత్యర్ధిగా ఆ పార్టీయే ఉంది అని విశ్లేషిస్తున్నారు.

బ్యాలెన్స్ చేసుకుంటూ :

దానికి తగినట్లుగా వైసీపీనే ఎక్కువగా విజయసాయిరెడ్డి విమర్శిస్తున్నారు. ఆ తరువాత చూస్తే టీడీపీని కూడా ఆయన తప్పు పడుతున్నారు. దానికి కూడా కారణం ఉంది. టీడీపీ ప్రస్తుతం అధికారంలో ఉంది. కేవలం వైసీపీనే విమర్శితే షర్మిల మాదిరిగా ఒక వైపే చూస్తున్నారు అని వ్యక్తిగత పోరాటం కిందకు వస్తుందని రాజకీయ చతురత కలిగిన విజయసాయిరెడ్డికి తెలియనిది కాదనే అంటున్నారు. దాంతో ఆయన వైసీపీని టీడీపీని విమర్శిస్తూ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు అని విశ్లేషిస్తున్నారు.

జనసేన వద్దు :

అయితే జనసేన విషయంలో విజయసాయిరెడ్డి సాఫ్ట్ కార్నర్ ని చూపిస్తున్నారు. తాజాగా విశాఖ నిర్వహించిన ప్రెస్ మీట్ లో కూడా ఆయన జనసేనది కూటమి ప్రభుత్వంలో పరిమితమైన పాత్ర అని వ్యాఖ్యానించారు. జనసేనకు ఉన్నది 21 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే అని గుర్తు చేశారు. 135 సీట్లు కలిగిన టీడీపీయే ప్రభుత్వ నిర్ణయాలు అన్నీ తీసుకుంటోందని కూడా అన్నారు. బీజేపీ ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో పెద్దగా చేసేది ఉండదని అన్నారు. అందుకే తాను ఈ రెండు పార్టీలను విమర్శించను అని ఆయన స్పష్టంగా చెప్పేశారు. తన విమర్శలు ఎపుడూ సహేతుకంగా నిర్మాణాత్మకంగా ప్రజా కోణంలోనే ఉంటాయని ఆయన అంటున్నారు.

భవిష్యత్తు వ్యూహమా :

విజయసాయిరెడ్డి తన కొత్త రాజకీయ పార్టీని అక్టోబర్ నెలాఖరులో ప్రకటిస్తారు అని అంటున్నారు. ఒంటరిగా ఆయన పార్టీని ఈ రోజు స్థాపించినా భవిష్యత్తు వ్యూహాలు ఉంటాయని చెబుతున్నారు. ఇక బీజేపీ మార్క్ హిందూత్వను ఆయన వల్లిస్తున్నారు. దాంతో పాటు ఆ పార్టీని విమర్శించను అంటున్నారు. గతంలో చాలా సార్లు పవన్ తో స్నేహం ఉందని చెప్పారు. ఇపుడు కూడా ఆ పార్టీని విమర్శించేది లేదని చెబుతున్నారు. దీంతో భవిష్యత్తులో ఈ రెండు పార్టీలతో ఏమైనా రాజకీయ స్నేహాలు ఉండొచ్చా అన్న చర్చ అయితే ఉంది. ఇవన్నీ ఊహాగానాలు గానే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ కూటమి నుంచి విడిపోయేది ఉండదని గుర్తు చేస్తున్నారు. అయితే రాజకీయాల్లో ఎపుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు అని కూడా చెప్పాల్సి ఉంది. ఈ లెక్కన చూస్తే విజయసాయిరెడ్డి తన పోరాటం అంతా ఆ రెండు పార్టీల మీదనే అని డైరెక్ట్ గానే చెప్పేస్తున్నారు. ఒక పార్టీ అయిదేళ్ళు పాలించి దిగిపోయింది. మరో పార్టీ పాలిస్తోంది. కాబట్టి రాష్ట్ర ప్రజల తరఫున ఆ రెండు పార్టీలనే నిలదీస్తాను అని అంటున్నారు. దీంతో జనసేన బీజేపీల విషయంలో విజయసాయిరెడ్డిది వ్యూహాత్మకమైన వైఖరిగా చూడాలా లేదా లాజిక్ తో ఆయన తీసుకున్న డెసిషన్ గా భావించాలా అంటే దానికి కాలమే బదులు ఇవ్వాల్సి ఉంది.

Tags:    

Similar News