విజయ్ సర్కార్ కూలుతుందా...చరిత్ర ఏమి చెబుతోంది ?
తమిళనాడులో ఒక సినీ నటుడు అధికారం అందుకున్నారు. రెండు ప్రధానమైన ద్రవిడ పార్టీలను కాదని మరీ ప్రజలు దళపతి విజయ్ నాయకత్వంలోని టీవీకేకి పట్టం కట్టారు.
తమిళనాడులో ఒక సినీ నటుడు అధికారం అందుకున్నారు. రెండు ప్రధానమైన ద్రవిడ పార్టీలను కాదని మరీ ప్రజలు దళపతి విజయ్ నాయకత్వంలోని టీవీకేకి పట్టం కట్టారు. ఆయన పార్టీని అతి పెద్ద పార్టీగా 108 సీట్లతో ముందు నిలబెట్టారు. తమకు కొత్త నేత కావాలని భావించి విజయ్ కి పగ్గాలు అందించారు. ఇక విజయ్ చూస్తే సినీ అనుభవం తప్ప రాజకీయ అనుభవం పెద్దగా లేదు. అంతే కాదు ఆయనకు రాజకీయ నేపథ్యం ఉన్న దగ్గర వారూ లేరు. ఆయన ఎమ్మెల్యే కూడా ఏనాడూ కాలేదు. ఎకాఎకీన ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కేశారు. తమిళనాడు వంటి అత్యంత చైతన్యవంతమైన గడ్డ మీద విజయ్ ముఖ్యమంత్రిత్వం కత్తి మీద సాము అనే చెప్పాలి. రెండు ద్రవిడ పార్టీల అస్థిత్వం కూడా ఆయనకు మరో సవాల్ గా ఉంటుంది.
ఎంజీఆర్ ప్రభుత్వం బర్తరఫ్ :
తమిళనాడు చరిత్రలో అత్యంత ప్రజాదరణ కలిగిన ఎంజీఆర్ ప్రభుత్వం 1977లో అధికారంలోకి వచ్చింది. డీఎంకే నుంచి బయటకు వచ్చి ఎంజీఆర్ పార్టీ పెట్టి మరీ అఖండ విజయం సొంతం చేసుకున్నారు. కానీ మూడేళ్ళు తిరగకుండానే ఆయన ప్రభుత్వాన్ని ఆనాటి ఇందిరా గాంధీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం బర్తరఫ్ చేసింది. 1980 ఫిబ్రవరి 17న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 356ను ఉపయోగించి రాష్ట్ర శాసనసభను రద్దు చేయడంతో తమిళనాడులోని ఎం.జి. రామచంద్రన్ ప్రభుత్వం కుప్ప కూలింది. 1980 లోక్‌సభ ఎన్నికలలో ప్రధానమంత్రి ఇందిరా గాంధీ కేంద్రంలో విజయం సాధించింది. అలాగే తమిళనాడులో డీఎంకేతో పొత్తు పెట్టుకుని 20 ఎంపీ సీట్లు గెలిచింది. డీఎంకేకి 16 దక్కాయి. ఒక ఇండిపెండెంట్ గెలిచారు ఆ లోక్ సభ ఎన్నికల్లో అన్నా డీఎంకేకి 2 సీట్లు మాత్రమే దక్కాయి. దాంతో ఏఐఏడీఎంకే ప్రజాభిమానం కోల్పోయిందని కాంగ్రెస్ ఎంజీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. అయితే ఆ తరువాత అదే ఏడాది జూన్‌లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఏఐఏడీఎంకే భారీ మెజారిటీతో ఎంజీఆర్ నాయకత్వంలో తిరిగి అన్నా డీఎంకే అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ నిర్ణయం తప్పు అని నిరూపించింది. అలా 1987లో ఎంజీఆర్ మరణించే వరకు అధికారంలోనే కొనసాగారు.
కరుణానిధి సైతం :
ఇక 1989లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 150కి పైగా సీట్లు డీఎంకే సాధించింది. అలా కరుణానిధి మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన అప్పట్లో నేషనల్ కేంద్రంలోని కాంగ్రెసేతర పక్షాల కూటమిలో ఉన్నారు. అయితే 1991 జనవరి 30న కరుణానిధి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. కాంగ్రెస్ మద్దతుతో ఏర్పడిన ప్రధానమంత్రి చంద్రశేఖర్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అలా కరుణానిధి రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించడానికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 356ను ఉపయోగించింది. కరుణానిధి నేతృత్వంలోని ప్రభుత్వానికి లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం మధ్య సంబంధాలు ఉన్నాయన్న తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఆ తరువాత జయలలిత నాయకత్వంలోని అన్నా డీఎంకే 1991 జూన్ 24న ఏర్పడింది. అన్నా డీఎంకే-కాంగ్రెస్ కూటమికి జయలలిత నాయకత్వం వహించి భారీ విజయం సాధించారు. అన్నాఎంకే-కాంగ్రెస్ కూటమి 234 స్థానాలకు గానూ 225 స్థానాలను గెలుచుకుని చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. డీఎంకే కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. అలా ఆమె తమిళనాడుకు తొలి ముఖ్యమంత్రి అయ్యారు. తో తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు.
ఎన్టీఆర్ విషయంలోనూ :
ఇక ఉమ్మడి ఏపీలోనూ 1983లో 200 సీట్లు సాధించి టీడీపీ అధినేత ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. 1984లో ఆయన ప్రభుత్వాన్ని కాంగ్రెస్ బర్తరఫ్ చేసింది. కానీ నెల తిరగకుండానే రామారావుకు అధికారం అప్పగించి భారీ మూల్యం చెల్లించుకుంది 2013లో ఆప్ ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. ఆ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడితే 13 నెలలకే ఎన్నికలకు తిరిగి వెళ్ళిన కేజ్రీవాల్ మొత్తం 70 సీట్లు ఉన్న అసెంబ్లీలో 67 సాధించి బంపర్ విక్టరీ కొట్టి అయిదేళ్ళూ కొనసాగారు.
విజయ్ ని దెబ్బ తీస్తే :
ఇక తమిళనాడులో విజయ్ మీద జనాలకు ఎంతో అభిమానం ఉంది కాబట్టే అన్ని సీట్లు ఇచ్చారు. ఆయన పాలనను అయిదేళ్ళూ కొనసాగనీయాలి. అలా కాదూ అని ఆరు నెలలలో కుప్ప కూల్చే ప్రయత్నాలు ఎవరు చేసినా భారీ మూల్యం చెల్లించుకుంటారు అన్నది చరిత్ర చెబుతున్న సత్యం. 2031లో టీవీకే పాలన మీద ప్రజలే తీర్పు చెబుతారు. అంత వరకూ ఆగకపోతే మాత్రం ఎంజీఆర్ ఎన్టీఆర్ కరుణానిధిల మాదిరిగా విజయ్ కి కూడా మరింత శక్తిని ఇచ్చి ఆయనను ప్రత్యర్థులే బలోపేతం చేస్తారు అన్నది ఫ్లాష్ బ్యాక్ చెబుతోంది.