జగన్ తులాభారం ఎటు వైపు...బీజేపీకేనా ?
ఇక విపక్షంలో వైసీపీ ఉంది. ఆ పార్టీకి లోక్ సభలో నలుగురు ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో ఏడుగురు ఎంపీలు ఉన్నారు. అలా 11 మంది ఎంపీల బలం వైసీపీకి ఉంది.;
దేశంలో ఒక ఎన్నికకు రంగం సిద్ధం అయింది. సోమవారం రాత్రి అకస్మాత్తుగా ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ తన పదవికి రాజీనామా చేసి సంచలనం రేపారు. అయితే అది ఇండియా కూటమికి దేశ ప్రజలకు మాత్రమే సంచలనంగా నమోదు అయినది. ఎన్డీయే కూటమి నింపాదిగానే వ్యవహరించింది.
జగదీప్ ధన్ ఖర్ రాజీనామా ఆమోదం కొత్త ఉప రాష్ట్ర పతి ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం రంగంలోకి దిగడం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ఉప రాష్ట్రపతిని లోక్ సభ రాజ్యసభ ఎంపీలు కలిసి ఉన్న ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. అక్కడ మెజారిటీని బట్టి కొత్త ఉప రాష్ట్రపతి వస్తారు.
ప్రస్తుతం ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీయే కూటమికే మెజారిటీ ఉంది. ఇక ఎన్నిక అంటూ జరిగితే ఇండియా కూటమి నుంచి తమ అభ్యర్ధిని పోటీలో పెట్టడం ఖాయం. ఏపీ విషయానికి వస్తే ఎన్డీయే అధికారంలో ఉంది. మొత్తం పాతిక లోక్ సభ ఎంపీలలో 21 మంది ఎన్డీయేకు ఉన్నారు. అలాగే మొత్తం 11 మంది రాజ్యసభ సభ్యులలో నలుగురు ఎన్డీయేకు ఉన్నారు. అటే పాతిక ఓట్లు అన్న మాట. టీడీపీ జనసేన బీజేపీకి చెందిన ఎంపీల ఓట్లు ఇవి.
ఇక విపక్షంలో వైసీపీ ఉంది. ఆ పార్టీకి లోక్ సభలో నలుగురు ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో ఏడుగురు ఎంపీలు ఉన్నారు. అలా 11 మంది ఎంపీల బలం వైసీపీకి ఉంది. ఇక ఏ ఎన్నిక అయినా తన బలం కంటే ఎక్కువ సాధించి జాతీయ స్థాయిలో ఇండియా కూటమిని దెబ్బ తీయడం ఎన్డీయే వ్యూహంలో భాగం. ఆ విధంగా చూస్తే అటు ఎన్డీయే ఇటు ఇండియా కూటమి కాకుండా తటస్థ పార్టీలు ఉన్నాయి. అవి ఏపీలో వైసీపీ, ఒడిషాలో బిజూ జనతాదళ్, తెలంగాణాలో బీఆర్ఎస్, జాతీయ స్థాయిలో ఆప్, అలాగే బీఎస్పీ లాంటివి.
ఇక ఏపీ వరకూ చూసుకుంటే ఈ కీలకమైన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ ఎవరికి మద్దతుగా నిలుస్తుంది అన్నది చర్చగా ఉంది. 2022లో జరిగిన రాష్ట్రపతి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ ఎన్డీయే అభ్యర్థులకు ఓటేసింది. అపుడు ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది. విపక్షంలో ఉన్న టీడీపీ కూడా ఎన్డీయే అభ్యర్థులకు ఓటేసింది. అలా ఏపీలో మొత్తం ఎంపీల ఓట్లు ఎన్డీయేకే పడ్డాయి.
ఇపుడు కూడా అలాగే జరుగుతుందా అన్న చర్చ అయితే ఉంది కానీ ఏపీలో రాజకీయం చాలా మారింది. వైసీపీ విపక్షంలోకి వచ్చిన దగ్గర నుంచి చాలా రకాలుగా ఇబ్బందులు పడుతోంది. అంతే కాదు ప్రస్తుతం లిక్కర్ స్కాం వ్యవహారం పీక్స్ కి చేరింది. వైసీపీకి చెందిన బిగ్ షాట్స్ ని జైలులో వేస్తున్నారు.
ఈ క్రమంలో వైసీపీ వైఖరిలో మార్పు ఏమైనా ఉంటుందా అన్నదే చర్చగా ఉంది. అయితే కేంద్రంలోని బీజేపీ పెద్దలతో వైసీపీ అధినేత జగన్ కి మంచి రిలేషన్స్ ఉన్నాయని ప్రచారంలో ఉంది. ఇక బీజేపీ పెద్దల విషయం తీసుకుంటే వారు ఎపుడూ ఒకరినే నమ్ముకోరు. పైగా కాంగ్రెస్ జాతీయ స్థాయిలో బలపడరాదు అన్నది వారి కోరిక. అందుకే టీడీపీతో చెలిమి చేస్తూనే వైసీపీకి కూడా 2014 నుంచి 2019 దాకా పరోక్ష మద్దతు ఇస్తూ వచ్చారు.
ఇపుడు కూడా అలాంటి అవగాహన ఉంటుందని అనుమానాలు అయితే ఉన్నాయి. మరో వైపు చూస్తే వైసీపీ గడచిన రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఎన్డీయే అభర్ధులకే తమ పార్టీ తరఫున ఓటేయించారు అని చెబుతున్నారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి వైపు ఉండరని చెబుతున్నారు. అందువల్ల జగన్ మద్దతు ఎన్డీయేకే ఉంటుంది అని చెబుతున్నారు.
ఇక జాతీయ స్థాయిలో చూస్తే ఉప రాష్ట్రపతి ఎన్నికల వేళ ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం లోక్ సభ రాజ్యసభ ఎంపీల ఓట్లు 786 అయితే ఎన్డీయేకు 422 మంది ఎంపీల మద్దతు ఉంది. ఇండియా కూటమిలో కాంగ్రెస్ కి 150 మంది దాకా ఎంపీల బలం ఉంది. అయినా సరే బీజేపీ ఏ ఒక్కరూ తమ వైపు నుంచి జారిపోకుండా చూసుకుంటుంది అని అంటున్నారు. ఆ లెక్క చూస్తే కనుక జగన్ మద్దతు కచ్చితంగా ఎన్డీయేకు దక్కుతుందని అంటున్నారు. ఒక వేళ జగన్ ఎన్డీయేకు అండగా ఉంటే ఏపీ రాజకీయాల్లో కీలకమైన మార్పులు సంభవించడం ఖాయమని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.