వైసీపీ మాజీ ఎమ్మెల్యే... గోడ మీద పిల్లి అవుతారా ?

వైసీపీలో ఒక మాజీ ఎమ్మెల్యే తీరు మీద సొంత పార్టీలోనే చర్చ సాగుతోంది. ఆయన చూపు కూటమి వైపుగా ఉందని అనుమానిస్తున్నారు.;

Update: 2025-06-20 03:15 GMT
వైసీపీ మాజీ ఎమ్మెల్యే... గోడ మీద పిల్లి అవుతారా ?

వైసీపీలో ఒక మాజీ ఎమ్మెల్యే తీరు మీద సొంత పార్టీలోనే చర్చ సాగుతోంది. ఆయన చూపు కూటమి వైపుగా ఉందని అనుమానిస్తున్నారు. ఆయనే విశాఖ జిల్లా దక్షిణ నియోజకవర్గం వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. ఆయన వైసీపీలో ఉంటున్నారు కానీ మనసు మాత్రం టీడీపీ మీద ఉందని పుకార్లు షికారు చేస్తున్నాయి.

ఆయన వైసీపీలో ఉన్నా తన సొంత అనుచరులతోనే ఉంటారు. మొదటి నుంచి వైసీపీలో ఉన్న వారితో పెద్దగా కలవరు. ఈ వర్గ పోరు కారణంగానే చాలా మంది 2024 ఎన్నికల ముందు వైసీపీని వీడిపోయారు. ఇక 2024 ఎన్నికల్లో ఓటమి తరువాత వాసుపల్లి పెద్దగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడం లేదని అంటున్నారు.

అంతే కాదు ఆయన పార్టీ విధానాలను కొన్ని సార్లు బాహాటంగా విమర్శిస్తున్నారు. పార్టీలో రీజనల్ కో ఆర్డినేటర్ల వ్యవస్థని వైసీపీ కొత్తగా తెచ్చింది. ఈ వ్యవస్థ ఎక్కడా లేదు. ఏ పార్టీలోనూ లేదు. వైసీపీకి అది అచ్చి రాకున్నా బూమరాంగ్ అయినా కూడా అదే స్ట్రక్చర్ తో పార్టీని నడుపుతోంది.

దీని మీద చాలా మంది మనసులో ఏమనుకున్నా హైకమాండ్ నిర్ణయానికి ఓకే అంటున్నారు. అయితే వాసుపల్లి మాత్రం బాహాటంగానే తన అభిప్రాయాన్ని చెప్పేస్తున్నారు రీజనల్ కో ఆర్డినేటర్ల వ్యవస్థ ద్వారా పార్టీకి లాభం కంటే నష్టం అంటున్నారు. జగన్ కి పార్టీ నాయకులకు మధ్య అడ్డుగోడ అని కూడా ఆయన కుండబద్ధలు కొడుతున్నారు.

మరో వైపు చూస్తే ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి ఎలాగైనా గెలవాలని చూస్తున్నారు. విశాఖ దక్షిణంలో వైసీపీ బలహీనంగా ఉంది. కూటమి బలంగా పటిష్టంగా ఉంది. పైగా అక్కడ టీడీపీలో సరైన నాయకులు లేరు. ప్రస్తుతానికి ఇంచార్జిగా సీతం రాజు సుధాకర్ ని నియమించారు. ఆయన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు. టీడీపీ వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇస్తుందని అనుకోవడం లేదు.

బీసీలు ఎక్కువగా ఉన్న దక్షిణ నియోజకవర్గం మత్స్యకారుల జనాభా అధికంగా గల సీటు. దాంతో అదే సామాజిక వర్గానికి చెందిన వాసుపల్లి ఇప్పటికి రెండు సార్లు గెలవగలిగారు. అది కూడా టీడీపీ చలవతోనే. దాంతో ఆయన మరోసారి టీడీపీలోకి వెళ్ళి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుంటే చాలు గెలుస్తాను అని నమ్ముతున్నారు.

అయితే అది ఇపుడే జరగకపోవచ్చునని ఎన్నికల ముందు అయినా పార్టీలో చేరేందుకు తలుపులు బార్లా తీస్తారని ఆలోచిస్తున్నారు అంటున్నారు. అందుకే కూటమిని పెద్దగా విమర్శించకుండా తన విద్యా సంస్థలు తన వ్యాపకాలు తన పనేంటో తాను అన్నట్లుగా ఉన్నారని అంటున్నారు. ఇక దక్షిణంలో వైసీపీకి ఒకనాడు బహుళ నాయకత్వం ఉంది. ఇపుడు చూస్తే సరైన వారు ఎవరూ లేరు. వైసీపీ ప్రతీ ఎన్నికలోనూ ఒకరికి టికెట్ ఇస్తూ ప్రయోగాలు చేస్తోంది. దాంతో మిగిలిన వారు సహకరించడం లేదు అని అంటున్నారు.

ఇక ఓసీలు మధ్యతరగతి వర్గం ఉన్నారు. వారు కూటమి వైపు మొగ్గు చూపిస్తున్నారు. దాంతో వైసీపీకి ఇబ్బందిగా మారుతోంది. ధీటైన నాయకుడు ఉంటే అన్నీ కాసుకుని గెలుపు తీరాలకు పార్టీని చేర్చగలరని భావిస్తోంది. కానీ అది జరగడం లేదు కదా ఉన్న నాయకులు కూడా పక్క చూపులు చూడడం వైసీపీకి ఇబ్బందిగా ఉంది అని అంటున్నారు. మొత్తానికి వాసుపల్లి గోడ మీద పిల్లిగా ఉన్నారా అన్న చర్చ సాగుతోంది. అయితే ఆయన మాత్రం తాను వైసీపీని వీడను అనే చెబుతున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News