వంశీ పాలిటిక్స్: అనారోగ్యంతో బెయిల్‌పై వచ్చి.. షటిల్ ఆడుతూ!
ఎట్టకేలకు తనకు అనారోగ్యం ఉందని.. ఆస్థమా సహా.. ఇతర సమస్యలు ఉన్నాయని కోర్టుకు తెలిపి.. చివరి కేసు వరకు కూడా బెయిల్ పోరాటం కొనసాగించి.. బెయిల్ పొందారు.;
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. గత నెల రోజుల కిందటి వరకు మీడియాలో జోరుగా వినిపించిన పేరు. పలు కేసుల్లో చిక్కుకుని ఆరు మాసాలకు పైగా విజయవాడ జైల్లోనే గడిపారు. అనేక కేసులు ముసురుకున్నాయి. ఎన్నికలకు ముందు నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చారన్న కేసు నుంచి టీడీపీ కార్యకర్తను బెదిరించి, అపహరించిన కేసు వరకు.. అనేకం ఉన్నాయి. వాటన్నింటిని పోలీసులు తిరగదోడారు. మొత్తంగా ఆయా కేసుల్లో బెయిల్ వచ్చినా.. మరో కేసులో జైలు.. అన్నట్టుగా వంశీ జైల్లోనే గడిపారు.
ఎట్టకేలకు తనకు అనారోగ్యం ఉందని.. ఆస్థమా సహా.. ఇతర సమస్యలు ఉన్నాయని కోర్టుకు తెలిపి.. చివరి కేసు వరకు కూడా బెయిల్ పోరాటం కొనసాగించి.. బెయిల్ పొందారు. నిజానికి వంశీ జైల్లో ఉన్నప్పుడు.. తర్వాత ఆయన ను కోర్టుకు హాజరు పరిచినప్పుడు.. ఫొటోలు వెలుగు చూశాయి. తీవ్రస్థాయిలో దగ్గుతూ.. మొహం అంతా పాలిపోయి కనిపించారు. దీంతో వైసీపీ నాయకులు.. పెద్ద ఎత్తున దీనిపై యాగీ చేశారు. వంశీని అనారోగ్యంతో చంపేయాలని ప్లాన్ చేశారని మాజీ మంత్రి పేర్ని నాని మీడియా ముందు తీవ్ర విమర్శలు చేశారు.
కట్ చేస్తే.. ఇప్పుడు వంశీ.. షటిల్ ఆడుతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. మొత్తంగా నలుగురు ఆడుతున్న షటిల్‌లో వంశీ ఒకవైపు కనిపించారు. చాలా ఉత్సాహంగా ఆయన జంప్ చేస్తూ.. మరీ షటిల్ బ్యాట్ తో కనిపించారు. అంటే.. ఆయన ఆరోగ్యం మెరుగు పడినట్టేనా? లేక, గతంలోనూ ఇలానే ఉన్నారా? అంటూ.. టీడీపీ నాయకులు కామెంట్లు చేస్తున్నారు. ప్రతిసారీ వంశీ అరెస్టు, బెయిలు సందర్భాల్లో ఆయన అనారోగ్యాన్ని హైలెట్ చేసిన ఓ వర్గం నాయకులు ఇప్పుడు మౌనంగా ఉండడం గమనార్హం. ఏదేమైనా.. వంశీ ఆరోగ్యం మెరుగుపడడంతో గన్నవరంలోని ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.