‘సోషల్’ ఖాతాల చెకింగ్ ఏంది.. అంతకంతకూ పెరుగుతున్న అమెరికా అతి

మానసిక పరిపక్వత మొదలుకొని మరెన్నో విషయాల్లో మార్పులు కాలానికి అనుగుణంగా వచ్చేస్తుంటాయి. వీటిని వదిలేసి.. సోషల్ మీడియా ఖాతాల ఆధారంగా వ్యక్తుల తీరును విశ్లేషించటం ఎంతవరకు సబబు? అన్నది ప్రశ్న.;

Update: 2025-12-11 04:09 GMT

మనసులోని ఉద్వేగాల్ని.. భావాల్ని నలుగురితో పంచుకోవటానికి వేదికగా నిలిచిన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వ్యక్తి గుణగణాల్నిడిసైడ్ చేస్తారా? ఒక వ్యక్తి వ్యక్తిత్వం.. అతడి మంచితనం.. మైండ్ సెట్ మొత్తానికి అతని సోషల్ మీడియా ఖాతా ప్రతిబింబిస్తుందా? కొందరు తమ భావాల్నిస్వేచ్ఛగా వెల్లడిస్తారు. మరికొందరు అందుకు భిన్నంగా వ్యవహరిస్తారు. అంతెందుకు.. భావాలు.. అభిప్రాయాలు కాలానికి అనుగుణంగా మారుతూ ఉంటాయి. ఐదేళ్ల క్రితం ఉన్నట్లుగా ఇప్పుడు ఉండం. ఇవాళ ఉన్నట్లుగా మరో పదేళ్లకు ఉండం.

మానసిక పరిపక్వత మొదలుకొని మరెన్నో విషయాల్లో మార్పులు కాలానికి అనుగుణంగా వచ్చేస్తుంటాయి. వీటిని వదిలేసి.. సోషల్ మీడియా ఖాతాల ఆధారంగా వ్యక్తుల తీరును విశ్లేషించటం ఎంతవరకు సబబు? అన్నది ప్రశ్న. ప్రపంచంలో మరే దేశంలోనూ లేని విధంగా మనసులోని భావాల్ని స్వేచ్ఛగా ప్రకటించే తీరు అగ్రరాజ్యం అమెరికాలో ఎక్కువని.. అదే ఆ దేశానికున్న ప్రత్యేక సౌందర్యంగా అభివర్ణించేటోళ్లు ఎంతోమంది. కానీ.. ట్రంప్ ప్రభుత్వం రెండోసారి కొలువు తీరిన తర్వాత వీసాల జారీ విషయంలో ఆ దేశం వ్యవహరిస్తున్న తీరు అంతకంతకూ మారుతోంది.

తాజాగా వీసా ఇంటర్వ్యూలను హటాత్తుగా వాయిదా వేసిన వైనాన్ని చూస్తే.. అగ్రరాజ్య వ్యవహారశైలి ఏ మాత్రం సరిగా అనిపించదు. అమెరికాకు వెళ్లాలనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరూ.. దాన్ని ఒక ప్రణాళికగా చేస్తుంటారు. ఉద్యోగాలకు కావొచ్చు.. కుటుంబ అవసరాలకు కావొచ్చు.. మరి దేనికైనా సరే. తాజాగా హెచ్ 1బీ వీసా ఇంటర్వ్యూలను హటాత్తుగా వాయిదా వేయటం ద్వారా అటు వ్యక్తులు మాత్రమే కాదు.. ఇటు కంపెనీలు సైతం తీవ్ర ఇబ్బందులకు గురవుతాయన్న విషయాన్ని మర్చిపోకూడదు.

కానీ.. ఇవేం పట్టని అగ్రరాజ్యం తాను అనుకున్నది మాత్రమే సరైనదిగా భావించటం.. ఎడాపెడా నిర్ణయాలు తీసుకోవటం ఇటీవల కాలంలో ఎక్కువైంది. తాజాగా చూస్తే.. డిసెంబరులో జరగాల్సిన ఇంటర్వ్యూలను నిరవధికంగా వాయిదా వేయటమే కాదు.. మళ్లీ ఎప్పుడు ఉంటాయన్న సమాచారాన్ని ఇచ్చింది లేదు. ఇంటర్వ్యూలను వాయిదా వేస్తున్నట్లుగా ఈ మొయిల్ పంపి చేతులు దులుపుకున్న ఇమ్మిగ్రేషన్ వర్గాల తీరుపై మండిపాటు వ్యక్తమవుతోంది. అలా అని ఆ విషయాన్ని బాహాటంగా వ్యక్తపర్చలేని దుస్థితి.

హెచ్ 1బీ వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్స్ ను.. సోసల్ మీడియాలో వారుచేసిన పోస్టులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్న అమెరికా ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఆదేశాలతో తాజా పరిస్థితి నెలకొంది. అనుమానాస్పద.. అభ్యంతరకరమైన పోస్టులు చేసినట్లుగా తేలితే వీసా లభించదని ట్రంప్ ప్రభుత్వం పరోక్షంగా స్పష్టం చేయటం తెలిసిందే. ప్రొఫైల్స్ సైతం అనుమానాస్పదంగా ఉంటే వీసా ఇంటర్వ్యూలకు పిలుపు రాదని చెబుతున్నారు. ఇదంతా చూస్తే.. రాబోయే రోజుల్లో అమెరికా వీసాలకు అనుగుణంగా సోషల్ మీడియా ఖాతాల్ని వినియోగించే తీరు మొదలు కావొచ్చు. వాస్తవానికి గడిచిన నాలుగైదేళ్లుగా పలువురు తమ సోషల్ మీడియా ఖాతాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇలాంటి వారిలో అమెరికా తనిఖీ చేస్తున్న అనుమానాస్పద వ్యక్తుల్ని ఎలా గుర్తిస్తారు? నిజానికి.. తప్పుడు ఆలోచనలు ఉన్నోళ్లు పక్కా ప్లానింగ్ తో వ్యవహరిస్తారు. తమ పట్ల అనుమానం వ్యక్తం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటోళ్లను ఎలా గుర్తిస్తారు? అన్నది ప్రశ్న. ఇదే సమయంలో.. మనసులో ఏదీ పెట్టుకోకుండా తమ అభిమానాన్ని.. ఆగ్రహాన్ని.. ఆవేశాన్ని వ్యక్తపరిచేటోళ్లు ఉంటారు. నిజానికి ఈ తరహా వ్యక్తుల కారణంగా సమాజానికి ఎలాంటి నష్టం ఉండదు.కానీ.. వారి భావోద్వేగాల్ని తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. ఈ అంశాలన్నింటిని పక్కన పెడితే.. ప్రపంచంలోనే స్వేచ్ఛ ఎక్కువగా ఉండే దేశంలో ఆ స్వేచ్ఛకు సంకెళ్లు వేసేలా వ్యవహరించే తీరు ఎంతవరకు సబబు? అన్నది ప్రశ్న. చూస్తుంటే.. అమెరికా తన ఆత్మను పూర్తిగా మార్చేస్తుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. కాలగర్భంలో కలిపేసేందుకు వీలుగా అక్కడి ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని చెప్పొచ్చు. కాదంటారా?

Tags:    

Similar News