గాజా ప్రజలపై మరో పిడుగు.. ఈసారి అమెరికా వంతు!
అవును... ఇప్పటికే ఇజ్రాయెల్ దెబ్బతో గజ గజ వణికిపోతున్న గాజా ప్రజలపై మరో బాంబు పేలింది.;
ప్రస్తుతం ఈ ప్రపంచంలో యుద్ధం కారణంగా ప్రత్యక్ష నరకం చూస్తున్న ప్రజలు గాజాలో ఉన్నారని చెప్పినా ఆతిశయోక్తి కాదేమో. ఇజ్రాయెల్ విషయంలో హమాస్ ఉగ్రవాదులు చేసిన ఒక్కపని.. వారి జీవితాలను మొత్తం తలకిందులు చేసేసింది. ఇప్పట్లో తేరుకోలేని స్థితిలోకి నెట్టేసింది. మరోవైపు ఎవరు ఎన్ని చెప్పినా హమాస్ చాప్టర్ క్లోజ్ అవ్వకుండా వదిలిపెట్టేది లేదని ఇజ్రాయెల్ చెబుతోంది. ఈ సమయంలో గాజా ప్రజలపై మరో పిడుగు పడింది.
అవును... ఇప్పటికే ఇజ్రాయెల్ దెబ్బతో గజ గజ వణికిపోతున్న గాజా ప్రజలపై మరో బాంబు పేలింది. ఓపక్క ఇజ్రాయెల్ వణికించేస్తోన్న వేళ.. ఇకపై గాజా ప్రజలకు వీసాలు నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడుల్లో గాయపడిన అనేకమంది గాజా ప్రజలు చికిత్స కోసం అమెరికాకు క్యూ కడుతున్నారని డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగానికి ఫిర్యాదు అందడంతో తక్షణం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా స్పందించిన అమెరికా విదేశాంగ శాఖ.. తాత్కాలిక వైద్య మానవతా వీసాలను జారీ చేయడానికి ఉపయోగించే ప్రక్రియపై సమీక్ష నిర్వహిస్తున్నామని.. ఈ క్రమంలో గాజా నుంచి అమెరికాకు వచ్చే పాలస్తీనియన్లు హమాస్ కు అనుకూలంగా ఉన్నారని.. హమాస్ కు నిధులు సేకరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదు అందడంతో గాజా ప్రజలకు అన్ని రకాల వీసాలు నిలిపివేస్తున్నామని తెలిపింది.
ఇదే సమయంలో.. గతవారం తీవ్రంగా గాయపడిన 11మంది పాలస్తీనియన్ చిన్నారులకు అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ 'హీల్ పాలస్తీనా' వైద్య చికిత్స కోసం యూఎస్ కు చేరుకోవడానికి సహకరించిందని చెప్పిన అమెరికా విదేశాంగ శాఖ... ఈ విధంగా పెద్ద మొత్తంలో ప్రజలను తరలించడం సరైనచర్య కాదని పేర్కొంది. దీంతో.. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇందులో భాగంగా... ట్రంప్ యంత్రాంగం తీసుకున్న నిర్ణయం సరైన చర్య కాదని పలు స్వచ్ఛంద సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా... అమెరికా తీసుకున్న ఈ ప్రమాదకరమైన, అమానవీయ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని 'పాలస్తీనా చిల్డ్రన్స్ రిలీఫ్ ఫండ్' స్వచ్ఛంద సంస్థ డిమాండ్ చేసింది. గత 30 ఏళ్లుగా తాము వేలాదిమంది పాలస్తీనా చిన్నారులను వైద్యం కోసం అమెరికాకు తరలించినట్లు తెలిపింది.
ఇదే సమయంలో... ఇజ్రాయెల్ దాడులు, ఆహార కొరత వల్ల వేలాదిమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతుంటే ఇలాంటి ఆంక్షలు ఎలా విధిస్తారని ప్రశ్నించింది. మరోవైపు హమాస్ కు ఫండ్స్ అందించే విషయంలో ప్రతీ డాలర్లు అడ్డుకునేలా అమెరికా చర్యలు తీసుకుంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు!