ట్రంప్‌ ప్రభుత్వ కొత్త బిల్లుతో అమెరికాలో భారతీయులకు ముప్పు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారు తాజాగా తీసుకువచ్చిన హెచ్.ఆర్.875 బిల్లు ఈ ఆందోళనలకు ప్రధాన కారణం.;

Update: 2025-08-26 06:35 GMT

అమెరికాలో నివసిస్తున్న వలసదారులకు, ముఖ్యంగా భారతీయులకు గతంలో ఉన్న కొన్ని సాధారణ కేసుల కారణంగా భవిష్యత్తులో తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. గతంలో జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ (DUI డ్రంక్ అండర్ ద ఇన్ఫ్యూయేన్స్) కేసుల కారణంగా గ్రీన్‌కార్డు హోల్డర్లు.. వీసాదారులు ఇప్పుడు దేశ బహిష్కరణకు గురయ్యే ప్రమాదంలో పడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారు తాజాగా తీసుకువచ్చిన హెచ్.ఆర్.875 బిల్లు ఈ ఆందోళనలకు ప్రధాన కారణం. ఈ బిల్లుకు ఇప్పటికే ప్రతినిధుల సభలో ఆమోదం లభించింది, ఇప్పుడు అది సెనేట్‌లో చట్టంగా మారే దిశగా ముందుకు సాగుతోంది.

- బిల్లులో ప్రధాన ఉద్దేశాలు

ఈ బిల్లు అధికారికంగా "జరిమీ అండ్ ఏంజల్ సీయీ అండ్ సార్జెంట్ బ్రాండన్ మెన్డోజా ప్రొటెక్ట్ అవర్ కమ్యూనిటీస్ ఫ్రమ్ డ్రంక్ అండర్ ఇన్‌ఫ్లూయన్స్ ఆక్ట్" పేరుతో ప్రవేశపెట్టబడింది. దీని ఉద్దేశం ఒక్కటే.. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను వలసదారులకు సంబంధించిన ఇమ్మిగ్రేషన్ నేరంగా పరిగణించడం.

- ఈ బిల్లు చట్టంగా మారితే జరిగే పరిణామాలు

అమెరికా పౌరసత్వం లేని ఏ విదేశీయుడైనా మద్యం లేదా ఇతర మత్తు పదార్థాలు సేవించి వాహనం నడిపితే అది దేశ బహిష్కరణకు లేదా అమెరికాలోకి ప్రవేశానికి నిషేధానికి దారి తీస్తుంది. పది లేదా ఇరవై ఏళ్ల క్రితం జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు కూడా ఈ కొత్త చట్టం వర్తిస్తుంది. గతంలో కేసు ముగిసినా, జరిమానా చెల్లించి బయటపడినా కూడా ఆ కేసులను తిరిగి పరిశీలించి దేశబహిష్కరణకు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇమ్మిగ్రేషన్ న్యాయవాదుల ప్రకారం, ఈ బిల్లు చట్టంగా మారితే, నోటీసు పంపకుండానే లేదా వాదనకు అవకాశం ఇవ్వకుండానే బహిష్కరణ చర్యలు తీసుకునే ప్రమాదం ఉంది.

- భారతీయులపై ప్రభావం

అమెరికాలో పెద్ద సంఖ్యలో ఉన్న భారతీయ వలసదారులపై ఈ బిల్లు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. గ్రీన్‌కార్డు హోల్డర్లతో పాటు, హెచ్-1బీ, విద్యార్థి వీసాలపై ఉన్నవారు కూడా గతంలో ఇలాంటి కేసులను ఎదుర్కొన్నట్లయితే ఇకపై అమెరికాలో ఉండడానికి అవకాశం కోల్పోవచ్చు. వలసదారుల న్యాయవాది జోసెఫ్ ట్సాంగ్ మాట్లాడుతూ "పదేళ్ల క్రితం చిన్నపాటి కేసు ఎదుర్కొని కోర్టు నుంచి క్షమాపణతో బయటపడినా.. ఇప్పుడు ఆ కేసును మళ్లీ తెరచి వ్యక్తిని అమెరికా నుంచి పంపేస్తారు. వాదన చెప్పే అవకాశం కూడా ఇవ్వరు" అని హెచ్చరించారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే, గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు ఉన్న గ్రీన్‌కార్డు హోల్డర్ విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో కూడా ప్రవేశం నిరాకరించే ప్రమాదం ఉంది.

-వలసదారుల ఆందోళనలు

ల్యాండర్‌హోమ్ ఇమిగ్రేషన్ వంటి వలస న్యాయసేవల సంస్థలు ఈ బిల్లుపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. చట్టంగా మారకముందే పాత కేసులు ఉన్నవారు కోర్టులను ఆశ్రయించి తమ వాదనలు వినిపించుకోవడం ఉత్తమం అని ఈ సంస్థలు సూచిస్తున్నాయి. వలసదారుల సంఘాలు, న్యాయవాదులు ఈ బిల్లును విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఇది గతంలో చేసిన తప్పులకే ఇప్పుడు కొత్త శిక్షలను విధిస్తుంది, సరైన న్యాయ ప్రక్రియకు అవకాశం ఇవ్వదు అని వారు వాదిస్తున్నారు.

మొత్తం మీద ఈ బిల్లు చట్టంగా మారితే, ఇది వలసదారుల భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది. గతాన్ని బట్టి భవిష్యత్తును నిర్ణయించే ఈ చట్టం వారి జీవన విధానాలను, కలలను నేరుగా దెబ్బతీస్తుందనే ఆందోళన పెరుగుతోంది. ట్రంప్ ప్రభుత్వం వలసదారులపై కఠిన చర్యలు తీసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ బిల్లును తీసుకొచ్చిందని విమర్శకులు పేర్కొంటున్నారు.

Tags:    

Similar News