ఒసామా బిన్ లాడెన్‌ను పట్టించిన డాక్టర్‌ను విడుదల చేయాలి..అమెరికా ఎంపీ డిమాండ్

పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో నేతృత్వంలోని ప్రతినిధి బృందం గత గురువారం (జూన్ 5, 2025) యునైటెడ్ స్టేట్స్ (USA) ను సందర్శించింది.;

Update: 2025-06-07 12:30 GMT

ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, అల్-ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ ను పట్టుకోవడంలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి సహాయం చేసిన పాకిస్తానీ డాక్టర్ షకీల్ ఆఫ్రిదిని విడుదల చేయాలని అమెరికా ఎంపీ బ్రాడ్ షెర్మాన్ డిమాండ్ చేశారు. పాకిస్తాన్ నుంచి ఒక అఖిలపక్ష ప్రతినిధి బృందం అమెరికాను సందర్శించిన సమయంలో ఆయన ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

పాక్ ప్రతినిధి బృందంతో సమావేశం

పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో నేతృత్వంలోని ప్రతినిధి బృందం గత గురువారం (జూన్ 5, 2025) యునైటెడ్ స్టేట్స్ (USA) ను సందర్శించింది. ఈ సందర్భంగా, ప్రతినిధి బృందం షెర్మాన్‌తో సహా పలువురు అధికారులతో సమావేశమైంది. అనంతరం, షెర్మాన్ ఈ సమావేశ వివరాలను తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' లో పంచుకున్నారు.

"నేను పాకిస్తాన్ బృందానికి తీవ్రవాదంపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించాను. ముఖ్యంగా 2002లో నా నియోజకవర్గంలో డానియల్ పెర్ల్‌ను హత్య చేసిన జైషే మహమ్మద్ సంస్థను అంతం చేయాలని చెప్పాను. పాకిస్తాన్‌లోని ప్రతి ఒక్కరికీ వారి మత విశ్వాసాలపై హక్కు కల్పించాలని, ప్రజాస్వామ్య సంస్థలలో పాల్గొనే హక్కును ఇవ్వాలని నేను బృందానికి సూచించాను. ఒసామా బిన్ లాడెన్‌ను అంతం చేయడానికి మా దేశానికి (అమెరికాకు) సహాయం చేసినందుకు జైలులో ఉన్న డాక్టర్ షకీల్ ఆఫ్రిదిని విడుదల చేయాలని కూడా నేను డిమాండ్ చేశాను" అని షెర్మాన్ తన పోస్ట్‌లో రాశారు. డానియల్ పెర్ల్‌ను టెర్రరిస్ట్ ఒమర్ సయీద్ షేక్ అపహరించి, హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

బిన్ లాడెన్‌ను పట్టుకోవడంలో ఆఫ్రిది పాత్ర

డాక్టర్ ఆఫ్రిది ఒక పాకిస్తానీ వైద్యుడు. బిన్ లాడెన్ కుటుంబ సభ్యుల నుంచి డీఎన్‌ఏ నమూనాలను సేకరించడానికి సీఐఏకు పోలియో టీకా కార్యక్రమాన్ని నిర్వహించడంలో అతను సహాయం చేశాడు. ఈ నేపథ్యంలో 2011లో అమెరికా బలగాలు అబోటాబాద్ మిలటరీ కంటోన్మెంట్ శివార్లలోని ఒక సురక్షిత ప్రాంతంలో దాడి చేసి బిన్ లాడెన్‌ను మట్టుబెట్టాయి. ఇదంతా ఆఫ్రిది వల్లే జరిగిందని అనుమానించిన పాకిస్తాన్ అధికారులు వెంటనే ఆఫ్రిదిని అరెస్టు చేశారు. 2012లో అక్కడి ఒక కోర్టు అతనికి 33 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. అప్పటి నుంచి అతను జైలులోనే ఉన్నాడు. అతని విడుదల కోసం అమెరికా పదే పదే పాకిస్తాన్‌పై ఒత్తిడి తెస్తోంది.

Tags:    

Similar News