బర్త్ రైట్ సిటిజన్ షిప్... ట్రంప్ కు ఐదో కోర్టు షాక్!

రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ పలు కీలక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకాలు చేసిన సంగతి తెలిసిందే.;

Update: 2025-10-05 04:50 GMT

రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ పలు కీలక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. అందులో బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఒకటి. వాస్తవానికి అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం.. అమెరికా గడ్డపై జన్మించిన పిల్లలకు జన్మతః పౌరసత్వం హక్కు సంక్రమించాల్సి ఉంటుంది. దాన్ని ట్రంప్ రద్దు చేయగా.. తాజాగా ఫెడరల్ కోర్టు సంచలన తీర్పు వెలువడించింది.

అవును... అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ట్రంప్ పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బర్త్ రైట్ సిటిజన్ షిప్ ను రద్దు చేశారు. అంటే... దేశంలోని ప్రజల పిల్లలకు ఆటోమేటిక్ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వును జారీ చేశారు. అయితే.. ఈ ఆర్డర్స్ ను ఇప్పటికే నాలుగు ప్రత్యేక సమాఖ్య కోర్టులు తిరస్కరించగా... తాజాగా మరో కోర్టు అదేపని చేసింది.

ఇందులో భాగంగా... బోస్టన్‌ లోని 1వ యూఎస్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌ కు చెందిన ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్.. రిపబ్లికన్ అధ్యక్షుడు ఈ ఉత్తర్వును అమలు చేయలేరని పేర్కొంది. ఈ నేపథ్యంలో... జన్మతః పౌరసత్వంపై అమెరికా సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కాగా... అమెరికాలో 1868లో అంతర్యుద్ధం సమయంలో చేసిన 14వ రాజ్యాంగ సవరణ శరణార్థుల పిల్లలకు జన్మతః పౌరసత్వాన్ని అందిస్తోంది.

రెండో సారి అగ్రరాజ్యం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రోజున 'ప్రొటెక్టింగ్ ది మీనింగ్ అండ్ వాల్యూ ఆఫ్ అమెరికన్ సిటిజన్‌ షిప్' పేరుతో డొనాల్డ్ ట్రంప్ ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను జారీ చేశారు. దీని ప్రకారం... అమెరికాలో పుట్టిన పిల్లలందరికీ పౌరసత్వం ఇవ్వరు. వారి తల్లులు చట్టవిరుద్ధంగా లేదా తాత్కాలిక వీసాపై ఉంటే, తండ్రులు అమెరికన్ పౌరులు లేదా గ్రీన్ కార్డు హోల్డర్లు కాకపోతే వారికి అమెరికా పౌరసత్వం లభించదు.

ఈ నిర్ణయం వెలువడిన వెంటనే... అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్, ఇతర న్యాయవాదులు ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై దావా వేశారు. ఈ సందర్భంగా స్పందించిన అమెరికా న్యాయవాదులు... తమ గడ్డపై జన్మించిన పిల్లలందరూ వారి వారి తల్లితండ్రుల స్థితి, పరిస్థితి, మూలాలతో సంబంధం లేకుండా తమ జాతీయ సమాజంలో సమాన సభ్యులుగా జీవితాన్ని ప్రారంభిస్తారని నొక్కి చెప్పారు.

మరోవైపు అది అమెరికా రాజ్యాంగాన్ని ఉల్లంఘించే ఉత్తర్వు అని పలు కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. ఇందులో భాగంగా... వాషింగ్టన్, ఆరిజోనా, ఇలినాయిస్, ఓరెగాన్ రాష్ట్రాలతో పాటు పలువురు గర్భిణి స్త్రీలు న్యాయస్థానాలను ఆశ్రయించారు.. తమ వాదనలు వినిపించారు. ఈ క్రమంలో... పలు న్యాయస్థానాలు ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టాయి! దీంతో... ట్రంప్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Tags:    

Similar News