ఎన్నికలు జరగట్లేదు కానీ ఆ మాజీ సీఎం రోడ్డు పక్కన జిలేబీ అమ్మకాలు
మాజీ ముఖ్యమంత్రి.. బీజేపీ సీనియర్ నేతల్లో ఒకరు.. హిందుత్వ ప్రచారంతోపాటు..బీజేపీని దేశ వ్యాప్తంగా విస్తరించిన కొందరు ముఖ్యుల్లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఉమాభారతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.;
మాజీ ముఖ్యమంత్రి.. బీజేపీ సీనియర్ నేతల్లో ఒకరు.. హిందుత్వ ప్రచారంతోపాటు..బీజేపీని దేశ వ్యాప్తంగా విస్తరించిన కొందరు ముఖ్యుల్లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఉమాభారతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా కొద్ది కాలంగా పెద్దగా వార్తల్లో లేని ఆమె.. తాజాగా ఆమె చేసిన పనికి ఒక్కసారి వార్తల్లోకి వచ్చారు. అంతేకాదు.. తాను రోడ్డు మీదకు వస్తే ఏం జరుగుతుందోచేతల్లో చూపించిన ఆమె.. అధికారులను పరుగులు తీయించటమే కాదు.. తక్షణం తమ విధానాల్ని మార్చుకునేలా చేయగలగారు.
ఇంతకూ అసలేం జరిగింది? అన్న వివరాల్లోకి వెళితే.. సాధారణంగా ఎన్నికల వేళలో రాజకీయ నేతలు తమ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. రోడ్డు పక్కన ఉండే వ్యాపారులు మొదలు.. ఇళ్ల వద్ద ఉండే వారిలో ఒకరిగా కలిసిపోయేందుకు టీ అమ్మటం.. దోశెలు వేయటం.. పిల్లల్ని దగ్గరకు తీసుకోవటం.. పేదల ఇళ్లల్లో భోజనాలు చేయటం లాంటివి చేస్తుంటారు. తాజాగా మధ్యప్రదేశ్ లో ఎలాంటి ఎన్నికలు లేకున్నా.. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి సొంత పట్టణమైన టికంగఢ్ లో రోడ్డు పక్కన పోహా.. జిలేబీలు అమ్మి ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు.
ఆమె ఈ పని చేయటానికి ఒక పెద్ద కారణం ఉంది. స్థానిక మున్సిపల్ అధికారులు.. జిల్లా యంత్రాంగం అక్రమ కట్టడాల తొలగింపు పేరుతో రోడ్డు పక్కన చిరు వ్యాపారాలు చేసుకునే వారి తోపుడు బండ్లను.. షాపులను జేసీబీలతో తొలగించారు. ఈ తీరును ఆమె తీవ్రంగా తప్పు పట్టారు. తానే స్వయంగా రంగంలోకి దిగిన ఆమె.. తన బంగ్లా బయట ఒక తోపుడు బండి వద్ద కూర్చొని ఆమె స్వయంగా పోహా- జిలేబీలను తయారు చేసి ప్రజలకు విక్రయించారు. ఈ అంశంపై ఆమె తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టారు.
చిన్న వ్యాపారులను తొలగించే ముందు వారికి తగిన ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించాలని ఆమె డిమాండ్ చేయటమే కాదు.. తొలగించిన వ్యాపారులందరినీ తిరిగి తమ బండ్లు అక్కడే ఏర్పాటు చేసుకోవాలని సూచన చేశారు. మాజీ ముఖ్యమంత్రే స్వయంగా రోడ్ల మీదకు వచ్చి.. పోహా -జిలేబీ అమ్ముతున్న వైనంతో ప్రజలు పెద్ద ఎత్తున రావటం.. దీనికి సంబంధించిన వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఈ వినూత్న నిరసనతో ఉన్నతాధికారులు సైతం స్పందించారు.
మున్సిపల్ యంత్రాంగం చేపట్టిన అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేశారు. అధికారులతో ఆమె జరిపిన చర్చల అనంతరం.. వీధి వ్యాపారులకు అనువైన ప్రత్యామ్నాయ స్థలాలని కేటాయిస్తామని చెప్పారు. అదే సమయంలో వ్యాపారులు సైతం రోడ్ల మీద వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకునేలా ఏర్పాట్లు చేసుకోవటం గమనార్హం. మధ్యప్రదేశ్ లో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వమే కొలువుతీరి ఉంది. తన నిరసన నేపథ్యంలో ముందుగానే పార్టీ రాష్ట్ర నాయకత్వానికి సమాచారం ఇవ్వటంతో పాటు.. చేపట్టాల్సిన చర్యల గురించి చెప్పినట్లుగా చెబుతున్నారు. వీధి వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను తాను ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లినట్లుగా పేర్కొన్నారు. ఏమైనా.. మాజీ ముఖ్యమంత్రి చేపట్టిన వినూత్న నిరసనకు సంబంధించిన వీడియో దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది.