ఉక్రెయిన్-రష్యా యుద్ధం.. మాస్కోకు బిగ్ షాక్.. 'లక్ష డ్రోన్ల'తో బ్రిటన్ అండ

రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది.;

Update: 2025-06-04 14:30 GMT

రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఇటీవలి కాలంలో ఉక్రెయిన్, రష్యాలోని కీలక వైమానిక స్థావరాలపై భారీ ఎత్తున డ్రోన్ దాడులు నిర్వహించి, మాస్కోకు చెందిన 41 యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది. ఈ దాడులతో రష్యాకు తీవ్ర నష్టం వాటిల్లింది. సరిగ్గా ఇదే సమయంలో యుద్ధభూమిలో కీలకమైన ఈ డ్రోన్ల వినియోగానికి మరింత బలం చేకూర్చేలా బ్రిటన్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌కు భారీ సంఖ్యలో అత్యాధునిక డ్రోన్లను సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది.

ఉక్రెయిన్‌కు నిరంతర సైనిక మద్దతులో భాగంగా, బ్రిటన్ కీలకమైన డ్రోన్ ప్యాకేజీని ప్రకటించింది. 2026 ఏప్రిల్ నాటికి ఉక్రెయిన్‌కు లక్ష డ్రోన్లను అందజేస్తామని బ్రిటన్ హామీ ఇచ్చింది. ఈ డ్రోన్ ప్యాకేజీ విలువ 350 మిలియన్ పౌండ్లు (భారత కరెన్సీలో సుమారు రూ.3,500 కోట్లకు పైగా). ఇది ఉక్రెయిన్‌కు బ్రిటన్ అందిస్తున్న 4.5 బిలియన్ పౌండ్ల మొత్తం సైనిక మద్దతులో ఒక భాగమంటూ పేర్కొంది. స్వతంత్రంగా ఉత్పత్తి చేసిన 'స్ట్రాటజిక్ డిఫెన్స్ రివ్యూ'ను బ్రిటన్ ప్రభుత్వం ఆమోదించిన తర్వాత ఈ నిర్ణయం వెలువడింది.

రష్యా దురాక్రమణను అడ్డుకునేందుకు భవిష్యత్తులో తలెత్తే బెదిరింపులను ఎదుర్కోవడానికి ఉక్రెయిన్‌కు సైనిక మద్దతు ఇస్తున్నట్లు బ్రిటన్ స్పష్టం చేసింది. బ్రస్సెల్స్‌లో జరగనున్న 50 దేశాల 'ఉక్రెయిన్ డిఫెన్స్ కాంటాక్ట్ గ్రూప్' సమావేశంలో బ్రిటన్ రక్షణ కార్యదర్శి జాన్ హీలీ ఈ ప్రకటన చేయనున్నారు.

రష్యా వద్ద భారీ సంఖ్యలో క్షిపణులు ఉన్నప్పటికీ ఉక్రెయిన్ దగ్గర పెద్ద ఆయుధాలు, పటిష్టమైన గగనతల రక్షణ వ్యవస్థలు లేకపోవడం కీవ్ (ఉక్రెయిన్ రాజధాని)కు ప్రధాన సమస్యగా మారింది. దీంతో రష్యా క్షిపణులు, డ్రోన్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కోవడం కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో రిమోట్ సాయంతో సుదీర్ఘంగా ప్రయాణించగలిగే డ్రోన్ల వ్యవస్థను ఉక్రెయిన్ సొంతంగా అభివృద్ధి చేసుకుంది. వీటితోనే ఇటీవల రష్యాలోని అనేక ప్రాంతాల్లో భారీ దాడులు చేసింది.

గతంలో కూడా ఉక్రెయిన్, రష్యా సైనిక స్థావరాలపై చమురు బావులపై దాడులు చేయడానికి ఈ డ్రోన్లను ఉపయోగించింది. భవిష్యత్తులో రష్యా ఆక్రమణలను మరింత సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మరిన్ని డ్రోన్లను సరఫరా చేయాలని ఉక్రెయిన్ మిత్ర దేశాలను కోరుతోంది. రష్యా, ఉక్రెయిన్‌పై భీకర దాడులకు పాల్పడుతుండడంతో తమ దేశాన్ని రక్షించుకోవడానికి పలు పశ్చిమ దేశాలు, బ్రిటన్, అమెరికా ఉక్రెయిన్‌కు ఆయుధాలను పంపిణీ చేస్తున్నాయి.

Tags:    

Similar News