స్తంభం ఎక్కి ముద్దు అడిగిన ఫ్యాన్.. విజయ్ రియాక్షన్ వైరల్!

ఈ నేపథ్యంలో తాజాగా ఈరోడ్ జిల్లాలోని పెరుందురై అసెంబ్లీ నియోజకవర్గంలోని విజయమంగళం సమీపంలో గురువారం టీవీకే విజయ్ ర్యాలీ నిర్వహించారు.;

Update: 2025-12-18 09:59 GMT

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సినీ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రచార కార్యక్రమాల్లో దూకుడు పెంచారు. పక్కా ప్లాన్ ప్రకారం ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కీలక భూమిక పోషించనున్నారని అంటున్నారు. ఈ సమయంలో ఆయన ర్యాలీలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

అవును... వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న తమిళనాడు రాజకీయాల్లో టీవీకే అధినేత విజయ్ పై అందరిదృష్టీ కేంద్రీకృతమైనట్లు కనిపిస్తుందని అంటున్నారు. ఆయన కింగ్ గా అవుతారా.. లేక, కింగ్ మేకర్ గా మారతారా అనేది కాలమే నిర్ణయిస్తుంది కానీ.. ప్రస్తుతానికైతే తమిళనాడు రాజకీయాల్లో, ప్రచార కార్యక్రమాల్లో సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలిచారని చెప్పినా అతిశయోక్తి కాదేమో.

ఈ నేపథ్యంలో తాజాగా ఈరోడ్ జిల్లాలోని పెరుందురై అసెంబ్లీ నియోజకవర్గంలోని విజయమంగళం సమీపంలో గురువారం టీవీకే విజయ్ ర్యాలీ నిర్వహించారు. ఈ సభకు ఆయన అభిమానులు, మద్దతుదారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సమయంలో.. విజయ్ ని దగ్గర నుంచి నేరుగా చూసేందుకు అభిమానులు బారికేడ్లను దాటుతున్న దృశ్యాలు కనిపించాయి.

ఈ సమయంలో ఓ కీలక ఘటన చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... విజయ్ మాట్లాడుతుండగా అతని అభిమాని ఒకరు మెడలో పార్టీ కండువా కప్పుకుని, ఎత్తైన స్తంభంపైకి ఎక్కాడు. దీంతో అది చూసిన విజయ్ వెంటనే తన ప్రసంగాన్ని ఆపి.. మెల్లగా "సోదరుడా.. దిగు" అని అన్నారు. కానీ ఆ అభిమాని కిందకు దిగలేదు సరికదా.. పైన నిలబడి పార్టీ కండువా ఊపుతూ కనిపించాడు!

దీంతో ఈ సారి కాస్త కోపంగానే సోదరుడా దిగు అంటూ కాస్త మందలింపుగా విజయ్ పిలిచారు. దీంతో.. మీరు నన్ను ముద్దు పెట్టుకుంటే, నేను దిగిపోతాను అని అభిమాని అన్నాడు. వెంటనే విజయ్ స్పందిస్తూ.. నువ్వు దిగితేనే నేను నీకు ముద్దు ఇస్తాను అని అన్నారు. ఆ తర్వాత అభిమాని సురక్షితంగా కిందకు దిగాడు. వెంటనే రిలాక్స్ ఫీలైన విజయ్.. అభిమానికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు.

ఇలా విజయ్ తనదైన శైలిలో ఫ్లయింగ్ కిస్ ఇచ్చేసరికి సభా ప్రాంగణమంతా ఒక్కసారిగా హోరెత్తిపోయింది. ఈ సందర్భంగా అక్కడ పెద్ద ఎత్తున గుమిగూడిన అభిమానులు, పార్టీ మద్దతుదారులు, స్వచ్ఛంద సేవకులు కేరింతలు కొట్టారు.




Tags:    

Similar News