పంక్చర్ వేయటానికి కారు ఆపారు..టీవీ నటికి త్రుటిలో తప్పిన ప్రాణాపాయం
రాసి పెట్టి ఉండాలే కానీ పోయే నూకలు కూడా పోకుండా ఆపే పరిస్థితి. చెన్నైలో చోటు చేసుకున్న ఘోర ప్రమాదం గురించి చదివినప్పుడు ఈ భావన కలుగక మానదు.;
రాసి పెట్టి ఉండాలే కానీ పోయే నూకలు కూడా పోకుండా ఆపే పరిస్థితి. చెన్నైలో చోటు చేసుకున్న ఘోర ప్రమాదం గురించి చదివినప్పుడు ఈ భావన కలుగక మానదు. ప్రముఖ టీవీ నటి ప్రాణాపాయం నుంచి కనురెప్పలో తప్పించుకున్న వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. పంక్చర్ వేయించుకోవటానికి కారు ఆపితే.. మృత్యువు ముంచుకొచ్చిన వేళ.. కళ్ల ముందు ఒక ప్రాణం పోగా.. ప్రముఖ టీవీ సీరియల్ నటికి మాత్రం ప్రాణాపాయం త్రుటిలో తప్పింది. విన్నంతనే ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే ఈ ఉదంతంలోకి వెళితే..
ప్రముఖ టీవీ నటి దేవిప్రియను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ భాషల్లో వందకు పైగా సీరియళ్లలో నటించిన ఆమె పలు సినిమాల్లోనూ నటించారు. సన్ టీవీలో టెలికాస్ట్ అయిన శక్తి సీరియల్ ద్వారా కెరీర్ ఆరంభించిన ఆమె.. లక్ష్మి.. సెల్వి.. చెల్లమే.. రోమాపురి పాండియన్ తదితర సీరియళ్ల ద్వారా గుర్తింపు పొందారు. తాజాగా ఆమె తన అసిస్టెంట్ తో కలిసి డ్రైవర్ను తీసుకొని కారులో చెన్నై నుంచి తిరుచ్చి వైపు బయలుదేరారు.
అయితే.. వీరు ప్రయాణిస్తున్న కారు పెరంబలూర్ వద్ద కారు టైరు పంక్చర్ అయ్యింది. దీంతో టైరు మార్చేందుకు కారును ఆపారు. ఈ సందర్భంగా డ్రైవర్ టైరు మారుస్తుంటే.. నటి దేవిప్రియ కాస్త దూరంగా నిలుచున్నారు. ఆమె సహాయకుడు.. డ్రైవర్ కు దగ్గరగా ఉన్నారు. ఇదిలా ఉండగా.. అదే సమయంలో తిరుచ్చి వైపు నుంచి వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం అదుపు తప్పి దేవిప్రియ కారును బలంగా తాకింది.
ఈ ఘటనలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మరణించగా.. ఈ ఘటనలో కారు పక్కనే ఉన్న నటి దేవిప్రియ త్రుటిలో ప్రాణాపాయాన్ని తప్పించుకున్నారు. ఆమె సహాయకుడు దివాకర్ మాత్రం గాయాలపాలయ్యాడు. ఈ ప్రమాదం చోటు చేసుకున్నంతనే స్పందించిన స్థానికులు అతడ్ని పెరంబలూర్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కారు డ్రైవర్ డెడ్ బాడీని పోస్టుమార్టానికి తరలించారు. తన కళ్ల ముందే జరిగిన ఈ షాకింగ్ ఘటనతో నటి దేవిప్రియ తీవ్ర షాక్ కు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.