అత్యాచార నిందితుడి మృతదేహం లభ్యం... కుమారుడి అనుమానం ఇదే!

అవును... కాకినాడ జిల్లా తునిలో బాలికపై అత్యాచారం కేసు నిందితుడు తాటిక నారాయణరావు (62) మృతదేహం లభ్యమైంది.;

Update: 2025-10-23 06:00 GMT

తునిలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం కేసు నిందితుడు తాటిక నారాయణరావు (62) ను బుధవారం అర్ధరాత్రి కోర్టుకు తరలిస్తున్న సమయంలో బహిర్భూమికి వెళ్తానని చెప్పడం.. దీంతో పోలీసులు తుని పట్టణ శివారులోని కోమటిచెరువు పక్కన వాహనాన్ని ఆపడం.. అనంతరం నిందితుడు చెరువులో దూకినట్లు పోలీసులు చెప్పడం తెలిసింది. ఈ క్రమంలో నారాయణరావు మృతదేహం లభ్యమైంది.

అవును... కాకినాడ జిల్లా తునిలో బాలికపై అత్యాచారం కేసు నిందితుడు తాటిక నారాయణరావు (62) మృతదేహం లభ్యమైంది. తుని గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌ నుంచి బుధవారం అర్ధరాత్రి కోర్టుకు తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు చెబుతున్నారు. నిందితుడి ఆచూకీ కోసం గజ ఈతగాళ్ల సాయంతో రాత్రి నుంచి గాలింపు చేపట్టగా... గురువారం ఉదయం మృతదేహం లభ్యమైంది.

నారాయణరావు కుమారుడి కీలక వ్యాఖ్యలు!:

రాత్రి కోర్టుకు తీసుకెళ్తున్న సమయంలో నారాయణరావు చెరువులోకి దూకగా.. తాజాగా ఆయన మృతదేహం లభ్యమయ్యింది. దీంతో... కోమటి చెరువు వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నారాయణరావుది సూసైడ్‌ కాదంటూ బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు మాత్రం ఆ అనుమానాలను తోసిపుచ్చుతున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన నారాయణరావు కుమారుడు.. నలుగురు పోలీసులు రాత్రి తమ ఇంటికి వచ్చి రిమాండ్‌ పేరిట బలవంతంగా సంతకాలు సేకరించారని.. రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో చెరువులోకి దూకాడని అంటున్నారని.. చనిపోయాడని మాత్రం ఈ ఉదయం 7:00 గంటలకు సమాచారం ఇచ్చారని అన్నారు.

అసలు తమ తండ్రి చెరువులోకి దూకిన వెంటనే తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? అని ప్రశ్నిస్తూ.. అందుకే అనుమానాలు కలుగుతున్నాని అన్నారు. తమ అనుమానాలు నివృత్తి చేయాలంటే.. పోలీస్ స్టేషన్ నుండి రిమాండ్‌ కోసం తరలిస్తుండగా మార్గ మద్యలో ఉన్న సీసీ కెమెరాలు బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

అనుమానాలు తోసిపుచ్చుతున్న పోలీసులు!:

అయితే.. పోలీసులు మాత్రం ఆ అనుమానాలను తోసిపుచ్చుతున్నారు. చేసిన పనికి సిగ్గుపడి నారాయణరావు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని చెబుతున్నారు. అర్ధరాత్రి మెజిస్ట్రేట్‌ వద్దకు తీసుకెళ్తున్న సమయంలో వాష్‌ రూమ్‌ వస్తుందని నారాయణరావు అడిగారని.. వెంటనే ఎస్కార్ట్‌ వాహనం ఆపామని.. వర్షం పడుతుండడంతో పోలీసులు పక్కనే ఉన్న చెట్ల కిందకు వెళ్లారని తెలిపారు.

చీకటి కావడంతో నిందితుడు కనిపించలేదని.. ఈలోపు నీళ్లలో దూకినట్లు శబ్దం వచ్చిందని.. రాత్రంతా వెతికినా ఆచూకీ లభ్యం కాలేదని.. ఈ క్రమంలో ఉదయం వెతికితే మృతదేహం దొరికిందని పోలీసులు అంటున్నారు! మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.

30 ఏళ్లకు పైగా శిక్ష పడుతుంది!:

నారాయణరావు అరెస్ట్‌ పై పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి రాజు స్పందిస్తూ... బాలికను ఆమె తల్లి అనుమతిలేకుండా పాఠశాల నుంచి తీసుకెళ్లడం, లైంగిక దాడికి యత్నించడం, తరచూ బాలికను బయటకు తీసుకెళ్లడంపై వేర్వేరుగా మూడు కఠినమైన కేసులు నమోదుచేశామని చెప్పారు. పోక్సో కేసులో నిందితుడికి 30 ఏళ్లకు పైగా శిక్ష పడుతుందన్నారు. ఈలోపే.. నిందితుడు పోలీసుల చెర నుంచి తప్పించుకుని ఇలా చెరువులో దూకేసి శవమై తేలాడు.

Tags:    

Similar News