శివజ్యోతి ఆధార్ కార్డును టీటీడీ బ్లాక్ చేసిందా? అసలు నిజం ఇదీ

తిరుమల శ్రీవారి ప్రసాదంపై యాంకర్ శివజ్యోతి చేసిన వ్యాఖ్యలు ఇటీవల సోషల్ మీడియాలో పెను దుమారాన్ని సృష్టించిన విషయం తెలిసిందే.;

Update: 2025-11-27 12:31 GMT

తిరుమల శ్రీవారి ప్రసాదంపై యాంకర్ శివజ్యోతి చేసిన వ్యాఖ్యలు ఇటీవల సోషల్ మీడియాలో పెను దుమారాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వివాదం చుట్టూ అనేక అవాస్తవ ప్రచారాలు, నిరాధారమైన వార్తలు చక్కర్లు కొట్టాయి. వాటిలో ముఖ్యంగా "శివజ్యోతి ఆధార్ కార్డును టీటీడీ బ్లాక్ చేసింది, ఆమెపై తిరుమల దర్శనంపై శాశ్వత నిషేధం విధించారు" అన్న ప్రచారం అత్యంత వైరల్‌గా మారింది. అయితే, తాజాగా అందిన విశ్వసనీయ సమాచారం టీటీడీ వర్గాల స్పందించాయి. ఈ వార్తలన్నీ కేవలం వదంతులు మాత్రమేనని స్పష్టం చేస్తున్నాయి.

బ్లాక్ చేశారన్న ప్రచారం – వాస్తవం ఇదే!

సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకు వాస్తవ పరిస్థితులకు ఏ మాత్రం పొంతన లేదని తేలింది. టీటీడీ అధికారిక వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఆధార్ బ్లాక్ పూర్తిగా నిరాధారం అని స్పష్టం చేశారు. టీటీడీ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఒక్క భక్తుడి ఆధార్ కార్డును కూడా దర్శనం నిషేధం విధించడానికి లేదా మరే ఇతర కారణాల వల్ల బ్లాక్ చేసిన సందర్భం లేదు. ఆధార్ బ్లాక్ చేయడంపై టీటీడీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దర్శనంపై నిషేధం లేదు. ఏ భక్తుడైనా శ్రీవారి దర్శనానికి రావడాన్ని సంస్థ ఎప్పుడూ నిరోధించలేదు, నిరోధించబోదు అని టీటీడీ వర్గాలు స్పష్టం చేశాయి. శివజ్యోతిపై ఎలాంటి అధికారిక ఆంక్షలు లేదా దర్శన నిషేధం విధించబడలేదు. రూమర్స్‌తో అప్రమత్తమైన టీటీడీ పేరుతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తలన్నీ తప్పుడు ప్రచారాలు మాత్రమేనని, భక్తులు ఇటువంటి నిరాధారమైన సమాచారాన్ని నమ్మవద్దని అధికారిక వర్గాలు సూచించాయి. ఈ అంశాలను బట్టి, శివజ్యోతి ఆధార్ కార్డు బ్లాక్ అయ్యిందన్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని తేలిపోయింది.

వివాదం ఎలా మొదలైంది? శివజ్యోతి క్షమాపణ

ప్రసాదంపై చేసిన వ్యాఖ్యల కారణంగా ఈ వివాదం మొదలైంది. ఇటీవల శివజ్యోతి తన తమ్ముడు సోనుతో కలిసి తిరుమల క్యూలైన్‌లో ప్రసాదం తీసుకుంటూ చేసిన ఒక వీడియో వైరల్ అయింది. అందులో ఆమె నవ్వుతూ "సోను కాస్ట్లీ ప్రసాదంపై అడుక్కుంటున్నాడు ఫ్రెండ్స్… రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం!" అని వ్యాఖ్యానించారు. శ్రీవారి ప్రసాదాన్ని అపహాస్యం చేశారంటూ ఈ వ్యాఖ్యలపై భక్తుల నుంచి, నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత, విమర్శలు వెల్లువెత్తాయి. వివాదం తీవ్రమవుతుండడంతో శివజ్యోతి తప్పు తెలుసుకొని వెంటనే స్పందించారు. ఆమె తన సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు చెబుతూ ఒక వీడియోను విడుదల చేశారు. “తప్పు నా నుంచి జరిగింది. ఇంటెన్షన్ అది కాదు. కాస్ట్లీ లైన్‌లో నిలబడ్డామనే అర్థంలో అలా చెప్పాను. వెంకన్న స్వామి నాకు అన్నీ ఇచ్చారు. తెలిసో తెలియకో తప్పు జరిగిందని క్షమించండి.” ఆమె క్షమాపణలు చెప్పినప్పటికీ, కొందరు నెటిజన్లు మాత్రం ఆమె ఆధార్ కార్డు బ్లాక్ అయ్యిందన్న ప్రచారాన్ని కొనసాగించారు, ఈ విషయంపై టీటీడీ అధికారిక ప్రకటన ఇవ్వాల్సిన అవసరం పెరిగింది.

ప్రజలు ఎందుకు ట్రోలింగ్ కొనసాగిస్తున్నారు?

శివజ్యోతి క్షమాపణ చెప్పినప్పటికీ, సోషల్ మీడియాలో ఆమెను విమర్శించడం ఆగలేదు. దీనికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. శ్రీవారి ప్రసాదంపై చేసిన వ్యాఖ్యను కొందరు భక్తులు తీవ్ర అవమానంగా భావించడం... ఆధార్ బ్లాక్ వార్త వంటి బూటకపు సమాచారం సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించడం కారణం.

టీటీడీ నుంచి ఎలాంటి చర్యలు లేనప్పటికీ, ఈ వివాదం పూర్తిగా సోషల్ మీడియా స్థాయిలోనే కొనసాగుతున్నదని స్పష్టమవుతున్నది. భక్తులు , నెటిజన్లు నిజానిజాలను నిర్ధారించుకుని, నిరాధారమైన ప్రచారాలను నమ్మకుండా సంయమనం పాటించాలని కోరుకుందాం.

Tags:    

Similar News