మిత్రదేశం కంటే శత్రుదేశానికే వీసాలు పెంచిన అగ్రరాజ్యం..
ట్రంప్ అగ్రరాజ్యం కుర్చీ ఎక్కిన తర్వాత అమెరికాకు కలిసి వచ్చినదాని కంటే అమెరికా శత్రువులకు, అమెరికా శత్రువులు చేసుకుంటున్న వారికి ఎక్కువ కలిసివచ్చిందనే చెప్పాలి.;
ట్రంప్ అగ్రరాజ్యం కుర్చీ ఎక్కిన తర్వాత అమెరికాకు కలిసి వచ్చినదాని కంటే అమెరికా శత్రువులకు, అమెరికా శత్రువులు చేసుకుంటున్న వారికి ఎక్కువ కలిసివచ్చిందనే చెప్పాలి. దాదాపు శత్రుదేశాలు సైతం ఆయన విధానాలతో మిత్రదేశాలుగా మారిపోయాయి. రష్యాతో దోస్తీ చేద్దాం అనుకొని భంగపడ్డ ట్రంప్.. యుక్రెయిన్ తో కూడా సంబంధాలను చెడగొట్టుకున్నారు. ఇక భారత్ విషయానికి వస్తే చిరకాలంగా శత్రుత్వంలో ఉన్న చైనాను భారత్ కు దగ్గర చేసింది ట్రంపే అని బల్లగుద్ది మరీ చెప్పచ్చు. ఆయన టారీఫ్ లతో ఇబ్బంది పడ్డ ఇండియా, చైనా పొరుగున ఉన్న మిత్ర దేశంను కలుపుకొని అతిపెద్ద కూటమిగా ఏర్పడ్డాయి. ఇప్పుడు అమెరికాతో కంటే చైనాతోనే భారత్ కు ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయనడం సత్యం.
దూరాలను దగ్గర చేసేదే విద్య
విద్య అనేది దేశాల మధ్య సంబంధాలను మరింత దృఢం చేస్తుంది. అమెరికా ఎప్పటి నుంచో ప్రపంచ విద్యార్థుల కలల గమ్యం. అయితే ఇటీవల అమెరికా-ఇమ్మిగ్రేషన్ విధానాల్లో మార్పులు, వీసా నియంత్రణల్లో కఠినత్వం, అమెరికా కలను అనేక మంది భారతీయ విద్యార్థులకు కష్టతరంగా మారింది. తాజా గణాంకాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. 2025, ఆగస్టులో అమెరికా జారీ చేసిన విద్యార్థి వీసాల సంఖ్య గతేగాది కంటే 19 శాతం తగ్గింది. కానీ ఈ తగ్గుదలలో భారతీయ విద్యార్థులే అత్యధికంగా ప్రభావితమయ్యారని తెలుస్తుంది. వీసా జారీలు 44.5 శాతం మేర పతనమయ్యాయి. దీనికి విరుద్ధంగా, చైనా విద్యార్థులకు జారీ చేసిన వీసాల సంఖ్య భారత విద్యార్థుల కంటే రెట్టింపు చేశారు. అది ఎంతంటే భారతీయులకంటే 86,647 మందికి ఎక్కువగా జారీ చేశారు.
ట్రంప్ డోంట్ కేర్ అన్న చైనాకే వీసాల పెంపు..
ఇది కేవలం అంకెల మార్పు కాదు, భౌగోళిక రాజకీయ మార్పులను చూపిస్తుంది. అమెరికా-చైనా మధ్య సాంకేతికత, వాణిజ్య అంశాల్లో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, ట్రంప్ పరిపాలన చైనా విద్యార్థులపై కొంత సడలింపు చూపడం వ్యూహాత్మకంగా కనిపిస్తుంది. భారతీయ విద్యార్థులు అయితే సాంకేతిక రంగాల్లో ఆధిపత్యం సాధిస్తున్నారనే కారణంతో ట్రంప్ భారతీయుల వీసాలకు భారీగా కోత పెడుతున్నారు. అమెరికా సెనేటర్ మార్కో రూబియో ఆదేశాలతో విద్యార్థి వీసా ప్రాసెసింగ్‌లో కఠినమైన పరిశీలనలు పెరిగాయి. ‘చట్టపరమైన భద్రత’ పేరిట చేపట్టినప్పటికీ, భారతీయ విద్యార్థులకు అవి అడ్డంకులుగా నిలుస్తున్నాయి.
ఇతర దేశాల వైపు చూస్తున్న భారతీయులు..
ఇక H1బీ వీసాలపై భారీ ఫీజులు విధించడం, వీసా రద్దు వంటి నిర్ణయాలు భారతీయ ఐటీ నిపుణుల భవిష్యత్తును అనుమానంలో పడేస్తున్నాయి. అమెరికాలో ఇటీవల పెరిగిన ‘అమెరికన్ ఉద్యోగాలకు ప్రాధాన్యం’ అనే నినాదం వెనుక, ప్రపంచ ప్రతిభను దూరం చేసే విధానాన్ని అమలు చేస్తోందని నిస్సందేహంగా చెప్పవచ్చు. దీని ఫలితంగా భారత విద్యార్థులు కొత్త గమ్యాల వైపు దృష్టి సారిస్తున్నారు. కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, యునైటెడ్ కింగ్‌డమ్ వంటి దేశాలు తక్కువ పరిశీలన విధానాలతో విద్యార్థులకు ఆకర్షణీయ కేంద్రాలుగా కనిపిస్తున్నాయి. అయితే, ఈ పరిణామం భారత్-అమెరికా విద్యా సంబంధాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. దశాబ్దాలుగా అమెరికా విశ్వవిద్యాలయాలు భారతీయ మేధావులను ఆకర్షించాయి. ఇప్పుడు అదే మేధా ప్రవాహం నిలిచిపోవడం, అమెరికా ఆర్థిక, సాంకేతిక రంగాలకు కూడా నష్టమే. విద్యార్థులకు కేటాయించే విద్యా వీసాలను కూడా రాజకీయ సాధనాలుగా ఉపయోగించడం ఆ దేశానికే నష్టం. భద్రతా కారణాలు ఎంత ఉన్నా, వాటినే సాకుగా చూపి ప్రతిభను అడ్డుకోవడం ఏ దేశానికీ లాభదాయకం కాదు.