భారత్ పై సుంకాల విషయంలో ట్రంప్ హింట్.. ఏమిటీ గంతులు?
ఇలా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటుందన్న కారణంతో భారత్ పై డొనాల్డ్ ట్రంప్ ఇటీవల సుంకాలను పెంచిన సంగతి తెలిసిందే.;
అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య ఉక్రెయిన్ యుద్ధం ముగించే విషయంపై చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ భేటీ వల్ల ప్రయోజనం ఏమీ కలగనప్పటికీ.. ఈ భేటీకి ముందు, తర్వాత భారత్ పై అదనపు సుంకాల విషయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మాత్రం చర్చనీయాంశంగా మారాయి. రష్యాతో భేటీ వేళ చేయడంతో ఈ వ్యాఖ్యలపై సందేహాలూ వినిపిస్తున్నాయి!
అవును... రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అదనంగా సెకండరీ టారిఫ్ లను విధిస్తున్నట్లు ప్రధానంగా భారత్ ను దృష్టిలో పెట్టుకుని ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే! అయితే తాజాగా... తాము ఆ సెకండరీ టారిఫ్ లను విధించకపోవచ్చని ట్రంప్ సంకేతాలిచ్చారు. పుతిన్ తో కీలక భేటీ ముగిసిన అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... ఈ రోజు జరిగిన పరిణామాల తర్వాత.. రష్యా చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అదనపు సుంకాల గురించి రెండు, మూడు వారాల్లో పునరాలోచన చేస్తాం అని ట్రంప్ వెల్లడించారు. పుతిన్ తో భేటీకి ముందు కూడా ట్రంప్ దీనిపై స్పందిస్తూ... రష్యా తన చమురు క్లయింట్ ను కోల్పోయిందని (భారత్ ను ఉద్దేశించి) వ్యాఖ్యానించారు.
అయితే.. గత కొనుగోళ్లు సుమారు 40 శాతం ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే... ప్రస్తుతానికి భారత్, చైనా లాంటి దేశాలపై అదనపు టారిఫ్ లు విధించే ఉద్దేశం లేదని అన్నారు. కాగా... భారత్ పై ఇటీవల 25% అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త టారిఫ్ లు ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయి.
దీంతో... అగ్రరాజ్యాధిపతి అయిన ట్రంప్ ఇలా తన అవసరాలకు తగ్గట్లుగా, పరిస్థితులను మేనేజ్ చేసేందుకు ఏమార్చే విధంగా... ఇలా పూటకో మాట, రోజుకో నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని.. ఆయన వ్యాఖ్యలు, నిర్ణయాలు హుందాగా, శిలాసాసనంలా ఉండాలని.. అలా కాకుండా ఇలా కప్ప గంతుల్లా ఉండటం ఏమిటని పలువురు ప్రశ్నిస్తుండటం గమనార్హం.
వెనక్కి తగ్గని భారత్!:
ఇలా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటుందన్న కారణంతో భారత్ పై డొనాల్డ్ ట్రంప్ ఇటీవల సుంకాలను పెంచిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ పరిణామంతో భారత్ వెనక్కు తగ్గి.. మాస్కో నుంచి చమురు కొనుగోళ్లను నిలిపేయడం లాంటిదేమీ చేయలేదని 'ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్' ఛైర్మన్ ఏఎస్ సాహ్నీ తెలిపారు. అమెరికా సుంకాలకు ప్రతిస్పందనగా.. కొనుగోళ్లను తగ్గించాలని, లేదా పెంచాలని తమకు ఎటువంటి సూచనలూ అందలేదని అన్నారు.