అమెరికా చరిత్రలో తొలిసారి.. గవర్నర్ల విందు రచ్చరచ్చ
ఇక్కడ అమెరికా పాలనా వ్యవస్థను సింఫుల్ గా చెప్పాలంటే అమెరికాలో దేశాధ్యక్షుడు అంటే మన దేశంలో ప్రధాని మాదిరి.;
ఏ ముహుర్తంలో అగ్రరాజ్యం అమెరికాకు ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయ్యారో కానీ.. తొలి రోజు నుంచే ఆయన విపరీత చర్యలకు.. సంచలనాలకు.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. అమెరికా ఫస్ట్ పేరుతో మొదలు పెట్టిన ఆయన నిర్ణయాల తీరు అంతకంతకూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరేమన్నా.. పట్టించుకోని తత్త్వం ఆయన సొంతం. మొండి మనిషిగా.. తాను నమ్మిన దానిని తప్పించి ఇంకేం పట్టనట్లుగా వ్యవహరించే ట్రంప్ తీరు మరోసారి వివాదాస్పదమైంది. ఈసారి తన దేశ గవర్నర్ల(తన ప్రత్యర్థి పార్టీకి చెందిన)తో ఆయన వ్యవహరించిన తీరు అసాధారణం. దీంతో ట్రంప్ నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో ఇది కూడా వివాదాస్పదంగా మారటమే కాదు.. అమెరికా చరిత్రలో మరో దుష్టసంప్రదాయానికి.. చౌకబారు రాజకీయ ఎత్తుగడ తరహాలో వ్యవహరించారని చెప్పాలి. ఇంతకూ ఏం జరిగింది? అన్నది వరుస క్రమంలో చదివితే అసలు మొత్తం సమస్య అర్థం కావటమే కాదు.. దాని తీవ్రత.. అసాధారణం అన్న పదం ఎందుకు వాడాల్సి వచ్చిందో అర్థమవుతుంది.
ప్రతి ఏడాది ఫిబ్రవరిలో ఎన్ జీఏ (నేషనల్ గవర్నర్స్ అసోసియేషన్) సంస్థ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఒక అధికారిక వేడుకను నిర్వహిస్తారు. ఇందులో అమెరికాకు చెందిన 50 రాష్ట్రాల గవర్నర్లు అంతా వాషింగ్టన్ డీసీలో సమావేశమవుతారు. దీనికి దేశాధ్యక్షుడు వారికి వైట్ హౌస్ లో విందు ఇస్తారు. ఈ విందు లక్ష్యం పార్టీ రాజకీయాలకు అతీతంగా.. ఫెడరల్ ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని పెంచేలా.. రాజకీయ విభేదాల్ని పక్కన పెట్టి దేశాభివృద్ధి కోసం పని చేస్తామన్న విషయాన్ని ఈ సమావేశం చాటి చెబుతుంది.
ఈ వేడుకకు అమెరికాలోని 50 రాష్ట్రాల గవర్నర్లు హాజరవుతారు. ఏదైనా వ్యక్తిగత కారణాలు ఉంటే తప్పించి అందరూ గవర్నర్లు దీనికి హాజరవుతుంటారు. ప్రస్తుతం ఉన్న బలాల్ని చూస్తే ట్రంప్ పార్టీ (రిపబ్లిక్)కి 26 మంది గవర్నర్లు ఉంటే.. ప్రత్యర్థి (డెమొక్రాట్లు) పార్టీకి 24 మంది గవర్నర్లు ఉన్నారు. మళ్లీ విషయంలోకి వెళితే.. సాధారణంగా దేశాధ్యక్షుడు ఈ విందుకు హోస్ట్ పాత్రను పోషిస్తారు. రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నా.. అందరిని సమానంగా చూడటం.. గౌరవించటం లాంటివి సహజంగా సాగుతుంటాయి. అంతేకాదు.. ఈ విందులో రాజకీయ విమర్శలు చేసుకోకుండా.. స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరపటం దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ.
ఇక్కడ అమెరికా పాలనా వ్యవస్థను సింఫుల్ గా చెప్పాలంటే అమెరికాలో దేశాధ్యక్షుడు అంటే మన దేశంలో ప్రధాని మాదిరి. అదే సమయంలో మన రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలానో.. అమెరికాలో రాష్ట్ర గవర్నర్లుగా ఉంటారు.అయితే.. మన దేశంలోని ముఖ్యమంత్రుల కంటే అమెరికా గవర్నర్లకు ఎక్కువగా అధికారాలు ఉంటాయి. ఎందుకంటే.. తమ రాష్ట్ర పరిధిలోనిచట్టాలు.. బడ్జెట్.. పోలీసు.. పన్నుల విషయంలో వారు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోగలరు. అంతేకాదు.. దేశాధ్యక్షుడి ఆదేశాల్ని రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నట్లు భావిస్తే.. తిరస్కరించే పవర్ వారికి సొంతం.
మళ్లీ ప్రధాన విషయంలోకి వెళితే.. తాజా విందుకు సంబంధించి చూస్తే.. ఈ విందును నిర్వహించటానికి కొన్ని వారాల ముందు తనను వ్యతిరేకించే డెమొక్రాటిక్ గవర్నర్లు వెస్ మూర్ (మేరీ ల్యాండ్), జారెడ్ పోలిస్ (కొలరాడో)ఇద్దరిని విందుకు రావొద్దంటూ పది- పన్నెండు రోజులు ముందు సోషల్ మీడియాలో పోస్టు చేశారు దేశాధ్యక్షుడు ట్రంప్. మరో షాకింగ్ అంశం ఏమంటే.. ఓక్లహామా, మేరీలాండ్ గవర్నర్లను ఎగతాళిగా మాట్లాడారు. ఈ రెండు అంశాలు కొత్త వివాదానికి తెర తీశాయి. ఒక దేశాధ్యక్షుడు ఇలా గవర్నర్లను వేరుగా చూడటం.. ఇలా అవమానించటాన్ని నిరసిస్తూ 18 మంది డెమొక్రాటిక్ గవర్నర్లు కూడా విందుకు వెళ్లకూడదని డిసైడ్ అయ్యారు. ఇలా ప్రతిపక్ష పార్టీకి చెందిన గవర్నర్లు హాజరుకాని విందును నిర్వహించేందుకు నేషనల్ గవర్నర్స్ అసోసియేషన్ సైతం అధికారింగా తప్పుకుంది.
అయితే.. అన్ని వైపుల నుంచి వస్తున్న ఒత్తిళ్ల నేపథ్యంలో ఫిబ్రవరి 20 ఉదయం (అమెరికా కాలమానం ప్రకారం) చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని మార్చుకున్న ట్రంప్.. అందరికీ ఆహ్వానాలు పంపారు.అయితే.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఏడాదికి ఒకసారి నిర్వహించే ఈ గవర్నర్ల సమావేశ విందును 1908లో థియోడర్ రూజ్ వెల్ట్ ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ.. ఇలా ఏ దేశాధ్యక్షుడు కూడా గవర్నర్లను విందుకు రావొద్దని బహిరంగంగా చెప్పేయటం ఇదే తొలిసారి.
ఇంతకాలం స్నేహపూర్వక చర్చలకు వేదికగా ఉన్న వైట్ హౌస్ విందు.. తాజా ఉదంతంతో అమెరికాలో పెరుగుతున్న రాజకీయ చీలికకు.. రాజకీయ అసహనానికి నిదర్శనంగా చెప్పొచ్చు. మొత్తం 24 మంది డెమొక్రాట్ పార్టీకి చెందిన కొందరు గవర్నర్లు విందుకు హాజరైనప్పటికీ.. విందు చివరి వరకు ఉండలేదు. దీంతో.. విందు మొత్తం రిపబ్లికన్ గవర్నర్లు.. అధికారులే కనిపించటం ద్వారా.. అమెరికాలో ఒక దుష్ట రాజకీయ సంప్రదాయం మొదలైందన్న వ్యాఖ్య వినిపిస్తోంది.