ట్రంప్ గెలిచింది యుద్ధాలు ఆపడానికంట.. అమెరికన్స్ కోసం కాదా?
ఈ స్థాయిలో ప్రపంచంపై అనధికారిక దండయాత్ర చేస్తున్నారు ట్రంప్! ఈ క్రమంలో భారత్ తో పాటు పలుదేశాలపై అవాకులు చెవాకులు పేలుస్తున్నారు.;
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికాకు ఎంత మేలు చేస్తున్నాయో తెలియదు కానీ.. ప్రపంచ దేశాలను మాత్రం పలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి! ఆయన నియంతృత్వ ధోరణిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. చెప్పిన మాట వింటే గ్రిప్ లో పెట్టుకోవడం, లేకపోతే.. సుంకాలతో కొట్టడం, బంకర్ బ్లస్టర్ బాంబులతో విరుచుకుపడటం!
ఈ స్థాయిలో ప్రపంచంపై అనధికారిక దండయాత్ర చేస్తున్నారు ట్రంప్! ఈ క్రమంలో భారత్ తో పాటు పలుదేశాలపై అవాకులు చెవాకులు పేలుస్తున్నారు. తాను బెదిరించి చేసిన పనులను కూడా శాంతి కార్యక్రమాల్లా అభివర్ణించే పనికి పూనుకుంటున్నారు! ఎప్ స్టీన్ సె*క్స్ కుంభకోణం విషయంలో మాట మారుస్తున్నారు. అయినప్పటికీ... ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటుంది వైట్ హౌస్!
అవును... ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణ ప్రాంతాలలో శాంతి ఒప్పందాలు, కాల్పుల విరమణలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు. ఈ క్రమంలో... నెలకు సగటున ఒకటి చొప్పున ఉండే ఈ శాంతి ఒప్పందాలను చెబుతూ.. ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతిని ప్రదానం చేయాలనే పిలుపును పునరుద్ఘాటించారు.
ఈ సందర్భంగా... శాంతి రంగంలో అధ్యక్షుడు ట్రంప్ థాయిలాండ్ - కంబోడియా మధ్య తక్షణ, బేషరతు కాల్పుల విరమణకు సహాయం చేశారని.. ట్రంప్ జోక్యం చేసుకునే వరకు రెండు దేశాలు 3,00,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారని అన్నారు. ఈ క్రమంలో ఎంట్రీ ఇచ్చిన ట్రంప్ ఇరు దేశాల ప్రధానులతోనూ వాణిజ్యంపై మాట్లాడారని అన్నారు.
ఇందులో భాగంగా... థాయ్ తాత్కాలిక ప్రధాని, కంబోడియా ప్ర్ధానితో నేరుగా ఫోన్ లో మాట్లాడారని.. వారు వివాదాన్ని ముగించకపోతే, అమెరికాతో ఎలాంటి వాణిజ్య చర్చలు, ఒప్పందాలు ఉండవని తెలియజేశారని తెలిపారు. దీంతో... వెంటనే వేలాది మంది ప్రాణాలను కాపాడే శాంతి ఒప్పందం కుదిరిందని.. ఆ దేశాలతో వాణిజ్య చర్చలు ప్రారంభమయ్యాయని అన్నారు.
ఇలా.. థాయి - కంబోడియాతో పాటు ఇజ్రాయెల్ - ఇరాన్, రువాండా - కాంగో, భారత్ - పాక్, సెర్బియా - కొసావో, ఈజిప్ట్ - ఇథియోపియా మధ్య ఘర్షణలను ట్రంప్ ఇప్పటివరకూ ముగించరని కరోలిన్ లీవిట్ తెలిపారు. అంటే అధ్యక్షుడు ట్రంప్ తన ఆరు నెలల పదవీకాలంలో సగటున నెలకు ఒక శాంతి ఒప్పందం లేదా సీజ్ ఫైర్ కు మధ్యవర్తిత్వం వహించారని అన్నారు.
ఈ నేపథ్యంలోనే అసలు పాయింటుకు వచ్చారు కరోలిన్. ఇందులో భాగంగా.. అధ్యక్షుడు ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చేందుకు ఇదే సరైన అవకాశం అని అన్నారు.
కాగా... తాజాగా పార్లమెంటులో మాట్లాడిన భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ఆపరేషన్ సిందూర్ లో కాల్పుల విరమణ గురించి మరోసారి స్పందించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ప్రపంచంలోని ఏ నాయకుడూ భారతదేశాన్ని తన ఆపరేషన్ ఆపమని చెప్పలేదని అన్నారు. పాకిస్తాన్ డీజీఎంఓ రిక్వస్ట్ మేరకే సీజ్ ఫైర్ అంగీకారం జరిగిందని తెలిపారు!
ఏది ఏమైనా... "మేక్ అమెరికా గ్రేట్ అగైన్" అనే స్లోగన్ తో అధికారంలోకి వచ్చిన ట్రంప్... అమెరికా ప్రజలకు ఉత్తమ నాయకుడు అవుతున్నారో లేదో తెలియదు కానీ... ప్రపంచ వ్యాప్తంగా అమెరికాకు కొత్త శత్రువులను తయారు చేసుకుంటున్నారని.. తన నియంతృత్వ ధోరణితో ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు!