'ఐ డోంట్ కేర్'... భారత్ పై ట్రంప్ ప్రేలాపనలు ఎందుకంటే..!

అవును... భారత దిగుమతులపై 25శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాస్కోతో న్యూఢిల్లీ సంబంధాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.;

Update: 2025-07-31 06:23 GMT

భారత్ పై అమెరికా విధించిన 25శాతం సుంకాల వ్యవహారం.. దేశీయ పారిశ్రామిక రంగంలో తీవ్ర కలకలానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం వల్ల ప్రధానంగా... రైతులు, వ్యవస్థాపకులు, ఎం.ఎస్.ఎం.ఈ లు తీవ్రంగా నష్టపోతాయని.. దుస్తుల పరిశ్రమకు ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఈ సమయంలోనే... భారత్ పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు ట్రంప్.


అవును... భారత దిగుమతులపై 25శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాస్కోతో న్యూఢిల్లీ సంబంధాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రెండు దేశాలను 'చనిపోయిన ఆర్థిక వ్యవస్థలు'గా ఎగతాళి చేశారు! ఇదే సమయంలో... రష్యాతో కలిసి భారతదేశం ఏమి చేసినా తనకు డోంట్ కేర్ అని నిర్మొహమాటంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా... రష్యాతో భారత్‌ ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకున్నా డోంట్ కేర్ అని మొదలుపెట్టిన ట్రంప్... వారి (భారత్ - రష్యా) ఆర్థిక వ్యవస్థను మరింత పతనం చేసుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో... తాము న్యూఢిల్లీతో చాలా తక్కువ వ్యాపారం చేస్తున్నామని.. ఎందుకంటే భారత్‌ అత్యధికంగా సుంకాలు విధిస్తుందని ఆరోపించారు.

ఇదే సమయంలో... రష్యా, అమెరికా కలిసి ఎలాంటి వ్యాపారం చేయట్లేదని స్పష్టం చేసిన ట్రంప్... అనంతరం రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మద్వెదేవ్‌ పైనా విరుచుకుపడ్డారు. తమతో వాషింగ్టన్‌ గేమ్‌ ఆడుతుందని, అది యుద్ధానికి దారితీయొచ్చని దిమిత్రి హెచ్చరించడంపై ట్రంప్‌ స్పందించారు. ఇందులో భాగంగా... ఆయన ఇంకా అధ్యక్షుడిననే అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

కాగా... రష్యాతో వ్యాపారాన్ని కొనసాగిస్తే భారీగా సుంకాలు విధిస్తామని భారత్‌ తో సహా పలు ప్రపంచ దేశాలను పలుమార్లు హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు.. ఇదే కారణాన్ని చూపుతూ.. భారత దిగుమతులపై 25 శాతం సుంకంతో పాటు, పెనాల్టీలు కూడా విధించారు. ఆగస్టు 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందన్నారు.

నియంతృత్వమా... మూర్ఖత్వమా..?

ఉత్తరకొరియాకు కిమ్ నియంత అయితే, ప్రపంచ దేశాలకు తానే నియంత అన్నట్లుగా ట్రంప్ వ్యవహార శైలి మారిపోయిందనే చర్చ... ఆయన రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ వినిపిస్తున్న సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో ఇటీవల స్పందించిన బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిజ్‌ ఇనాసియో లూలా డిసిల్వా చేసిన వ్యాఖ్యలు... ఈ సందర్భంగా మరోసారి చర్చకు వచ్చాయని అంటున్నారు.

ప్రపంచం మునుపటిలా లేదు.. అందువల్ల మనకు చక్రవర్తి అవసరం లేదు.. మన దేశాలు సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నాయి.. ట్రంప్ సుంకాలను జారీ చేస్తే.. ఇతర దేశాలకు అదే చేసే హక్కు ఉంది.. అగ్రరాజ్యానికి అధ్యక్షుడైన ఆయన సుంకాల గురించి ప్రపంచాన్ని బెదిరించడం బాధ్యతారాహిత్యంగా భావిస్తున్నా అని బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ముగింపు కార్యక్రమంలో డిసిల్వా వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలోనే... ‘మాగా’ (మేక్ అమెరికా గ్రేట్ అగైన్) అనే మాటను భుజాన్న వేసుకున్న ట్రంప్.. మిగిలిన దేశాలపై సుంకాల యుద్ధం చేస్తున్నారు.. బెదిరింపులకు దిగుతున్నారు! ఈ నేపథ్యంలోనే.. ప్రపంచానికి అమెరికా అవసరం ఎంతుందో.. అమెరికాకు ప్రపంచ అవసరం అంతే ఉందని.. ఆ విషయం అగ్రరాజ్యాధిపతి అర్ధం చేసుకోకపోతే పెను సమస్యలు తప్పకపోవచ్చని అంటున్నారు!

Tags:    

Similar News