ట్రంప్ పై బ్రహ్మాస్త్రం.. ట్రేడ్ బజూకాతో ట్రేడ్ ఫియర్
గ్రీన్ ల్యాండ్ ఆక్రమణ ప్రయత్నంపై ట్రంప్ కు వ్యతిరేకంగా యూరోపియన్ యూనియన్ దేశాలు ఏకమవ్వడంతో.. ట్రంప్ మరో వాదనకు దిగారు.;
గ్రీన్ ల్యాండ్ ఆక్రమణ ప్రయత్నంపై ట్రంప్ కు వ్యతిరేకంగా యూరోపియన్ యూనియన్ దేశాలు ఏకమవ్వడంతో.. ట్రంప్ మరో వాదనకు దిగారు. గ్రీన్ ల్యాండ్ భద్రతకు రష్యా నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో.. భద్రతా చర్యలు తీసుకోవాలని నాటో దేశాలు కోరినప్పటికీ డెన్మార్క్ సరైన చర్యలు తీసుకోలేదని ట్రంప్ పేర్కొన్నారు. గ్రీన్ ల్యాండ్ భద్రత విషయంలో డెన్మార్క్ విఫలమైన సందర్భంలోనే తాము భద్రతా చర్యల దృష్ట్యా స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు ప్రకటించారు. ఎలాగైనా గ్రీన్ ల్యాండ్ ను స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ స్పష్టం చేశారు. సమయం వచ్చింది కాబట్టే తాము గ్రీన్ ల్యాండ్ విషయంలో కల్పించుకుంటున్నామని తెలిపారు. ఈయూ దేశాలపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు మద్దతు ఇవ్వని దేశాలపై 10 శాతం అదనపు టారిఫ్ విధించారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ హెచ్చరికలకు భయపడబోమని యూరోపియన్ యూనియన్ దేశాలు స్పష్టం చేశాయి. యూరోపియన్ యూనియన్ దేశాలు తొలిసారి వాణిజ్య ఆయుధమైన `ట్రేడ్ బజూకా వాడాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ట్రేడ్ బజూకా అంటే ?
ట్రేడ్ బజూకా అంటే.. యాంటీ కొఎర్సెన్ ఇన్స్ట్రూమెంట్. ఇతర దేశాల ఒత్తిళ్ల నుంచి ఈయూ సభ్య దేశాలను కాపాడుకోవడానికి రూపొందించారు. 2023 డిసెంబర్ 27 నుంచి ఏసీఐ అమల్లోకి వచ్చింది. కానీ తొలిసారి అమెరికాపై ప్రయోగించే అవకాశం ఉంది. అమెరికాపై దీనిని ప్రయోగిస్తే భారీ స్థాయిలో ఈయూ దేశాలు అమెరికాపై టారిఫ్ లు విధిస్తాయి. అమెరికా పెట్టుబడులకు ఇబ్బందులు ఏర్పడతాయి. ఎగుమతులు పరిమితం అవుతాయి. ఈయూ దేశాల్లో అమెరికా సింగిల్ మార్కెట్ యాక్సెస్ ను నిరోధిస్తుంది. ఈయూ దేశాల్లో వ్యాపారం చేసే అమెరికా దేశాలకు అదనపు అడ్డంకులు ఏర్పడుతాయి. 11.31 లక్షల కోట్ల విలువైన అమెరికా ఉత్పత్తులపై ఈయూ దేశాలు టారిప్ లు విధించే అవకాశం ఉంటుంది. అమెరికా వెనక్కి తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకే యూరోపియన్ యూనియన్ దేశాలు ట్రేడ్ బజూకా అమలు చేయాలని కోరుతున్నాయి.
ఏసీఐ అమలు చేస్తే..
యాంటి కొఎర్సెన్ ఇన్ట్స్రూమెంట్ ను ఈయూ దేశాలు అమలు చేస్తే.. ఇదొక కఠినమైన అంశంగా మారుతుంది. అమెరికా-యూరోపియన్ యూనియన్ దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీస్తాయి. ప్రపంచ వాణిజ్యం సంక్షోభంలో పడుతుంది. అమెరికాపై భారీ స్థాయిలో టారిఫ్ లు విధిస్తారు. అదే సమయంలో అమెరికా స్పందన కూడా ఇబ్బందికరంగా మారుతుంది. దీంతో అంతర్జాతీయ వాణిజ్యం అనేక సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది.
ట్రంప్ కున్న దారేంటి ?
ఈయూ దేశాలు ట్రేడ్ బజూకాను అమలు చేస్తే.. ట్రంప్ కు ఇబ్బందులు తప్పవు. అదే సమయంలో ట్రంప్ మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది. తద్వారా అమెరికాతో యూరోపియన్ యూనియన్ సంబంధాలు దెబ్బతింటాయి. సమస్యను పరిష్కరించుకోవడానికి ట్రంప్ ముందు ఉన్న దారి.. గ్రీన్ ల్యాండ్ విషయంలో వెనక్కి వెళ్లడమే. కానీ చైనా, రష్యాతో ఇబ్బందులు తప్పవన్న కారణంతో గ్రీన్ ల్యాండ్ స్వాధీనంపై ట్రంప్ తగ్గడంలేదు. కానీ ట్రంప్ వాదనతో ఈయూ దేశాలు ఏకీభవించడంలేదు. ట్రంప్ తన వాదనతో ముందుకు వెళ్తే.. ప్రపంచ వాణిజ్యం ఇబ్బందుల్లో పడుతుంది. సప్లై చైన్ దెబ్బతింటుంది. ఫలితంగా వాణిజ్య ఇబ్బందులు ప్రపంచ వ్యాప్తంగా తలెత్తుతాయి.