బోనస్ తక్కువగా ఇచ్చారని.. మూడు గంటలు గేట్ల తెరిచిన టోల్ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే..?

ఉత్తరప్రదేశ్‌ ఫతేహాబాద్‌ టోల్‌ ప్లాజాలో జరిగిన ఈ ఘటన కేవలం ఉద్యోగుల నిరసన మాత్రమే కాదు. అది దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గాల అసంతృప్తికి ప్రతీక.;

Update: 2025-10-21 11:30 GMT

‘భారతదేశం అభివృద్ధి చెందుతోంది’.. ఇది కేవలం మాట్లాడుకునేందుకు కాదు.. కనుల ముందు కనిపిస్తుంది కూడా.. 2020-21 మధ్య గరిష్టంగా ప్రతి రోజు 37 కిలో మీటర్లు వేశారంటే అతిశయోక్తి కాదు.. నేడు అదే రోడ్డు రోజుకు 29 కిలో మీటర్లుగా ఉంది. ప్రభుత్వం మాత్రం ప్రతి రోజు 100 కిలో మీటర్ల మేర ఎక్స్ ప్రెస్ వే వేయాలని లక్ష్యంతో పని చేస్తుంది.

రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు, టోల్‌ బూత్‌లు. ఇవన్నీ ఆ అభివృద్ధికి చిహ్నాలు. కానీ, ఆ టోల్‌ బూత్‌లో నిలబడి రోజంతా వాహనాల పొగలో, వేడిలో, వర్షంలో పనిచేసే మనిషి (కార్మికుడికి)కి విలువ మాత్రం ఎక్కడో కోల్పోతుంది. లాభాల గణాంకాల్లో కార్మికుడి చెమట కంపెనీకి కనిపించదు.

ఆగ్రహించిన కార్మికులు

పండుగ బోనస్‌ లేకపోవడంతో ఆగ్రహించిన కార్మికులు వినూత్నంగా నిరసన తెలిపారు. అయితే వారి నిరసన వారికి ఎలాంటి నష్టం కల్పించలేదు.. సదరు సంస్థకు మాత్రం చాలా నష్టం కలిగించింది. వీరు చేపట్టిన ఆందోళన, సమాజానికి ఒక సంకేతం ఇస్తోంది. మనం ఎక్కడో ఒక చోట అభివృద్ధిని మానవత్వం మీద నిర్మిస్తున్నామేమో అని ఆలోచించాల్సి ఉంటుంది.

ఫతేహాబాద్ టోల్ ప్లాజా వద్ద..

అసలు విషయానికి వస్తే.. ఉత్తరప్రదేశ్‌ ఫతేహాబాద్‌ టోల్‌ ప్లాజాలో జరిగిన ఈ ఘటన కేవలం ఉద్యోగుల నిరసన మాత్రమే కాదు. అది దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గాల అసంతృప్తికి ప్రతీక. దీపావళి బోనస్‌ కింద పెద్ద కంపెనీ తమ సిబ్బందికి కేవలం రూ. 1,100 మాత్రమే ఇచ్చింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన టోల్ సిబ్బంది టోల్‌ గేట్లను తెరిచారు. దీంతో వేలాది వాహనాలు ఉచితంగా అటు.. ఇటు వెళ్లిపోయాయి.

అత్యధిక రద్దీగా ఉండే రూట్..

ఫతేహాబాద్‌లోని ఆగ్రా-లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్‌వే దేశంలోని అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో ఒకటి. ఈ మార్గంపై ప్రతిరోజు వేలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఈ ఎక్స్‌ప్రెస్‌వేపై ‘శ్రీ సైన్‌ అండ్‌ డాటర్‌’ కంపెనీ టోల్‌ ప్లాజా నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. కానీ, అక్కడ పనిచేసే 21 మంది సిబ్బంది నెలకు తమకు లభించే వేతనం తక్కువగానే ఉండగా, పండుగ సమయంలో ఇచ్చిన బోనస్‌ కూడా చాలా తక్కువగా ఉండడంతో తీవ్రంగా స్పందించారు.

కష్టాన్ని పట్టించుకోలేదని ఆందోళన

ప్రతి సంవత్సరం పండుగల వేళ లాభాల గణాంకాలు కంపెనీలకు ఆనందాన్ని తెస్తే.. ఆ లాభాల వెనుక ఉన్న తమ కష్టం మాత్రం నిర్లక్ష్యానికి గురవుతుందని కార్మికులు వాపోయారు. బోనస్‌ అనేది ఒక చిన్న సంతోషం.. ఒక గుర్తింపు.. కానీ ఇక్కడ అది అవమానంగా మారింది. అందుకే ఆ సిబ్బంది విధులు పక్కనబెట్టి గేట్లు తెరిచారు. మూడు గంటలపాటు వేల సంఖ్యలో వాహనాలు ఎలాంటి టోల్‌ ఫీజు చెల్లించకుండా వెళ్లిపోయాయి. దీంతో కంపెనీకి చాలా వరకు లాస్ వచ్చింది. ‘మీరు కార్మికుడి గౌరవాన్ని తగ్గిస్తే.. అతను మీ లాభాన్ని టచ్ చేస్తాడు’ అన్న వాస్తవాన్ని ఈ ఘటన గుర్తు చేసింది.

10 శాతం పెంపుతో శాంతించిన సిబ్బంది

యాజమాన్యం ఈ ఘటనను చిన్నదిగా తీసుకున్నా, ఆ తర్వాత పరిస్థితి పెద్దగా మారింది. ఇతర టోల్‌ ప్లాజాల నుంచి సిబ్బందిని తీసుకువచ్చింది. కానీ నిరసన చేస్తున్న ఉద్యోగులు వారిని అడ్డుకున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు కూడా రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. చివరికి కంపెనీ 10 శాతం వేతన పెంపు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.

దీపావళి వెలుగులు పంచే పండుగ. కానీ ఫతేహాబాద్‌ టోల్‌ గేట్ల వద్ద ఆ వెలుగులు కార్మికులకు కనిపించలేదు. ఆ టోల్‌ బూత్‌ నుంచి ఎలాంటి ఫీజు లేకుండా వెళ్లిన వాహనాలు లాభం పొందినా.. కంపెనీ మాత్రం కొంతలో కొంత నష్టాన్ని చూసింది. కార్మికుని నమ్మకాన్ని కోల్పోయింది.

బోనస్‌ అనేది కేవలం డబ్బులు కాదు.. అది కార్మికుడి పనికి ఇచ్చే విలువ. దాన్ని తగ్గించిన చోట, మనిషి తిరిగి నిలబడతాడు టోల్‌ గేట్లు తెరిచి అయినా.

Tags:    

Similar News