తిరుమలలో రీల్స్ .. టీటీడీ సీరియస్ యాక్షన్

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం బుధవారం ఒక్క రోజే 75,303 మంది భక్తులు హాజరయ్యారు.;

Update: 2025-08-01 06:02 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం బుధవారం ఒక్క రోజే 75,303 మంది భక్తులు హాజరయ్యారు. వీరిలో 27,166 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అదే రోజు హుండీ ద్వారా రూ.3.99 కోట్లు ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 12 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులు స్వామివారి దర్శనానికి సుమారు 15 నుంచి 17 గంటల పాటు వేచి ఉండాల్సి వచ్చింది.

ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు క్యూలైన్లలో అన్నప్రసాదం, అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు. అయితే ఇటీవలి కాలంలో భక్తులంతా తమ భక్తిశ్రద్ధను వ్యక్తపరచడానికే కాకుండా సోషల్ మీడియా ఫేమ్ కోసం రీల్స్ చేయడం పెరిగిపోతుండటంతో టీటీడీ గమనించింది.

శ్రీవారి ఆలయం, తిరుమాడ వీధుల్లో వీడియోలు తీసుకుంటూ డాన్సులు చేయడం, వెకిలి చేష్టలు చేయడం వంటి అనుచిత చర్యలు పెరుగుతున్నాయని టీటీడీ ఆందోళన వ్యక్తం చేసింది. పండుగలు, విశేష ఉత్సవాల సమయంలో శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో కలిసి స్వామివారు ఊరేగే పవిత్ర మాడ వీధులను కూడా కొందరు రీల్స్ కోసం వాడుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది.

-టీటీడీ హెచ్చరికలు

తిరుమల పవిత్రతను కాపాడడంలో ప్రతి భక్తుడి పాత్ర ఎంతో కీలకమని టీటీడీ పేర్కొంది. తిరుమల ఆలయం భక్తి, ఆరాధనకు ప్రతీకగా ఉండేదనీ, ఇలాంటి అసభ్యకర చర్యలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని దెబ్బతీస్తాయని పేర్కొంది. తిరుమలలో భక్తి భావంతో వ్యవహరించాలని, స్వామివారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తుల మనోభావాల పట్ల గౌరవం చూపాలని సూచించింది.

అలాగే భవిష్యత్తులో తిరుమలలో ఇటువంటి అభ్యంతరకర రీల్స్ చేసే వ్యక్తులను టీటీడీ విజిలెన్స్‌, సెక్యూరిటీ బృందాలు గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటాయని హెచ్చరించింది. ఆలయ పరిసరాల్లో అసభ్యంగా ప్రవర్తించిన వారి మీద చట్టపరమైన కేసులు కూడా నమోదు చేస్తామని స్పష్టం చేసింది.

-రీల్స్‌కు బ్రేక్.. భక్తికి ప్రాధాన్యం

తిరుమల క్షేత్రం భక్తి, ఆధ్యాత్మికతకు నిలయంగా ఉండే ప్రాంతమని గుర్తుంచుకోవాలి. రీల్స్ కోసం చేసే వెకిలి చేష్టలు, అసభ్య నృత్యాలు శ్రీ వేంకటేశ్వరుడిపై గల భక్తి భావనకు భంగం కలిగిస్తాయని టీటీడీ అభిప్రాయపడింది. భక్తులందరినీ ఇలాంటి చర్యల్ని నివారించి, తిరుమల పవిత్రతను కాపాడడంలో భాగస్వాములవ్వాలని కోరింది.

Tags:    

Similar News