ఫిర్యాదుదారే నిందితుడు.. టీటీడీ నెయ్యి కేసులో ట్విస్టు! మరో 11 మందిపై కేసులు
తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. డిసెంబరు 15లోగా సుప్రీంకోర్టులో చార్జిషీటు దాఖలు చేయాలన్న టార్గెట్ పెట్టుకున్న సీబీఐ సిట్ కేసు దర్యాప్తులో వేగం పెంచింది.;
తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. డిసెంబరు 15లోగా సుప్రీంకోర్టులో చార్జిషీటు దాఖలు చేయాలన్న టార్గెట్ పెట్టుకున్న సీబీఐ సిట్ కేసు దర్యాప్తులో వేగం పెంచింది. ఇటీవల టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విచారణ, ఆ తర్వాత అప్పటి ప్రొక్యూర్మెంట్ మేనేజర్ సుబ్రహ్మణ్యం అరెస్టు చేసింది. ఇక తాజాగా టీటీడీలో పనిచేస్తున్న మరో 11 మందికి ఈ కల్తీ వ్యవహారంలో భాగస్వామ్యం ఉందని సిట్ తేల్చింది. ఇందులో కేసు పెట్టిన ఫిర్యాదుదారు కూడా నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కోవడం గమనార్హం.
టీటీడీలో మొత్తం 12 మంది పాత్ర ఉన్నట్లు సిట్ తేల్చగా, ఇందులో అప్పటి జీఎం సుబ్రహ్మణ్యంను ఇప్పటికే అరెస్టు చేశారు. ఇక మిగిలిన 11 మందిలో ఆరుగురు టీటీడీ అదికారులు కాగా, మిగిలిన వారు టీటీడీ నియమించుకున్న డెయిరీ నిపుణులుగా చెబుతున్నారు. ఈ మొత్తం 11 మంది కల్తీ నెయ్యి వచ్చేందుకు సహకరించారని సిట్ దర్యాప్తులో తేలినట్లు చెబుతున్నారు. కాగా, నెయ్యి కల్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు బయటపెట్టిన వెంటనే, ఈ వ్యవహారంపై విచారణ జరపాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన జీఎం మురళీకృష్ణ కూడా నిందితుడిగానే సిట్ తేల్చడం చర్చనీయాంశమైంది.
కల్తీ నెయ్యి కేసులో ఏ25గా తిరుమల గోడౌన్ కీపర్ ఈశ్వరరెడ్డి, ఏ26గా ప్రొక్యూర్మెంట్ విభాగం పూర్వ సీనియర్ అసిస్టెంట్ అనిల్ కుమార్, ఏ27గా తిరుపతి గోడౌన్ ఇన్చార్జి వెంకటనటేశ్ బాబు, ఏ28గా పేరూరి జగదీశ్వరరెడ్డి, ఏ30గా ఫిర్యాదుదారు ప్రళయకావేరి మురళీకృష్ణ, ఏ31గా టీటీడీ గోశాల పూర్వపు డైరెక్టర్ హరినాథరెడ్డి, ఏ32 నుంచి ఏ36 వరకు టీటీడీ టెక్నికల్ ఇన్స్పెక్షన్ కమిటీ సభ్యులుగా నియమించిన డెయిరీ నిపుణులు మల్లం మహేందర్, వి.వెంకట సుబ్రహనియన్, ఎం.విజయభాస్కరరెడ్డి, బత్తుల సురేంద్రనాథ్, కె.జయరాజారావులను గుర్తించారు. కాగా, నిందితుల్లో ఇద్దరు రిటైర్డ్ ఉద్యోగులు ఉండగా, మరొకరి పదవీకాలం నవంబరుతోనే పూర్తయింది.
నిందితులు అంతా కలిసి టీటీడీకి నెయ్యి సరఫరా చేసే డెయిరీలతో కుమ్మక్కై లడ్డూ ప్రసాదంలో కల్తీకి కారణమయ్యారని సిట్ ఆరోపిస్తోంది. ప్రధానంగా టీటీడీకి నెయ్యి సరఫరా చేసే డెయిరీలు టెండర్లలో పాల్గొనేందుకు నిజంగానే అర్హత, సామర్థ్యం ఉందా అన్నది తెలుసుకునేందుకు ఆయా డెయిరీలను టెక్నికల్ టీమ్ తనిఖీ చేసి టీటీడీకి నివేదిక ఇవ్వాల్సివుంటుంది. అయితే టెక్నికల్ టీంలో ఉన్నవారు డెయిరీలను సందర్శించకుండానే తప్పుడు నివేదికలు ఇచ్చారని సిట్ అభియోగాలు మోపుతోంది. అదేవిధంగా ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ అయిందని తెలిసి కూడా ఆ విషయం దాచిపెట్టినట్లు సిట్ చెబుతోంది. మైసూరులోని సీఎఫ్టీఆర్ఐ ల్యాబ్ వెజిటబుల్ ఆయిల్స్ తో నెయ్యి కల్తీ అయినట్లు గుర్తించి, ఆ రిపోర్టును టీటీడీకి పంపింది. దాన్ని పరిశీలించాల్సిన సురేంద్రనాథ్ అనే టీటీడీ డెయిరీ నిపుణుడు అన్ని పారామీటర్లు సక్రమంగా ఉన్నట్లు నివేదిక సమర్పించినట్లు సిట్ గుర్తించింది. ఇలా మొత్తం నిందితులు అంతా తమతమ స్థాయిల్లో సహకరించి శ్రీవారి ప్రసాదంలో కల్తీకి కారణమయ్యారని సిట్ తేల్చిందని అంటున్నారు.