తిరుమలలో తప్పిన పెను ప్రమాదం.. ఏనుగుల గుంపు నుంచి తప్పించుకున్న భక్తులు

తిరుపతి పోలీసుల అప్రమత్తతతో ఏనుగుల గుంపు నుంచి శ్రీవారి భక్తుల ప్రాణాలకు పెను ప్రమాదం తప్పింది.;

Update: 2025-07-29 10:16 GMT

తిరుపతి పోలీసుల అప్రమత్తతతో ఏనుగుల గుంపు నుంచి శ్రీవారి భక్తుల ప్రాణాలకు పెను ప్రమాదం తప్పింది. దాదాపు 15 ఏనుగుల గుంపు శేషాచలం అడవుల నుంచి తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం ప్రాంతానికి తరలివచ్చాయి. ఇక్కడికి సమీపంలోనే శ్రీవారి మెట్టు ఉంది. అక్కడి నుంచి భక్తులు తిరుమలకు నడిచి వెళుతుంటారు. అయితే ఇటీవల కాలంలో తిరుమల అడవుల్లో వన్యప్రాణుల సంచారం ఎక్కువ కావడంతో పోలీసులు, టిటిడీ విజిలెన్స్ అధికారులు నిఘా పెంచారు. డ్రోన్ కెమెరా సాయంతో అడవులను పరిశీలిస్తుండగా, 15 ఏనుగుల గుంపు శ్రీనివాస మంగాపురం పరిసరాల్లో సంచరిస్తున్నట్లు కనిపించింది. దీంతో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించి ఎక్కడికక్కడ భక్తులను నిలువరించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

శేషాచలం అడవుల్లో వన్యప్రాణుల అలికిడితోపాటు ఎర్రచందనం స్మగ్లింగుకు దొంగల సంచారం ఎక్కువగా ఉంటుంది. దీంతో అడవుల్లో నిఘా కోసం ప్రభుత్వం ఆధునిక టెక్నాలజీ ఉపయోగిస్తోంది. మారుమూల ప్రాంతాల్లో ఎర్ర దొంగలను గుర్తించేందుకు డ్రోన్ కెమెరాలను సాయంగా తీసుకుంటోంది. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి డ్రోన్ తో శేషాచలం అడవుల్లో నిఘా ఉంచారు. ఇందులో శ్రీనివాస మంగాపురం సమీపంలో ఏనుగుల గుంపు కనిపించింది. దీంతో అటవీ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.

తిరుపతికి 15 కిలోమీటర్ల దూరంలో శ్రీనివాస మంగాపురం ఉంటుంది. ఇక్కడ కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. అక్కడికి కొద్ది దూరం నుంచి శ్రీవారి మెట్టు మెట్ల మార్గం ఉంటుంది. తిరుమలకు కాలినడకన తొందరగా చేరుకోవాలని భావించేవారు ఈ మార్గాన్ని ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. అయితే శ్రీనివాస మంగాపురం దాటిన తర్వాత పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతం ఉంటుంది. అక్కడ జనసంచారం ఉండదు. తిరుమలకు వెళ్లే భక్తులు అలికిడి మాత్రమే ఉంటుంది. సోమవారం రాత్రి అలిపిరిలో టోకెన్లు తీసుకున్న భక్తులు శ్రీవారి మెట్టు మార్గం నుంచి తిరుమలకు వెళుతున్నారు. ఈ సమయంలో అధికారులు డ్రోన్ తో తనిఖీ చేయగా, మెట్ల మార్గానికి సమీపంలోని పొలాల్లో గజరాజులు కనిపించాయి.

ఈ సమాచారాన్ని అధికారులు వెంటనే శ్రీవారి మెట్టు మార్గంలో ఉన్న సిబ్బందికి చేరవేశారు. వారు వెనువెంటనే భక్తులు ముందుకు వెళ్లకుండా నిలువరించారు. దీంతో ఏనుగుల గుంపునకు ఎదురవ్వకుండా భక్తులను రక్షించారు. లేనిపక్షంలో భక్తుల ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండేదని అంటున్నారు. టీటీడీ అటవీశాఖ అధికారులు, విజిలెన్స్ సిబ్బంది రంగంలోకి దిగారు. తిరుమలకు వెళుతున్న యాత్రికులను శ్రీవారి మెట్టు వరకు వెళ్లకుండా వినాయకస్వామి చెక్ పాయింట్ వద్ద నిలిపివేశారు. దాదాపు గంట పాటు యాత్రికులు అక్కడే ఉన్నారని టీటీడీ విజిలెన్స్ అధికారుల ద్వారా తెలిసింది. మైదాన ప్రాంతానికి వచ్చిన ఏనుగుల గుంపును అటవీ ప్రాంతానికి తరలించేందుకు పోలీసు, అటవీ అధికారులు తీవ్రంగా శ్రమించారు. దాదాపు మూడు నాలుగు గంటల తర్వాత ఏనుగుల గుంపు అటవీ ప్రాంతంలోకి వెళ్లడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Tags:    

Similar News