కళ్లెదుటే గుడికి వెళ్లొస్తున్న బాలుడిని ఎత్తుకెళ్లిన పులి.. భయానక ఘటన!
రాజస్థాన్‌లోని రణ్‌తంబోర్ నేషనల్ పార్క్ సమీపంలో బుధవారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.;
రాజస్థాన్‌లోని రణ్‌తంబోర్ నేషనల్ పార్క్ సమీపంలో బుధవారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. త్రినేత్ర గణేష్ ఆలయం నుంచి తన తల్లిదండ్రులు, తన తాతయ్యతో తిరిగి వస్తుండగా ఏడేళ్ల బాలుడిని ఒక పులి ఎత్తుకెళ్లి చంపేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అడవి అధికారి తెలిపిన వివరాల ప్రకారం... ఈ దుర్ఘటన అమరై అటవీ ప్రాంతంలో జరిగింది. మృతి చెందిన బాలుడు బుండిలోని లఖేరి గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు.
ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం.. "నేను మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో గణేష్ ఆలయంలో దేవుడిని దర్శించుకుని తిరిగి వస్తున్నాను. ఒక మహిళ తన కుమారుడితో నా పక్కనే నడుస్తోంది. ఒక్కసారిగా అడవిలో నుంచి ఒక పులి దూసుకొచ్చింది. ఆ పిల్లవాడిని తన దవడల్లో పట్టుకుని లాక్కెళ్లిపోయింది" అని ఆ దృశ్యాన్ని వివరించాడు.
వెంటనే ప్రజలు గణేష్ ధామ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి దాడి గురించి ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. త్రినేత్ర గణేష్ ఆలయానికి వెళ్లే అన్ని మార్గాలను మూసివేశారు. తీవ్రంగా ప్రయత్నించిన తర్వాత, అటవీ అధికారులు పులిని భయపెట్టి తరిమికొట్టారు. బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
సవాయి మాధోపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) మమతా గుప్తా మాట్లాడుతూ.. మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రిలోని మార్చురీకి తరలించామని తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.