డాలర్ల మాఫియాగా మారిన పాక్ సైన్యం.. మహాజ్ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు..

దాదాపు ఇస్లామిక్ కంట్రీస్ ను పరిశీలిస్తే.. పాకిస్తాన్ వద్దనే పెద్ద ఎత్తున సైన్యం ఉన్నట్లు కనిపిస్తుంది.;

Update: 2025-11-04 11:30 GMT

దాదాపు ఇస్లామిక్ కంట్రీస్ ను పరిశీలిస్తే.. పాకిస్తాన్ వద్దనే పెద్ద ఎత్తున సైన్యం ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ఈ ‘రోగ్ నేషన్’ మాత్రం విలువలకు తిలోదకాలు పలుకుతుంది. దేశసైన్యం అంతే ఆ దేశాన్ని రక్షించుకోవాలి.. కొంతలో కొంత ఇతర మిత్ర దేశాలకు తోడుగా నిలవాలి.. కానీ సరైన నాయకత్వం లేని పాక్ సైన్యాన్ని నమ్ముకుంటే మీరు కూడా నాశనం కావాల్సిందేనని కొందరు బాహాటంగానే హెచ్చరిస్తున్నారు. దశాబ్దాలుగా ప్రపంచానికి ‘భద్రతా బలగం’గా కనిపిస్తున్న పాకిస్థాన్‌ సైన్యం ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై ‘కిరాయి మాఫియా’గా గుర్తింపు సంపాదించుకుంటోంది. పాక్‌ జీ సింధ్‌ ముత్తహిదా మహాజ్‌ (JSMM) ఛైర్మన్‌ షఫీ బుర్ఫాత్‌ చేసిన తాజా వ్యాఖ్యలు పాకిస్థాన్‌ సైన్యంలోని దోపిడీ, లాభాపేక్ష, ద్వంద్వ ధోరణిని బహిర్గతం చేశారు. ఆయన మాటల్లో ‘పాక్‌ సైన్యం దేశ రక్షణ కోసం కాదు, డాలర్ల కోసం పోరాడుతోంది.’ అన్నారు.

‘జిహాద్‌’ నుంచి ‘డాలర్‌ యుద్ధం’ దాకా

పాకిస్థాన్‌ సైన్యం చరిత్ర వ్యూహాల కంటే వ్యాపారంపై ఎక్కువగా ఆధారపడిన చరిత్ర. సోవియట్–అఫ్గాన్‌ యుద్ధం సమయంలో ఇస్లామాబాద్‌ తనను జిహాద్‌ రక్షకుడిగా ప్రపంచానికి చూపించింది. కానీ ఆ పోరాటం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం పాశ్చాత్య సాయం, ఆయుధాలు, డబ్బు సేకరణే అని బుర్ఫాత్‌ వెల్లడించారు. 9/11 ఘటన తర్వాత కూడా అదే ధోరణి కొనసాగింది. అమెరికాకు మిత్రుడిగా నటిస్తూ ఉగ్రవాదంపై యుద్ధం చేస్తున్నట్లు చూపిన పాక్‌ సైన్యం.. అదే సమయంలో ఒసామా బిన్‌ లాడెన్‌కు ఆశ్రయం ఇచ్చింది. అంటే పాకిస్థాన్‌ ప్రభుత్వం, సైన్యం ‘పోరాటం’ అనే పేరుతో రెండు రకాల పాత్రలు పోషిస్తూ ప్రపంచాన్ని మోసం చేశాయి.

ఎవరు ఎక్కువ చెల్లిస్తే వారివైపు..

షఫీ బుర్ఫాత్‌ పాక్ సైన్యంపై మరిన్ని వ్యాఖ్యలు చేశారు. ‘బీజింగ్‌ ఎక్కువ చెల్లిస్తే పాక్‌ సైన్యం అమెరికాకు ద్రోహం చేస్తుంది.. వాషింగ్టన్‌ ఎక్కువ చెల్లిస్తే చైనాను కూడా మోసం చేస్తుంది’ అని అన్నారు. ఈ మాటలు వినడానికి కఠినంగా ఉన్నా.. వాస్తవానికి పాకిస్థాన్‌ ఆర్థిక రాజకీయ పరిస్థితి గురించి వివరిస్తాయి. పాక్‌ సైన్యం ఇప్పుడు భద్రతా వ్యవస్థ కాదు.. అది వాణిజ్య సంస్థగా మారిపోయింది. కాంట్రాక్ట్‌ యుద్ధాలు, బ్లాక్‌ మనీ డీల్స్‌, ఆర్థిక లావాదేవీలు ఇవే సైనిక నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి.

బుర్ఫాత్‌ పాకిస్థాన్‌ సైన్యాధిపతి అసీం మునీర్‌ మీద కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనను ‘నకిలీ ఫీల్డ్‌ మార్షల్‌’గా పిలుస్తూ కాలం చెల్లిన సిద్ధాంతాలతో పాకిస్థాన్‌ను నడపాలనుకునే నాయకుడు అని విమర్శించారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా పాక్‌ సైన్యం ఇప్పుడు నమ్మకాన్ని కోల్పోయిందని ఆయన పేర్కొన్నారు.

డాలర్ల కోసం అమ్ముకున్న విశ్వాసం

బుర్ఫాత్‌ వ్యాఖ్యలు కేవలం విమర్శలే కాదు.. అవి ఒక దేశపు మోసపూరిత వ్యవస్థపై తీర్పు లాంటివి. ఒకప్పుడు స్వాతంత్ర్యం, జిహాద్‌, దేశరక్షణ పేరుతో గౌరవం పొందిన పాక్‌ సైన్యం, ఇప్పుడు డబ్బు కోసం విశ్వాసాన్ని అమ్ముకునే మాఫియాగా మారిపోయింది. దానిని ఎవ్వరూ నమ్మడం లేదు అమెరికా కాదు.. చైనా కాదు.. ఇంతకుముందు మిత్రదేశాలు కూడా. ప్రపంచానికి ఇప్పుడు స్పష్టమైంది పాకిస్థాన్‌ సైన్యం ‘న్యాయం కోసం పోరాటం’ చేయదు; ‘లాభం కోసం యుద్ధం’ చేస్తుంది అని.

తమ దేశ ప్రజలకే భయం కలిగించే సైన్యం, ఇతర దేశాలకు ఎలా నమ్మకం కలిగిస్తుంది?

మూసిన తుపాకీ, తెరిచిన మోసం

పాకిస్థాన్‌ రాజకీయాల వెనుక ఉండి నడిపిస్తున్నది ఎప్పటిలాగే సైన్యమే. కానీ ఈ సైన్యం ఇప్పుడు ఆదేశం కోసం కాకుండా, ఆఫర్‌ కోసం పని చేస్తుంది. ప్రపంచం ఇది తెలుసుకుంది. ఒకప్పుడు శక్తిగా కనిపించిన పాక్‌ సైన్యం ఇప్పుడు సొంత ప్రజల విశ్వాసాన్ని కూడా కోల్పోయి మాఫియాగా మారింది అని షఫీ బుర్ఫాత్ అన్నారు.

Tags:    

Similar News