అమెరికాలో దారుణం.. రెండేళ్ల కుమారుడిని చంపేందుకు ప్రయత్నించిన తెలుగు వ్యక్తి అరెస్ట్
ఈ దారుణానికి ఒడిగట్టిన హైదరాబాద్‌కు చెందిన తెలుగు వ్యక్తిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు.
అమెరికాలో నివసిస్తున్న తెలుగు సమాజంలో తీవ్ర దిగ్భ్రాంతిని, కలకలాన్ని రేపిన ఒక అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే.. కాలయముడిగా మారి తన రెండేళ్ల సొంత కుమారుడిని అత్యంత క్రూరంగా చంపేందుకు ప్రయత్నించిన ఉదంతం ఉత్తర కరోలినా రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఈ దారుణానికి ఒడిగట్టిన హైదరాబాద్‌కు చెందిన తెలుగు వ్యక్తిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆస్పత్రిలో చేరిన చిన్నారి.. బయటపడ్డ దారుణం
పోలీసుల నివేదిక ప్రకారం.. నిందితుడిని హైదరాబాద్‌కు చెందిన కిరణ్ నేత పసునూరిగా గుర్తించారు. ఆయన కొన్నేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం అమెరికాకు వలస వెళ్లి ఉత్తర కరోలినాలో స్థిరపడ్డారు. అయితే గత నెలలో ఆయన రెండేళ్ల కుమారుడు తీవ్రమైన గాయాలతో స్థానిక ఆస్పత్రిలో చేరడంతో ఈ పాశవిక చర్య వెలుగులోకి వచ్చింది.
చిన్నారి శరీరంపై ఉన్న అసాధారణ గాయాలను గమనించిన వైద్యులకు అనుమానం వచ్చింది. అవి ఏదో ప్రమాదవశాత్తూ జరిగిన గాయాలు కావని, ఉద్దేశపూర్వకంగా చేసిన దాడిగా గుర్తించిన వైద్యులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సమగ్ర విచారణ జరపగా చిన్నారిపై తీవ్రమైన శారీరక హింస జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. దీనితో జూన్ 25న నిందితుడు కిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వైద్యుల నివేదికలో షాకింగ్ నిజాలు
చిన్నారికి జరిగిన గాయాల తీవ్రతను వివరిస్తూ వైద్యులు అందించిన నివేదిక చూసి కఠిన హృదయులైనా కన్నీరు పెట్టక మానరు. నిందితుడి దాడి కారణంగా చిన్నారికి మెదడులో తీవ్ర రక్తస్రావం అయింది. కళ్లలోని రెటీనా భాగంలో రక్తస్రావం జరిగింది. వెన్నెముకకు ఫ్రాక్చర్ అయింది. పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించారు. మెదడుపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించడం కోసం బాధితుడి పుర్రెలోని కొంత భాగాన్ని కూడా తొలగించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ చిన్నారి ప్రాణాలతో పోరాడుతూ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు.
నమోదైన కేసులు.. కఠిన శిక్ష పడే అవకాశం!
ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న అమెరికా పోలీసులు కిరణ్ నేత పసునూరిపై అత్యంత కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆయనపై ఫస్ట్ డిగ్రీ హత్యాయత్నం తో పాటు తీవ్రమైన చైల్డ్ అబ్యూస్ అభియోగాలు మోపారు. అమెరికా చట్టాల ప్రకారం ఈ తరహా నేరాలకు బెయిల్ రావడం కష్టమవ్వడమే కాకుండా నేరం నిరూపితమైతే జీవిత ఖైదు లేదా దశాబ్దాల తరబడి కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.
తెలుగు ప్రవాస వర్గాల్లో తీవ్ర ఆగ్రహం
ఈ అమానుష ఘటన సోషల్ మీడియా వేదికగా విపరీతమైన చర్చకు దారితీసింది. పసితనం కూడా తెలియని రెండేళ్ల చిన్నారిపై ఇంతటి క్రూరత్వాన్ని ప్రదర్శించిన ఆ తండ్రిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని.. కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అమెరికాలోని భారతీయ ప్రవాస వర్గాలు, ముఖ్యంగా తెలుగు సంఘాల సభ్యులు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
అసలు ఒక కన్నతండ్రి తన సొంత బిడ్డపై ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టడానికి గల కారణాలు ఏంటి? కుటుంబంలో ఏవైనా తీవ్రమైన విభేదాలు ఉన్నాయా? లేదా మానసిక రుగ్మతలేమైనా కారణమా? అనే కోణంలో పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత మరిన్ని సంచలన విషయాలు వెల్లడయ్యే అవకాశముంది.