కేబినెట్ భేటీ వేళ ఆ మంత్రులకు సీఎం రేవంత్ చురకలు?

గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగిన సందర్భంగా ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.

Update: 2026-07-03 09:24 GMT

ఆచితూచి అన్నట్లుగా ఆట మొదలు పెట్టి.. పట్టు సాధించిన తర్వాత దూకుడుగా ఆడే ఆటగాడిని తలపించేలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ తీరు మారిందా? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆయన వ్యవహరించిన తీరుకు.. రెండున్నరేళ్లు ప్రభుత్వాన్ని సక్సెస్ ఫుల్ గా సాగిస్తున్న తరుణంలో ఆయనలో ఆత్మవిశ్వాసం ఇప్పుడు మరో రేంజ్ కు వెళ్లినట్లుగా చెబుతున్నారు. గతంలో తప్పులు చేసే మంత్రుల విషయంలో ఒకింత మౌనాన్ని ప్రదర్శించటం.. లోపల కొంత అసంత్రప్తి ఉన్నప్పటికి బయటకు రానివ్వకుండా జాగ్రత్తగా వ్యవహరించే సీఎం రేవంత్ ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారా? అంటే.. అవునన్న మాట వినిపిస్తోంది.

గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగిన సందర్భంగా ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. గురుకులాల టెండర్ల వ్యవహారంలో అవినీతి జరగకున్నా.. జరిగినట్లుగా బీఆర్ఎస్ చేస్తున్న విమర్శల్ని తిప్పి కొట్టే అవకాశాన్ని చేజేతులారా విడిచిపెట్టినట్లుగా సీఎం రేవంత్ చురకలు వేసినట్లుగా తెలుస్తోంది. ఏదైనా అంశం మీద సవాలు చేస్తే కట్టుబడి ఉండాలని.. తెలంగాణ భవన్ కు వస్తానని సవాలు విసిరి ఎందుకు వెళ్లలేదు? అని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.

బహిరంగ చర్చలు ఏవైనా సరే ప్రెస్ క్లబ్ వేదికగా చేయాలని నిర్ణయం తీసుకున్నాం కదా? అందుకు భిన్నంగా కొందరు మంత్రులు గన్ పార్క్ వద్దకు వెళ్లారు.. అక్కడే రెండు గంటలు ఉన్నా.. ఆ తర్వాత వెళ్లిపోయిన వైనాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘బీఆర్ఎస్ నేతలు వచ్చే వరకు వెయిట్ చేయాల్సింది. బహిరంగంగా చర్చించి.. వాస్తవాల్ని చెప్పి.. ప్రతిపక్షాన్ని ఆత్మరక్షణలోకి నెట్టేసే అవకాశాన్ని వదులుకున్నారు. అసలు ప్రతిపక్షం వద్ద మనల్ని ఇబ్బంది పెట్టే పాయింట్లే లేవు. అలాంటి సమయంలో వాళ్లకు పని మీరు కల్పించొద్దు’ అంటూ మంత్రులను ఉద్దేశించి వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది.

గురుకులాల టెండర్ల వ్యవహారంలో అవినీతి ఏ మాత్రం జరగకున్నా.. బీఆర్ఎస్ ఆ విషయాన్ని హైలెట్ చేస్తు.. తప్పుడు ప్రచారం చేస్తుందని.. దాన్ని అడ్డుకునేందుకు సవాలు విసిరితే.. దానికి కట్టుబడి ఉండాల్సిందన్న వ్యాఖ్య సీఎం నోటి నుంచి రావటం.. అందుకుకారణమైన మంత్రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. పాలన మీద.. ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి రేవంత్ కు వచ్చిన పట్టు ఎంతన్న విషయం తాజా ఉదంతంతో మరోసారి రుజువైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News