భారీ ప్లాన్ బద్ధలు: ఔషధాల పేరుతో గంజాయి స్పీడ్ పోస్టు
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్న సామెత ఈ ఉదంతం గురించి విన్నంతనే మనసులో మెదులుతుంది.
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్న సామెత ఈ ఉదంతం గురించి విన్నంతనే మనసులో మెదులుతుంది. తాము చేసే తప్పుడు పనులు బయటకు రాకుండా ఉండేందుకు ఒక అంతర్రాష్ట్ర ముఠా చేసిన ప్లానింగ్.. కొన్నేళ్లుగా విజయవంతంగా నడిపించిన వైనం ఒకఎత్తు అయితే.. ఏ నేరమైనా ఏదో టైంలో దొరికిపోవాల్సిందే అన్న నానుడికి తగ్గట్లు.. తాజాగా హైదరాబాద్ పోలీసులకు దొరికిపోయిన గంజాయి ముఠా ఆపరేషన్స్ తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. పోస్టల్ శాఖ స్పీడ్ పోస్టు సేవల్ని తమ గంజాయి డెలివరీకి తెలివిగా వాడేసిన వైనం తెలిస్తే షాక్ తినాల్సిందే.
వాట్సాప్.. టెలిగ్రామ్ లాంటి యాప్ ల ద్వారా కోడ్ భాషలో గంజాయి ఆర్డర్ తీసుకోవటం.. ఔషధాల పేరుతో వాటిని ఎంచక్కా ప్యాక్ చేసి.. దేశంలోని పలు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న జార్ఖండ్ కు చెందిన ఒక గ్యాంగ్ ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో కీలక సభ్యులు సత్యం మిశ్రా.. అతడి అన్న శుభం మిశ్రా.. బంధువులు రాహుల్.. సచిన్.. సంతోష్ లు ఒక ముఠాగా ఏర్పడ్డారు. గతంలో లారీ డ్రైవర్ గా పని చేసిన సత్యం 2018లో ముంబయిలో ఉన్న వేళలో లారీ డ్రైవర్ గా పని చేస్తూ గంజాయికి బానిస అయ్యాడు.
గంజాయి.. డ్రగ్స్ అలవాట్లు ఉన్న వారితో పరిచయాలు అతడికి ఎక్కువ. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అతను సొంతూరుకు వెళ్లి.. గంజాయి సాగు చేయటం మొదలు పెట్టాడు. దీనికి తన అన్న సాయం తీసుకున్నాడు. గ్రామస్తులను సైతం గంజాయి సాగు చేసేలా ప్రోత్సహించాడు. సాగు చేసిన గంజాయిని మిగిలిన వారి మాదిరి సప్లై చేస్తే.. దొరికిపోతామన్న ఉద్దేశంతో ప్రత్యామ్నాయంగా పోస్టల్ శాఖ అందించే స్పీడ్ పోస్టును ఉపయోగించాలని ప్లాన్ చేశాడు.
హెర్బల్ మెడిసిన్స్ పేరుతో పార్సిల్ బుక్ చేయటం ద్వారా పోస్టాఫీసులో ఎలాంటి స్కాన్ చేయరన్న విషయాన్ని గుర్తించి.. దాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. పోస్టల్ శాఖ నుంచి వచ్చే పార్సిళ్లు కావటంతో..రైల్వే స్టేషన్లు. ఎయిర్ పోర్టులలో వీటిని ఎలాంటి స్కానింగ్ జరిగేది కాదు. ఇక.. తమ ముఠాలోని రాహుల్ ను డాక్టర్ గా చూపిస్తూ మెడిసిన్స్ పంపుతున్నట్లుగా బిల్డప్ ఇచ్చే వారు. ఇలా దేశ వ్యాప్తంగా 21 రాష్ట్రాలకు గంజాయి డోర్ డెలివరీ చేసేలా నెట్ వర్క్ ను విస్తరించారు. ఇందుకు తమకు దగ్గర్లోని ఇస్త్రీ బజార్.. పుస్త్రో బజార్ పోస్టాఫీసులను వినియోగించుకోవటం గమనార్హం.
గంజాయి పేరుకు బదులుగా మ్యాంగోస్ పేరును వాడేస్తూ.. భారీగా డెలివరీలు చేసే వారు. ఏడాదికి రూ.5 కోట్ల టర్నోవర్ చేసే స్థాయికి ఎదిగారు. గడిచిన నాలుగేళ్లుగా వీరు చేస్తున్న అరాచకం తాజాగా బద్ధలైంది. గంజాయిని స్పీడ్ పోస్టు ద్వారా డోర్ డెలివరీ చేసే నెట్ వర్క్ గురించి హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందినంతనే వారు అలెర్టు అయ్యారు. హైదరాబాద్ లోని గుడిమల్కాపూర్ కు చెందిన సుశాంత్ వ్యాస్.. మరో ప్రాంతానికి పార్సిల్ తెప్పించుకున్న లడ్డూలను అదుపులోకి తీసుకోవటం.. వారిని విచారించటం ద్వారా మొత్తం గుట్టు రట్టైంది. పక్కాగా ప్లాన్ చేసిన హైదరాబాద్ నగర పోలీసులు.. ఈ అంతర ర్రాష్ట్ర గంజాయి ముఠాను జార్ఖండ్ వెళ్లి మరీ అదుపులోకి తీసుకున్నారు. తాజా ఉదంతం నేపథ్యంలో కొరియర్.. కార్గో సేవలు అందించే ప్రతి సంస్థ ప్రతీ పార్సిల్ ను స్కాన్ చేయాలని హైదరాబాద్ సీపీ సజ్జన్నార్ సూచన చేశారు. మరి.. ఈ సూచన ఎంతవరకు అమలవుతుందో చూడాలి.