ప్రపంచంలో 11వ స్థానానికి విరాట్.. మరో రికార్డ్
క్రికెట్ మైదానంలో పరుగుల వరద పారిస్తూ.. రికార్డుల వేటలో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచంలోనూ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు.
క్రికెట్ మైదానంలో పరుగుల వరద పారిస్తూ.. రికార్డుల వేటలో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచంలోనూ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. కేవలం బ్యాట్‌తోనే కాదు, తన క్రేజ్‌తోనూ ప్రపంచాన్ని శాసించగలనని ఆయన మరోసారి నిరూపించారు. ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ప్రపంచ ప్రముఖుల జాబితాలో విరాట్ కోహ్లీ తాజాగా 11వ స్థానానికి చేరుకుని సరికొత్త రికార్డు సృష్టించారు.
కిమ్ కర్దాషియాన్‌ను వెనక్కి నెట్టిన కోహ్లీ
తాజా గణాంకాల ప్రకారం ఎక్స్ లో విరాట్ కోహ్లీ అధికారిక ఖాతాను అనుసరించే వారి సంఖ్య 69.9 మిలియన్లకు చేరుకుంది. ఈ క్రమంలో ఆయన ప్రముఖ అమెరికన్ మీడియా పర్సనాలిటీ, బిజినెస్ ఉమెన్ కిమ్ కర్దాషియాన్ ను అధిగమించారు. ప్రస్తుతం కిమ్‌కు సుమారు 69.7 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా కోహ్లీ ఆమెను వెనక్కి నెట్టి గ్లోబల్ లెవెల్లో అత్యంత ప్రభావవంతమైన సెలబ్రిటీగా దూసుకెళ్తున్నారు.
క్రీడాకారుల పరంగా చూస్తే.. ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో 111 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆయన తర్వాత ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లు కలిగిన రెండో క్రీడాకారుడిగా, ఏకైక క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ నిలవడం విశేషం. క్రికెట్ ఆడే దేశాల్లోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా కోహ్లీకి ఉన్న గ్లోబల్ పాపులారిటీకి ఈ రికార్డే నిదర్శనం.
టాప్‌లో ఉన్నది ఎవరు?
ఎక్స్ వేదికపై అత్యధిక ఫాలోవర్లతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్నారు ఆ ప్లాట్‌ఫామ్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్. ఆయనకు ఏకంగా 240 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ 106.9 మిలియన్ల ఫాలోవర్లతో ప్రపంచవ్యాప్తంగా 5వ స్థానంలో నిలిచి భారతీయుల హవాను చాటుతున్నారు.
కోహ్లీ పోస్టుల ప్రత్యేకత ఏంటి?
విరాట్ కోహ్లీ సోషల్ మీడియా ఖాతాలు కేవలం క్రికెట్ అప్‌డేట్లకే పరిమితం కావు. ఆయన తన వ్యక్తిగత జీవిత విశేషాలు, కఠినమైన ఫిట్‌నెస్ వీడియోలు, కుటుంబంతో గడిపిన మధుర క్షణాలు, బ్రాండ్ ప్రమోషన్లతో పాటు సమాజానికి పనికొచ్చే మంచి సందేశాలను కూడా పంచుకుంటారు. అందుకే ఆయన పెట్టే ప్రతి పోస్ట్‌కు లక్షల్లో లైక్‌లు, వేలల్లో కామెంట్లు, రీషేర్‌లు రావడం సర్వసాధారణం.
స్కై రాకెట్లా దూసుకుపోతున్న బ్రాండ్ వాల్యూ
ఈ రేంజ్ సోషల్ మీడియా ఫాలోయింగ్ కోహ్లీ బ్రాండ్ వాల్యూను ఆకాశానికి చేర్చింది. ప్రపంచంలోని టాప్ ఇంటర్నేషనల్ బ్రాండ్లు ఆయనతో కొలాబరేషన్ కోసం క్యూ కడుతుంటాయి. సోషల్ మీడియాలో ఒక్కో పోస్ట్‌కు కోట్ల రూపాయల వసూలు చేసే అతికొద్ది మంది గ్లోబల్ సెలబ్రిటీల్లో కోహ్లీ ఒకరిగా నిలిచారు. మైదానంలో పరుగుల వీరుడిగా, సాషల్ మీడియాలో ఫాలోవర్ల కింగ్‌గా విరాట్ కోహ్లీ సృష్టిస్తున్న ఈ రికార్డులు భారతీయులు గర్వపడేలా ఉన్నాయి.