సెటిలర్ల ఓటుకు సర్ భారీ షాక్ ?

విద్య ఉపాధి వ్యాపారం కోసం చాలా మంది హైదరాబాద్ లో ఉంటున్నారు. అలా సెటిలర్స్ తో కూడిన జనాభావే హైదరాబాద్ లో అత్యధికం.

Update: 2026-05-30 03:55 GMT

విద్య ఉపాధి వ్యాపారం కోసం చాలా మంది హైదరాబాద్ లో ఉంటున్నారు. అలా సెటిలర్స్ తో కూడిన జనాభావే హైదరాబాద్ లో అత్యధికం. ఈ రోజున చూస్తే హైదరాబాద్ జనాభా కోటికి పై దాటింది. అంటే అందులో అత్యధిక శాతం సెటిలర్స్ దే అని అంటారు. ఇక హైదరాబాద్ నిండా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలలో చాలా వాటి మీద సెటిలర్ల ప్రభావం అధికంగా ఉంది. వారు గెలుపు ఓటములను నిర్ణయిస్తున్నారు. ఆ విధంగా సెటిలర్లు తెలంగాణా ఎన్నికల్లో ముఖ్య పాత్రని పోషిస్తున్నారు. అయితే తెలంగాణాలో త్వరలో జరగబోయే ఓటర్ల జాబితా సమగ్ర సవరణ షార్ట్ కట్ లో సర్ ప్రక్రియ సెటిలర్ల ఓట్ల మీద దెబ్బ కొట్టబోతోంది అని అంటున్నారు.

ఏపీ నుంచే ఎక్కువ మంది :

తెలంగాణాలోని ప్రత్యేకించి హైదరాబాద్ లో ఉన సెటిలర్స్ లో ఎక్కువ శాతం ఆంధ్రా నుంచి ఉన్న వారే కనిపిస్తారు. దానికి కారణం ఆరు దశాబ్దాల పాటు ఉమ్మడి రాష్ట్రంగా ఉండడం, హైదరాబాద్ అందరి రాజధాని కావడం వల్లనే అని అంటున్నారు. ఆ విధంగా చూస్తే కనుక లక్షలలో సెటిలర్ల ఓట్లు అనేక నియోజకవర్గాలలో ఉన్నాయి. ఇక సర్ ప్రక్రియలో ముఖ్యమైన విధానం ఏంటి అంటే ఒకరికి ఒకే ఓటు ఉండాలి. రెండు ఓట్లు రెండు చోట్ల ఉండరాదు. అలా కనుక ఉంటే వాటిని కచ్చితంగా తొలగిస్తామని చెబుతున్నారు. అలా ఇప్పటికే దేశంలో అనేక రాష్ట్రాలలో చేసి చూపించారు కూడా.

అక్కడా ఇక్కడా ఓటు :

ఇక తెలంగాణాలో ఉన్న సెటిలర్లకు తమ సొంత ఊరులో ఒక ఓటు ఉంటోంది. అలాగే తాము ఉన్న ప్రాంతంలో ఒక ఓటు ఉంటోంది. అలా రెండు చోట్లా ఓట్లు వేయడం అన్నది చాలా ఎన్నికల నుంచి జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణాలో ముందు జరుగుతాయి. ఏపీలో తరువాత జరుగుతాయి. ఇది సెటిలర్లకు అడ్వాంటేజ్ గా ఉంది. దాంతో వారంతా రెండు చోట్లా ఓటు వేయడానికి వెసులుబాటు కలుగుతోంది. ఇలా ఏపీలో ఎన్నికలు ఉన్న వేళ ఏకంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి కిక్కిరిసిన సందర్భాన్ని కూడా అంతా చూసిన సంగతి విధితమే. అంతే కాదు బస్సులు ఎక్కి రైళ్ళు పట్టుకుని ఇతర రవాణా సాధనాలు కూడా వాడేసుకుని ఏపీకి వచ్చి పట్టుదలగా ఓట్లేసే సెటిలర్లు ఇపుడు సర్ ప్రక్రియ మొదలైతే తమ ఓటు హక్కుని ఎక్కడ ఉంచుకుంటారు అన్నది పెద్ద ప్రశ్నగా ఉంది.

అలా కుదరదు అంటూ :

తెలంగాణాలో ఉద్యోగం వ్యాపారం ఉంటే అక్కడే ఓటు ఉంచుకోవాలి. అపుడు ఏపీలో ఓటు రద్దు అవుతుంది. అదే విధంగా ఏపీ ఎప్పటికైనా తమ నేటివ్ ప్లేస్ అని భావిస్తే హైద్దరాబాద్ లో ఓటు వదిలేసుకోవాలి. నిజానికి ఈ ఆప్షన్ సెటిలర్స్ కి కష్టమైన విషయమే అని అంటున్నారు. మరో వైపు చూస్తే సెటిలర్స్ ఓట్ల మీద ఆధారపడి తెలంగాణా రాజకీయం సాగుతోంది. గతంలో సెటిలర్స్ ఓట్లతో ఒక పార్టీ రెండు సార్లు వరసగా అధికారం దక్కించుకుంది. ఇక రెండున్నరేళ్ళ క్రితం గెలిచిన కాంగ్రెస్ సైతం సెటిలర్స్ ఓట్ల మీద ఫోకస్ పెట్టి సక్సెస్ అయింది అలాగే ఈ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో మంచి విజయాలు అందుకుంది. ఇతర పార్టీలకు కూడా సెటిలర్స్ ఓట్లు ఒక పెద్ద బలంగా ఉంటూ వస్తున్నాయి.

దాంతో సెటిలర్స్ ఓట్లు పోతే రాజకీయంగా ఇబ్బంది అవుతుంది అన్న వారూ ఉన్నారు అలాగే వారు అక్కడ ఓటు హక్కు ఉంచుకుంటే ఏపీలో కూడా ప్రధాన పార్టీల రాజకీయం మారుతుందని సమీకరణల్లో మార్పులు వస్తారని అంటున్నారు ఏపీలోని శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఉన్న వారు అంతా తెలంగాణాలో సెటిలర్లుగా ఉన్నారు. వారి ఓట్లు ఏపీ పార్టీలకూ అత్యంత ప్రధానం అని అంటున్నారు. జూన్ 25 నుంచి మొదలుకాబోతున్న సర్ ప్రక్రియలో సెటిలర్ల ఓట్లు ఏమవుతాయన్నదే ఇపుడు పెద్ద చర్చగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News