ఒకే పోస్టర్ లో ఎన్టీఆర్, కేసీఆర్, బాబు, రేంవత్.. ఎవరీ సర్పంచ్ అభ్యర్థి..!

తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆరెస్స్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుదన్న సంగతి తెలిసిందే.;

Update: 2025-12-02 07:53 GMT

తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆరెస్స్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుదన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో బీఆరెస్స్, టీడీపీ... టీడీపీ, కాంగ్రెస్ ల మధ్య పరిస్థితీ అదే. అయితే.. ఈ మూడు పార్టీలకు చెందిన కీలక నేతలు ఎన్టీఆర్, కేసీఆర్, చంద్రబాబు, రేంవత్ లను ఒకే పోస్టర్ లో పెట్టి.. అభివృద్ధి ‘కూటమి’ బలపరిచిన అభ్యర్థి అని కనిపిస్తే..? తెలంగాణలో ఈ ఆసక్తికర పరిణామం తాజాగా చోటు చేసుకుంది.

అవును... తెలంగాణలో మరో ఎన్నికల సందడి మొదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో పలు చోట్ల ఏకగ్రీవాలకు అటు అధికార, ఇటు ప్రతిపక్షాలు తమ తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి! ఇప్పటికే పలు గ్రామాల్లో ఇది కార్యరూపం దాల్చిందని అంటున్నారు! ఈ సమయంలోనే... తాజా ఆసక్తికర పరిణామం చిలుకూరులో చోటు చేసుకుంది.

ఇందులో భాగంగా... చిలుకూరులో మహిళా సర్పంచ్ అభ్యర్థి తనకు కాంగ్రెస్, బీఆరెస్స్, టీడీపీల సంయుక్త మద్దతు ఉందని చెప్పుకుంటున్నారు! చిలుకూరు సర్పంచ్ అభ్యర్థి కొల్లు పుల్లమ్మ నాగయ్యకు స్థానికంగా బలమైన మద్దతు లభించడంతో ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలిచినట్లు కనిపిస్తోంది. ఈ సమయంలో సోషల్ మీడియాలో టీడీపీ, కాంగ్రెస్, బీఆరెస్స్ ల మద్దతు ఇస్తున్నట్లు ఓ పోస్టర్ దర్శనమిచ్చింది. ఇది కాస్తా ఇప్పుడు వైరల్ గా మారింది.

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ప్రధాన పార్టీల మధ్య తీవ్ర రాజకీయ పోరాటాల నేపథ్యంలో.. ఇలా ఊహించని రీతిలో మూడు పార్టీల మద్ధతు తనకు ఉందంటూ ఓ మహిళా సర్పంచ్ అభ్యర్థికి సంబంధించిన పోస్టర్ కనిపించడం ఆసక్తిగా మారింది. ఇలాంటి అరుదైన, ఏమాత్రం సాధ్యంకాని కలయిక నెట్టింట సరికొత్త చర్చకు దారి తీసింది. దీనిపై నెటిజన్లు క్రియేటివిటీగా స్పందిస్తున్నారు!

‘కుక్కలను పట్టిస్తాం, కోతులను తరిమేస్తాం’!:

ప్రస్తుతం చాలా గ్రామాల్లో వీధి కుక్కలు, కోతుల బెడద ఎక్కువగా ఉందని వినిపిస్తోన్న నేపథ్యంలో... తెలంగాణ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థుల నుంచి ఈ మేరకు ఆసక్తికర హామీలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు రోడ్లు నిర్మిస్తాం, డ్రైనేజీ సమస్యలు పరిష్కరిస్తాం అనే హామీల స్థానంలో.. కుక్కలను పట్టిస్తాం, కోతులను తరిమేస్తాం అనే హామీలు వినిపిస్తున్నాయి! ఇది ఆసక్తిగా మారింది!

Tags:    

Similar News