ఈవీ ఛార్జింగ్ లకో వాలెట్.. తెలంగాణ సర్కారు కసరత్తు
అంతకంతకూ ఎలక్ట్రిక్ వాహనాలు పెరిగిపోతున్నాయి. ఇందుకు తగ్గట్లే ఈవీల ఛార్జింగ్ తిప్పలు పెరుగుతున్నాయి.;
అంతకంతకూ ఎలక్ట్రిక్ వాహనాలు పెరిగిపోతున్నాయి. ఇందుకు తగ్గట్లే ఈవీల ఛార్జింగ్ తిప్పలు పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు.. గతంలో పోలిస్తే ఇటీవల కాలంలో ఈవీ వాహనాల ధరల్లోనూ వస్తున్న మార్పులు.. పెరుగుతున్న బ్యాటరీ సామర్థ్యాలతో ఈవీ వాహనాల్ని కొనుగోలు చేయాలన్న ఆలోచన అంతకంతకూ పెరుగుతోంది. దీంతో.. భారీగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు జోరందుకున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈవీ వాహనాల ఛార్జింగ్ కోసం పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇందులో ముఖ్యమైనది ఒక్కో కేంద్రంలో ఒక్కో మాదిరి వసూళ్లు చేస్తున్న పరిస్థితి.
ఈ నేపథ్యంలో అన్నిచోట్ల ఒకేలాంటి ఛార్జింగ్ ఫీజులు ఉండేలా ఏర్పాట్లు చేయటంతోపాటు.. ఎక్కడ ఛార్జింగ్ చేసినా.. చెల్లింపులకు ఒక ప్రత్యేక వాలెట్ ను సిద్ధం చేస్తే.. తిప్పలు తగ్గుతాయన్న మాట వినిపిస్తోంది. వివిధ కంపెనీల చార్జింగ్ స్టేషన్లు వేర్వేరు యాప్ లు.. వాలెట్లను ఉపయోగించటం వినియోగదారులకు సమస్యగా మారుతోంది. దీనికి బదులుగా అన్ని కంపెనీల ఈవీ స్టేషన్లలోనూ చెల్లింపులు ఒకేలా చేసేందుకు ప్రత్యేక వాలెట్ ను సిద్ధం చేయాలన్న యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. దీనిపై కసరత్తు జరుగుతోంది.
నిజానికి ఈవీ స్టేషన్లు భారీ ఎత్తున ఏర్పాటు చేయటంతో పాటు.. వాటన్నింటిని అనుసంధానం చేసేందుకు వీలుగా వాలెట్ ఏర్పాటు చేస్తే.. ఈవీ ఛార్జింగ్ వేళ చెల్లింపులు మరింత సులువుగా మారతాయి. వాలెట్ లో డబ్బులు లోడ్ చేస్తే చాలు.. వాటి నుంచి ఇట్టే చెల్లింపులు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ అంశంపై వాహనాల్ని ఛార్జింగ్ చేసే సంస్థలతో ప్రభుత్వ అధికారులు చర్చలు జరుపుతున్నారు. అంతేకాదు.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో పెద్ద ఎత్తున ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయటం ద్వారా ఈవీల కొనుగోళ్లు మరింత పెరుగుతాయి. అంతేకాదు.. హైవేలలో ప్రతి 40-50 కి.మీ. ఒక ఛార్జింగ్ కేంద్రం ఉండేలా ప్లాన్ చేయాలి. అన్ని ఛార్జింగ్ స్టేషన్లు ఇంటర్ కనెక్టు అయ్యేలా యూనిఫైడ్ పేమెంట్ సిస్టమ్ ను ప్రవేశ పెట్టటం చాలా అవసరంగా చెప్పాలి. మొత్తానికి ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.