టైం చాల్లేదు.. మ‌రో రెండు నెల‌లు కావాలి: ప్ర‌సాద‌రావు పిటిష‌న్‌

``టైం చాల్లేదు.. మ‌రో రెండు నెల‌లు కావాలి`` అని కోరుతూ.. తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్‌ ప్ర‌సాద‌రావు సుప్రీం కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.;

Update: 2025-10-31 13:30 GMT

``టైం చాల్లేదు.. మ‌రో రెండు నెల‌లు కావాలి`` అని కోరుతూ.. తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్‌ ప్ర‌సాద‌రావు సుప్రీం కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై విచార‌ణ జ‌ర‌గాల్సి ఉంది. తాను ఎంతో బిజీగా ఉన్నాన ని.. న్యాయ వ్య‌వ‌స్థ‌పై గౌర‌వం ఉంద‌ని కానీ.. నిర్దేశించిన గ‌డువులోగా విచార‌ణ చేయ‌లేక పోయాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. కాబ‌ట్టి.. మ‌రో రెండు మాసాల స‌మ‌యం ఇవ్వాల‌ని సుప్రీంకోర్టును ప్ర‌సాద‌రావు అభ్య‌ర్థించారు.

ఏం జ‌రిగింది?

తెలంగాణ‌లో 2023లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. అయితే.. ఆ పార్టీ త‌ర‌ఫున 36 మంది విజ‌యం ద‌క్కించుకున్నారు. వీరిలో 10 మంది ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే.. ఆ పార్టీలోకి జంప్ చేశారు. అయితే.. పార్టీలు మార‌డం.. కొత్త‌కాక‌పోయినా.. ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. పార్టీ మారిన వారిపై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని స్పీక‌ర్ ప్ర‌సాద‌రావును అభ్య‌ర్థించారు. అయితే.. ఆయ‌న తాత్సారం చేశారు.

ఆ వెంట‌నే హైకోర్టును ఆశ్ర‌యించి.. ఫిరాయించిన ఎమ్మెల్యేల‌పై ప్ర‌జాప్రాతినిధ్య చ‌ట్టం మేర‌కు చ‌ర్య‌లు తీసుకునేలా స్పీక‌ర్‌ను ఆదేశించాల‌ని కోరారు. దీనిపై ప‌లు మార్లు విచార‌ణ జ‌రిగింది. నిబంధ‌న‌ల మేరకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హైకోర్టు కూడా ఆదేశించింది. ఇక‌, ఈ విష‌యంలో ఎటూ తేల‌డం లేద‌ని భావించిన బీఆర్ ఎస్ సుప్రీంకోర్టు త‌లుపు త‌ట్టింది. ఇక్క‌డ కూడా ప‌లుమార్లు విచార‌ణ జ‌రిగింది. ఈ క్ర‌మంలో స్పీక‌ర్‌కు మూడు నెల‌ల గ‌డువు ఇచ్చిన సుప్రీంకోర్టు అప్ప‌టి లోగా ఈ వ్య‌వ‌హారాన్ని తేల్చాల‌ని చెప్పింది.

అయితే.. ఈ మూడు మాసాల్లో ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, పఠాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తదితర నలుగురు ఎమ్మెల్యే లను మాత్ర‌మే విచారించారు. మిగిలిన వారి విచార‌ణ పెండింగులో ఉంది. మ‌రోవైపు.. సుప్రీంకోర్టు ఇచ్చిన గ‌డువు.. శుక్ర‌వారం(అక్టోబ‌రు 30)తో ముగిసిపోయింది. దీంతో త‌మ‌కు మ‌రో 2 మాసాల స‌మ‌యం కావాల‌ని కోరుతూ.. స్పీక‌ర్ ప్ర‌సాద‌రావు సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఫిరాయించిన ఎమ్మెల్యేలు మాత్రం.. తాము బీఆర్ ఎస్‌లోనే ఉన్నామ‌ని.. కేసీఆర్ త‌మ నాయ‌కుడ‌ని చెబుతుండడం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News