బీజేపీ మాస్టర్ ప్లాన్ - తెలంగాణాలో జమిలి ఎన్నికలు
నిజానికి చూస్తే షెడ్యూల్ ప్రకారం తెలంగాణాలో 2028 డిసెంబర్ లో అసెంబ్లీకి ఎన్నికలు ఉంటాయి. 2029లో పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయి.;
తెలంగాణాలో గత రెండు పర్యాయాలు చూస్తే అసెంబ్లీకి ఒకసారి పార్లమెంట్ కి ఒకసారి ఎన్నికలు జరుగుతున్నాయి. 2014 వరకూ చూస్తే ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలు ఒకేసారి జరిగేవి. కానీ ఆ గొలుసు కట్టు బంధం నుంచి తెలంగాణా తప్పుకుంది. 2018లో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరు నెలలు ముందుగా ఎన్నికలు జరిపించుకుంది. అసెంబ్లీని దాని కోసం రద్దు చేసింది. ఆనాడు కేంద్ర పెద్దలతో టీఆర్ఎస్ కి ఉన్న సాన్నిహిత్యం వల్లనే ఇది సాధ్యపడింది అని అంటారు. 2019 ఎంపీ ఎన్నికలు అక్కడ విడిగా జరిగాయి. ఆ తరువాత అదే కొనసాగింది. 2023లో తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు వస్తే 2024లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి.
బంధం బిగించాలని :
అయితే తెగిపోయిన ఈ గొలుసుకట్టు బంధాన్ని గట్టిగా బిగించాలని బీజేపీ భావిస్తోంది అని అంటున్నారు. పార్లమెంట్ కి అసెంబ్లీకి ఒకేసారి జరిగితే జాతీయ పార్టీల ప్రభావం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మీద పడి అది బీజేపీకి ఎంతగానో ఉపకరిస్తుందని ఆ పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నారు అని అంటున్నారు. బీజేపీకి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా ఎనిమిది ఎంపీ సీట్లు దక్కాయి. అంతకు ముందు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కేవలం ఎనిమిది సీట్లే వచ్చాయి. దాంతో బీజేపీ ఈసారి స్ట్రాటజీ మారుస్తోంది అని అంటున్నారు.
ఏమి జరగనుంది :
నిజానికి చూస్తే షెడ్యూల్ ప్రకారం తెలంగాణాలో 2028 డిసెంబర్ లో అసెంబ్లీకి ఎన్నికలు ఉంటాయి. 2029లో పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయి. మరి ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలి అంటే ఆరు నెలల పాటు రాష్ట్రంలో ఎన్నికలు లేకుండా రాష్ట్రపతి పాలన విధించాలి. అలా జరిగేందుకు ఆస్కారం ఉంటుందా అన్నది ఒక చర్చ. అదే జరిగితే బీజేపీకి అధికార యంత్రాంగం మీద పట్టు దొరుకుతుంది కానీ విపక్షాల విమర్శలు హెచ్చుగా ఉంటాయి. అది జనంలో వేరే వ్యతిరేక భావన కలిగించే చాన్స్ ఉంది. అలా కాకూడదు అంటే పార్లమెంట్ కే ముందస్తు ఎన్నికలు పెడితేనే సాధ్యపడవచ్చు. అంటే కేంద్రం 2029 లో షెడ్యూల్ ప్రకారం కాకుండా ముందుగా ఎన్నికలకు వెళ్తుందా అన్నది మరో చర్చగా ఉంది.
కీలక నేత వ్యాఖ్యలు :
ఇక చూస్తే కనుక బీజేపీకి చెందిన కీలక నేత రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలను తాజాగా చేశారు. దేశంలో జనగణనకు ఎక్కువ టైమ్ తీసుకోదని ఆయన వెల్లడించారు. కేవలం ఆరేడు నెలలలో అది మొత్తం ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. ఇక ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చెప్పుకొచ్చారు. మహిళా రిజర్వేషన్‌తో పాటు ప్రక్రియ అంతా సార్వత్రిక ఎన్నికల లోపే పూర్తవుతాయని ఆయన అంటున్నారు. అదే విధంగా అసలైన విషయం కూడా చెప్పేశారు. అదే తెలంగాణలో కూడా అసెంబ్లీ, పార్లమెంట్‌కు ఒకేసారి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఆయన అంటున్నారు. మరి ఎలా జరుగుతుంది అంటే పార్లమెంట్ కి ముందస్తు ఎన్నికలు వచ్చే చాన్స్ ఉందేమో అన్నదే ఇపుడు అంతటా ఆలోచిస్తున్న నేపథ్యం ఉంది. మరి జమిలి ఎన్నికలు తెలంగాణాలో జరిగితే కనుక బీజేపీకి విజయావకాశాలు పెరుగుతాయా అదే జరిగితే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏ విధమైన వ్యూహ రచన చేస్తాయి అన్నది కూడా మరో డిస్కషన్ గా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.