సర్పంచ్ పదవికి వేలం.. రూ.20 లక్షలకు దక్కించుకున్న నేత

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలవుతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్న ఒక ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.;

Update: 2025-11-28 16:55 GMT

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలవుతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్న ఒక ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అత్యంత అరుదైన రీతిలో ఒక పంచాయతీ సర్పంచ్ పదవిని ఏకంగా రూ.20 లక్షలకు బహిరంగ వేలం ద్వారా దక్కించుకున్నట్లు సమాచారం. ఈ చర్య ఎన్నికల నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ.. గ్రామస్థులు మాత్రం ఈ నిర్ణయంపై సంబరాలు చేసుకోవడం విశేషం.

* దేవాలయ నిర్మాణానికే వేలం నగదు

ఈ సంఘటన ఖమ్మం జిల్లాలోని కామేపల్లి మండలం జోగుగూడెం పంచాయతీలో చోటుచేసుకుంది. గ్రామస్థులు కలసి సర్పంచ్ పదవికి బహిరంగ వేలం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ వేలంలో వచ్చిన మొత్తం నగదును గ్రామంలో తలపెట్టిన అభయాంజనేయ స్వామి దేవాలయ నిర్మాణానికి వినియోగించాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. వేలం ప్రక్రియలో మొత్తం ఏడుగురు అభ్యర్థులు పోటీపడ్డారు. వారంతా తమతమ స్థాయిలో ధరలు చెబుతూ పోటీని పెంచారు. చివరకు ఒక అభ్యర్థి అత్యధికంగా రూ.20 లక్షలు చెల్లించేందుకు అంగీకరించి సర్పంచ్ పదవిని దక్కించుకున్నారు.

* ఎన్నికల ప్రక్రియకు ముందు అసాధారణ పరిణామం

తెలంగాణలో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సర్పంచ్ పదవిని గెలుచుకునేందుకు పలువురు రాజకీయ నాయకులు, అభ్యర్థులు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవం చేసేందుకు డబ్బు లేదా ఇతర ప్రయోజనాలను ఆశ చూపడం వంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే జోగుగూడెం పంచాయతీలో జరిగిన బహిరంగ వేలం ఇటువంటి సంఘటనలన్నింటిలోకీ ప్రత్యేకమైనదిగా నిలిచింది. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికల ప్రక్రియకు బదులుగా, ఒక పదవిని సామూహిక నిర్ణయంతో వేలం వేయడం విమర్శలకు తావిస్తున్నప్పటికీ, దేవాలయ నిర్మాణానికి నిధులు సమకూర్చాలనే ఉద్దేశంతో గ్రామస్థులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

జోగుగూడెం పూర్తిగా గిరిజన గ్రామమైన జోగుగూడెం. ఈ గ్రామంలో మొత్తం జనాభా సుమారు 1350 కాగా, 800 మంది ఓటర్లు ఉన్నారు. ఈ గ్రామంలో రెండో దశలో పోలింగ్ జరగనుంది. ఈనెల 30 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. సర్పంచ్ పదవికి వేలం పాట పూర్తయిన తర్వాత తమ గ్రామాభివృద్ధికి నిధులు సమకూరాయనే సంతృప్తితో గ్రామస్థులు ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకున్నట్లు సమాచారం.

* నిబంధనల ఉల్లంఘనపై ప్రశ్నలు

పంచాయతీ ఎన్నికల నిబంధనల ప్రకారం ఏ పదవిని కూడా బహిరంగంగా వేలం వేయడం లేదా అమ్మడం చట్ట విరుద్ధం. డబ్బు చెల్లించి పదవి దక్కించుకున్న అభ్యర్థిపై, అలాగే వేలం నిర్వహించిన గ్రామ పెద్దలపై ఎన్నికల సంఘం లేదా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

ప్రజాస్వామ్య విలువలను, ఎన్నికల పారదర్శకతను దెబ్బతీసే ఇటువంటి చర్యలు భవిష్యత్తులో కూడా చోటుచేసుకోకుండా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశంపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News