తెలంగాణ‌లో 'రైతు డిస్కం' రాజ‌కీయం.. అస‌లేంటిది?

తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌స్తుతం `రైతు డిస్కం` వ్య‌వ‌హారం పెను దుమారానికి దారితీసింది.

Update: 2026-06-01 04:12 GMT

తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌స్తుతం `రైతు డిస్కం` వ్య‌వ‌హారం పెను దుమారానికి దారితీసింది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ స‌హా.. ఇటీవ‌ల ఆవిర్భ‌వించిన తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత సైతం.. ఈ వ్య‌వ‌హారంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. రైతుల మెడ‌కు ఉరి బిగించ‌డ‌మేన‌ని బీఆర్ ఎస్ నాయ‌కుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక‌, క‌విత స్పందిస్తూ.. ఇది రైతుల‌పై జ‌రుగుతున్న కుట్ర‌గా అభివ‌ర్ణించారు. రైతుల‌కు 24 గంట‌లూ ఉచిత విద్యుత్ ఇస్తామ‌న్న సీఎం రేవంత్ రెడ్డి.. ఆ విష‌యాన్ని అధికారికంగా ఎందుకు ప్ర‌క‌టించ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. ఇలా.. రాజ‌కీయ దుమారానికి దారి తీసింది.

ప్ర‌భుత్వం ఏం చెబుతోంది?

రైతు డిస్కం వ్య‌వ‌హారంపై సీఎం రేవంత్ రెడ్డి ఇటీవ‌ల కూడా ప్ర‌క‌ట‌న చేశారు. దీని వ‌ల్ల రైతుల‌కు మ‌రింత మెరుగైన విద్యుత్ స‌ర‌ఫ‌రా జ‌రుగుతుంద‌న్నారు. ముఖ్యంగా ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రత్యేకంగా, నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక విద్యుత్ పంపిణీ సంస్థే "రైతు డిస్కం`` అని వ్యాఖ్యానించారు. వ్యవసాయానికి, రైతులకు సంబంధించిన విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ, సబ్సిడీల లెక్కలు అన్నీ ఈ ప్రత్యేక సంస్థ పరిధిలోకి వస్తాయని అధికారులు కూడా చెబుతున్నారు.

ఇక‌, ఈ డిస్కం ద్వారా.. వ్యవసాయ రంగానికి మాత్రమే పరిమితమ‌వుతుంది. దీనివల్ల ఇతర రంగాలకు (గృహ, వాణిజ్య) ఎలాంటి అంతరాయం కలగకుండా రైతులకు నిరంతర విద్యుత్ అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.. అంతేకాదు.. ఖచ్చితమైన డేటా కూడా ప్ర‌భుత్వానికి చేరుతుంది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఎన్ని ఉన్నాయి. మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్ల వివరాలను డిజిటలైజ్ చేసి పారదర్శకతను పెంచేందుకు దీన్ని ఉపయోగించనున్నారు.

విప‌క్షాల వాద‌న ఇదీ..

రైతు డిస్కం వ్య‌వ‌స్థ ఏర్పాటు వెనుక‌.. ప్రైవేటీక‌ర‌ణ కుట్ర ఉంద‌న్న‌ది విప‌క్షాలు స‌హా కొన్ని రైతు సంఘాలు కూడా వాదిస్తున్నాయి. రైతు డిస్కం ఏర్పాటు ద్వారా విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించేందుకే ఈ ప్రత్యేక డిస్కం ఏర్పాటు చేశారని అంటున్నారు. తద్వారా భవిష్యత్తులో ఉచిత విద్యుత్తును ఎత్తివేస్తారని రైతులు, కొన్ని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం దీనిపై స‌రైన వివ‌ర‌ణ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంటుంది. అలా కాకపోతే.. దీనిపై దుమారం మ‌రింత‌పెరిగే అవ‌కాశం ఉంద‌ని ప‌రిశీల‌కులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News