తెలంగాణలో సంచలనం: నామినేషన్ పత్రాల చోరీ!
తెలంగాణలో సంచలనం చోటు చేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి.. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు;
తెలంగాణలో సంచలనం చోటు చేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి.. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అయితే.. వికారాబాద్ జిల్లాలో అభ్యర్థులు దాఖలు చేసి న నామినేషన్ పత్రాలను దుండగులు చోరీ చేశారు. ఈ జిల్లాలోని నాలుగు గ్రామాలకు చెందిన నామినేషన్ పత్రాలను ఓ స్ట్రాంగ్ రూమ్ లో భద్ర పరిచారు. అయితే.. దుండగులు.. స్ట్రాంగ్ రూమ్ తాళాలను పగులగొట్టి నామినేషన్ పత్రాలను చోరీ చేశారు. దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏం జరిగింది?
వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం పరిధిలోని హనుమాపూర్, గొట్ల పల్లి, జైరాం తండా, గిర్‌మా పూర్ గ్రామాలకు సంబంధించిన ఎన్నికలు రెండో విడతలో పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి దాఖలైన నామినేషన్ పత్రాలను.. గొట్లపల్లిలోని స్ట్రాంగ్ రూమ్‌లో అధికారులు భద్రపరిచారు. వీటిని బుధవారం నుంచి స్క్రూటినీ నిర్వహించి.. అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. అయితే.. బుధవారం ఉదయం 12 గంటల సమయంలో స్ట్రాంగ్ రూమ్‌కు చేరుకోగా.. తాళాలు పగులగొట్టి ఉన్నాయి.
లోపలికి వెళ్లి చూడగా .. నామినేషన్ పత్రాలు కనిపించలేదు. దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి పలు నామినేషన్ పత్రాలను ఎత్తుకెళ్లారని పోలీసులు గుర్తించారు. దీంతో అనుమానితులపై విచారణ చేస్తున్నారు. ఇదిలావుంటే.. నామినేషన్ పత్రాలు పోయినప్పటికీ.. ఇబ్బంది లేదని అధికారులు తెలిపారు. వాటిని ఇప్పటికే ఆన్‌లైన్ చేశామని..వివరాలు అన్నీ ఉన్నాయని ఆందోళన చెందాల్సిన పనిలేదని వివరించారు.
వాయిదాకు డిమాండ్..
నామినేషన్ పత్రాలు దొంగిలించడంపై స్థానిక గ్రామాలకు చెందిన వారు ఆందోళనకు దిగారు. ఈ ఎన్నికలను వాయిదా వేయాలని.. తిరిగి నామినేషన్లు స్వీకరించాలని డిమాండ్ చేశారు. అయితే.. ఆ అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. కాగా.. రాష్ట్రంలో ఇలా నామినేషన్ పత్రాలను ఎత్తుకెళ్లడం ఇదే తొలిసారి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది.