హైదరాబాద్ మెట్రో 2 దశ పూర్తి అయితే.. రోజు జర్నీచేసే వారెంత?
ఈ మూడు కారిడార్ లకు సంబంధించి మొదటి మార్గం..జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు ఏర్పాటు చేసేలా ప్లాన్ చేశారు.;
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మెట్రో ఫేజ్ 2ను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా మూడు మార్గాలకు సంబంధించిన డీపీఆర్ లను వేర్వేరుగా రూపొందించిన సంగతి తెలిసిందే. తాజాగా వాటికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదాన్ని తెలిపింది. దీన్ని కేంద్రానికి పంపాలని ఆదేశించింది. ఇంతకూ మెట్రో ఫేజ్ 2బీకి సంబంధించిన ఎన్ని కిలోమీటర్లు ప్లాన్ చేస్తున్నారు? ఎన్ని స్టేషన్లు అందుబాటులోకి వస్తాయి? ఏయే రూట్లలో ఎంతమంది ప్రయాణిస్తారు? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే మూడు కారిడార్లలో 69.2 కిలోమీటర్ల మార్గం అందుబాటులో ఉండటం తెలిసిందే. ఇది కాకుండా మెట్రో 2(ఏ)లో భాగంగా 4-8 కారిడార్లకు సంబంధించి 76.4 కిలోమీటర్ల మార్గానికి సంబంధించిన డీపీఆర్ ను 2024 నవంబరులో కేంద్రానికి పంపారు. దీని అనుమతుల కోసం ఎదురుచూస్తున్నారు. దీనికి అదనంగా మరో మూడు మార్గాల్ని రేవంత్ సర్కారు డిసైడ్ చేయటం.. దానికి సంబంధించిన డీపీఆర్ లను పూర్తి చేసి.. తాజాగా మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్ర వేశారు.
ఈ మూడు కారిడార్ లకు సంబంధించి మొదటి మార్గం..జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు ఏర్పాటు చేసేలా ప్లాన్ చేశారు. కారిడార్ మొత్తం 24.5 కి.మీ. ఉండనుంది. ఈ పరిధిలో మొత్తం 18 స్టేషన్లు అందుబాటులోకి వస్తాయి. దీనికి అయ్యే ఖర్చు రూ.6946కోట్లు. ఈ మార్గాన్ని పూర్తి చేస్తే 2030 నాటికి రోజు 2.54 లక్షల మంది ప్రయాణిస్తారని.. అదే 2055 నాటికి ఈ సంఖ్య 5.70 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేశారు.
ఈ మార్గంలో వచ్చే స్టేషన్లు చూస్తే..
- జేబీఎస్ న్యూ
- డైమండ్ పాయింట్
- బాపూజీ నగర్
- ఓల్డ్ బోయిన్ పల్లి
- బోయిన్ ప్లలి చెక్ పోస్టు
- డెయిరీ ఫాం
- సుచిత్ర జంక్షన్
- పైప్ లైన్ రోడ్
- అంగడిపేట్
- దూలపల్లి క్రాస్ రోడ్
- కొంపల్లి
- గుండ్లపోచంపల్లి
- ఈఎంఆర్ఐ
- కండ్లకోయ
- ఓఆర్ఆర్ మేడ్చల్
- మేడ్చల్ చెక్ పోస్టు
- మేడ్చల్ మరో 2 స్టేషన్లు వస్తాయి.
మొత్తం మూడు మార్గాల్లో రెండోది జూబ్లీ బస్ స్టేషన్ నుంచి శామీర్ పేట వరకు. ఈ మార్గం మొత్తం 22 కిలోమీటర్ల నిడివి ఉంటుంది. మొత్తం 14 స్టేషన్లు అందుబాటులోకి వస్తాయి. 2030 నాటికి ఈ మార్గంలో 1.92 లక్షల మంది ప్రయాణిస్తారని.. అదే 2055 నాటికి ప్రయాణికుల సంఖ్య 3.74 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేశారు. ఈ మార్గం పూర్తి చేసేందుకు రూ.5465 కోట్లు అవసరమవుతుంది. ఈ మార్గంలో వచ్చే స్టేషన్లు చూస్తే..
- జేబీఎస్ న్యూ
- విక్రంపురి
- కార్ఖానా
- తిరుమలగిరి క్రాస్ రోడ్
- లాల్ బజార్
- లోతుకుంట
- అల్వాల్
- రాష్ట్రపతి నిలయం కూడలి
- బొల్లారం
- హకీంపేట
- దేవరయంజాల్
- తూంకుంట
- ఓఆర్ఆర్ శామీర్ పేట
- శామీర్ పేట
తాజాగా ఆమోదించిన మూడో రూట్ శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వరకు. ఈ మార్గంలో మొత్తం 39.6కి.మీ. ఉండనుంది. మిగిలిన మార్గాలతో పోలిస్తే ఈ మార్గంలో తక్కువ స్టేషన్లు ఉంటాయి.
నిడివి ఎక్కువగా ఉంటుంది. మొత్తం తొమ్మిది స్టేషన్లు ప్రతిపాదించారు. ఈ మార్గం నిర్మాణానికి రూ.7168 కోట్లుగా అంచనా వేశారు. 2029 నాటికి ఈ రూట్ లో ప్రయాణికుల సంఖ్య 1.98 లక్షలు ఉంటుందని.. 2055 నాటికి మాత్రం 6.03 లక్షలకు పెరుగుతుందని అంచనా వేశారు. ఈ మార్గంలో గ్రీన్ ఫీల్డ్ రహదారి మధ్యలో నుంచి భూమార్గంలో 17.1 కి.మీ. ట్రాక్ ఉంటుంది.
ఈ మార్గంలో వచ్చే తొమ్మిది స్టేషన్లను చూస్తే..
- శంషాబాద్ ఎయిర్ పోర్టు
- పెద్ద గోల్కొండ
- బహదూర్ గూడ
- తుక్కుగూడ
- రావిర్యాల
- కొంగరకలాన్
- రాచలూరు
- గుమ్మడవెల్లి
- స్కిల్ వర్సిటీ