మావోయిస్టులకు మరో దెబ్బ... తెలంగాణ డీజీపీ ముందు భారీ లొంగుబాట్లు!
వరుస లొంగుబాట్లు, ఎన్ కౌంటర్ల నడుమ మావోయిస్టులకు మరో భారీ దెబ్బ తగిలింది. ఇందులో భాగంగా... 37 మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు.;
వరుస లొంగుబాట్లు, ఎన్ కౌంటర్ల నడుమ మావోయిస్టులకు మరో భారీ దెబ్బ తగిలింది. ఇందులో భాగంగా... 37 మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. తాజాగా లొంగిపోయినవారిలో రాష్ట్ర కమిటీ సభ్యులు సాంబయ్య అలియాస్ ఆజాద్, నారాయణ అలియాస్ రమేష్, సోందా అలియాస్ ఎర్ర ఉన్నారు! మిగిలిన 34 మంది మావోయిస్టులు ఛత్తీస్ గఢ్ కు చెందిన వారని తెలిపారు.
అవును... మావోయిస్టు కార్యకలాపాలపై ప్రభుత్వ నడుపుతున్న ఆపరేషన్లు మరోసారి బిగ్ రిజల్ట్ ఇచ్చింది. ఇందులో భాగంగా మొత్తం 37 మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఇందులో కీలకమైన సాంబయ్య అలియాస్ ఆజాద్ కూడా అధికారులు ముందుకు రాగా.. ఆయన ఏవోబీ ప్రాంతంలో పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు వెల్లడించారు.
కీలక విషయాలు వెల్లడించింది డీజీపీ!:
ఈ సందర్భంగా స్పందించిన డీజీపీ శివధర్ రెడ్డి.. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం ఇచ్చిన పిలుపుతో మావోయిస్టులకు బయటకి వస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా శాంతియుత జీవనానికి ముందువచ్చే వారికి ప్రభుత్వం అందుబాటులో ఉన్న ప్రతి విధమైన సహాయాన్ని అందిస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా... మావోయిస్టుల లొంగుబాటుకు పార్టీ అంతర్గత విబేధాలు, ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత పరిస్థితులు కూడా కారణమవుతున్నాయని అన్నారు.
ఇక తాజాగా లొంగిపోయినవారిలో ఆజాద్ పై రూ.20 లక్షలు, నారాయణపై రూ.20 లక్షల రివార్డు ఉందని తెలిపారు. ఇదే క్రమంలో... వీరితోపాటు లొంగిపోయిన మావోయిస్టులందరిపైనా కలిపి మొత్తం రూ.1.41కోట్ల రివార్డు ఉందని.. ఆ మొత్తాన్ని వారికే అందజేస్తామని.. దీనితోపాటు తెలంగాణకు చెందిన వారికి ప్రభుత్వం ఇస్తున్న పునరావాస ప్యాకేజీ అందిస్తామని వెల్లడించారు.
ఇదే క్రమంలో... తెలంగాణకు చెందిన మరో 59 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారని చెప్పిన డీజీపీ... వారిలో ఐదుగురు కేంద్ర కమిటీ సభ్యులు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, పాక హనుమంతు అలియాస్ గణేశ్, బడె చొక్కారావు అలియాస్ దామోదర్ తో పాటు రాష్ట్ర కమిటీలో 10 మంది ఉన్నారు.