ఐదేళ్లుగా మార్చురీలోనే మృతదేహం.. రెండు ఇంటిపేర్లే కారణం!
ఇదే క్రమంలో ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన ఓ వ్యక్తి మరణించి, సుమారు ఐదేళ్ల నుంచి అతని మృతదేహం మార్చురీలోనే ఉన్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.;
ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి ఆచూకీ లేకుండా చాలా మంది ఇబ్బంది పడుతుంటారనే సంగతి తెలిసిందే. అక్కడ యజమానులు పెట్టే కష్టాలు ఓర్చుకోలేక, ఇటు స్వదేశానికీ రాలేక ప్రత్యక్ష నరకం చూస్తుంటారు. ఇదే క్రమంలో ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన ఓ వ్యక్తి మరణించి, సుమారు ఐదేళ్ల నుంచి అతని మృతదేహం మార్చురీలోనే ఉన్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లిన వ్యక్తి అయిదేళ్ల కిందట అక్కడే మృతి చెందగా.. అప్పటినుంచి అతని సమాచారం సమాచారం లేక ఎప్పటికైనా తిరిగొస్తారని కుటుంబసభ్యులు ఎదురుచూశారు. అయితే... ఆయన ఐదేళ్ల క్రితమే మరణించారని, అక్కడి మార్చురీలోనే మృతదేహం ఉందని తెలియడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దామ్..!
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని రాంనగర్ కు చెందిన 40 ఏళ్ల నరేశ్ కు పదిహేడేళ్ల కిందట కథలాపూర్ మండలానికి చెందిన లతతో వివాహమైంది. ఈ క్రమంలో.. కొద్దికాలం తర్వాత బహ్రెయిన్ వెళ్లిన నరేశ్ 2010లో తిరిగొచ్చారు. కొన్ని నెలలు కుటుంబంతో సంతోషంగా గడిపి, తిరిగి బహ్రెయిన్ కు వెళ్లారు.
బహ్రెయిన్ లో తొలుత భవన నిర్మాణ కార్మికుడిగా.. ఆ తర్వాత ఓ కంపెనీలో మెకానిక్ గా పని చేసిన నరేశ్... చివరగా 2018లో తన పాస్ పోర్టు గడువు ముగుస్తోందని, డబ్బులు పంపించాలని కుటుంబసభ్యులను సంప్రదించారు. అయితే.. ఆ తర్వాత నుంచి కుటుంబ సభ్యులకు ఆయన టచ్ లో లేరు. ఎక్కడ పని చేస్తుందీ కూడా తెలియని పరిస్థితి.
ఈ క్రమంలో నరేశ్ ఆచూకీ కనిపెట్టాలంటూ ఆయన కుటుంబసభ్యులు భారత రాయబార కార్యాలయ అధికారులను ఆరు నెలల కిందట విన్నవించగా.. ఇంటి పేరు శ్రీపాదకు బదులుగా ధర్మపురి అని పేర్కొనడంతో సమాచారం తెలియలేదట. అయితే.. నరేశ్ 2020 మే నెలలోనే మృతి చెందారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
వాస్తవానికి ఆయన మృతి చెందిన విషయం ఆయన కుటుంబసభ్యులకు తెలియజేయడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో.. భారత రాయబార కార్యాలయ అధికారులు మృతదేహాన్ని అక్కడి మార్చురీలోనే భద్రపరిచారట. అయితే.. ఇటీవల మృతుడి వివరాలను అధికారులు సోషల్ మీడియాలో ఉంచడంతో అసలు విషయం తెలిసింది.
ఈ సందర్భంగా స్పందించిన నరేశ్ సోదరుడు ఆనంద్... మృతదేహాన్ని త్వరగా రప్పించాలని కోరుతూ హైదరాబాద్ లో సీఎం ప్రవాసి ప్రజావాణికి దరఖాస్తు చేశారు. అయితే నరేశ్ మృతికి కారణాలేంటనేది స్పష్టంగా తెలియరాలేదు. ఈ విషయం తెలుసుకున్న ఆయన కుటుంబ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
ఇంతకూ ఈ సమస్యకు అసలు కారణం... కన్న తల్లితండ్రుల ఇంటిపేరు ఒకటి కాగా.. దత్తత తీసుకున్న కుటుంబం ఇంటిపేరు మరొకటి. దీంతో.. నరేశ్ పాస్ పోర్ట్ లో అతని ఇంటిపేరు 'శ్రీపాద' అని ఉంది. ఇది అతన్ని దత్తత తీసుకున్న కుటుంబం ఇంటి పేరు కాగా.. నరేశ్ తల్లిదండ్రుల ఇంటిపేరు 'ధర్మపురి'. దీనివల్లే నరేశ్ ను గుర్తించడంలో ఇబ్బందులు తలెత్తాయని అంటున్నారు.