ఫ్యూచర్ సిటీని గుజరాత్ గిఫ్టు సిటీలా ప్లాన్ చేయొచ్చుగా రేవంత్?

కలలు కనటం వేరు. వాటిని నెరవేర్చుకోవటం వేరు. అత్యున్నత స్థానంలో ఉన్నా.. అధికారం చేతిలో ఉన్నా అన్నీ అనుకున్నట్లుగా చేయటం అంత తేలికైన విషయం కాదు.;

Update: 2025-12-10 05:30 GMT

కలలు కనటం వేరు. వాటిని నెరవేర్చుకోవటం వేరు. అత్యున్నత స్థానంలో ఉన్నా.. అధికారం చేతిలో ఉన్నా అన్నీ అనుకున్నట్లుగా చేయటం అంత తేలికైన విషయం కాదు. కానీ.. అలాంటి సవాళ్లను ఎదుర్కొని మరీ తాను కల కన్న ఫ్యూచర్ సిటీకి ఒక గుర్తింపు వచ్చేలా.. అంతర్జాతీయంగా ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుకునేలా చేయటంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. గడిచిన రెండు రోజులుగా నిర్వహించిన ఫ్యూచర్ సిటీకి సంబంధించి పరిణామాలు.. లక్షలాది కోట్ల రూపాయిలు పెట్టుబడుల రూపంలో వెల్లువెత్తిన తీరు చూసినప్పుడు ఫ్యూచర్ సిటీ దిశగా అడుగులు మరింత వడివడిగా పడతాయని చెప్పాలి.

ఇలాంటి సమయంలోనే ఫ్యూచర్ సిటీ ఎలా ఉండాలి? దాన్నెలా నిర్మించాలన్న దానిపై ప్లాన్ చేసే సమయంలో చప్పున గుర్తుకొచ్చేది గుజరాత్ లోని గిఫ్టు సిటీ. ప్రపంచ వ్యాపారం కోసం దేశంలో నిర్మించిన మొట్టమొదటి స్మార్ట్ సిటీ. గుజరాత్ రాజధాని గాంధీనగర్ - అహ్మదాబాద్ మధ్య సబర్మతీ నదిని అనుకొని 886 ఎకరాల్లో ఏర్పాటైన గిఫ్ట్ సిటీ అత్యాధునిక టెక్నాలజీ.. వసతులతో అందరిని విపరీతంగా ఆకర్షిస్తోంది. అక్కడి పరిస్థితులు.. మౌలిక సదుపాయాలకు సంబంధించిన వివరాలు తెలిసినప్పుడు విస్మయానికి గురి కాకుండా ఉండలేం.

తెలంగాణ సీఎం రేవంత్ కలలు కంటున్న ఫ్యూచర్ సిటీని గిఫ్టు సిటీ మోడల్ ను ఫాలో అయితే.. బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకూ గుజరాత్ గిఫ్టు సిటీలో ఏముంటుంది? అన్న విషయంలోకి వెళితే.. అక్కడున్న పరిస్థితుల గురించి చదవినప్పుడు నమ్మశక్యం కాని రీతిలో ఉంటాయని చెప్పకతప్పదు. డ్రైనేజీ పైపు లైన్ కనిపించకపోవటం.. కరెంట్ వైర్లు బయటకు కనిపించకుండా ఉండే వ్యవస్థలు అక్కడి సొంతం.

ఈ గిఫ్టు సిటీలో దేశంలోనే తొలి ఆటోమేటెడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ఉంది. పారిశుద్ధ్య కార్మికులు ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించే అవసరం లేకుండా ప్రత్యేక పైప్ లైన్ ద్వారా పెద్ద పెద్ద భవనాల్లోని అంతస్తుల నుంచే నేరుగా చెత్తను పైప్ లైన్ ద్వారా సేకరిస్తారు. అదెలా అంటే వాక్యూమ్ తో. చెత్త సేకరణకు ఎలా అయితే ప్రత్యేక పైప్ లైన్ వ్యవస్థను ఏర్పాటు చేశారో అదే విధంగా మంచినీరు.. విద్యుత్ సరఫరా కోసం అతి పెద్ద అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వ్యవస్థను తీసుకొచ్చారు.

ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్.. డ్రైనేజీ వాటర్ ను శుద్ధి చేసే ప్లాంట్ ఉన్నాయి. నాన్ స్టాప్ గా కరెంట్ సప్లై అయ్యే వ్యవస్థల్ని సిద్ధం చేశారు. శుద్ధి చేసిన మురుగు నీటిని 5 డిగ్రీలకు శీతలీకరించి.. వాటిని నగరంలో ఎయిర్ కండిషనింగ్ కోసం వాడతారు. దీంతో ఈ సిటీలో ఏసీ ఔట్ డోర్ యూనిట్లు మచ్చుకు కూడా ఉండవు. ఈ కూల్ పైప్ లైన్ ద్వారా ప్రతి భవనానికి ఎయిర్ కండిషనింగ్ ఉంటుంది. దీంతో సిటీ మరింత సుందరంగా.. కాలుష్యం అంత ఎక్కువ లేకుండా చేస్తుంది.

సాధారణ ఏసీలు పని చేసే కన్నా.. ఈ భిన్నమైన కూలింగ్ సిస్టమ్ తో విద్యుత్ వినియోగం కూడా తక్కువేనని చెబుతున్నారు. ఇవన్నీ చదివిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ కలల నగరమైన ఫ్యూచర్ సిటీని ఇదే తీరులో నిర్మిస్తే బాగుండన్న భావన కలుగక మానదు. మరి.. ఈ విషయాలు ముఖ్యమంత్రికి తెలిసేలా ఎవరో ఒకరు నడుం బిగిస్తే.. ఫ్యూచర్ సిటీ మరో గిఫ్టు సిటీలా మారుతుందని చెప్పకతప్పదు.

Tags:    

Similar News