ఫుట్ బాల్ మ్యాచ్ కోసం సీఎం రేవంత్ ఎంత సీరియస్ ప్రాక్టీస్ చేస్తున్నారంటే?
అరుదైన సన్నివేశానికి తెలంగాణ వేదిక కానుంది. అందులో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకభూమిక పోషించనున్నారు.;
అరుదైన సన్నివేశానికి తెలంగాణ వేదిక కానుంది. అందులో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకభూమిక పోషించనున్నారు. దిగ్గజ ఫుట్ బాల్ క్రీడాకారుడు హైదరాబాద్ లో జరిగే క్రీడా ఈవెంట్ కు హాజరు కావటం.. అందులో భాగంగా అతను స్నేహపూర్వక ఫుట్ బాల్ మ్యాచ్ ఆడుతుండటం తెలిసిందే. ఫుట్ బాల్ ప్రియులకు.. క్రీడాభిమానులకు మెస్సీ గురించి తెలిసిందే. అయితే.. సామాన్య ప్రజలకు మెస్సీ గురించి అంత అవగాహన ఉండదన్నది తెలిసిందే. దిగ్గజ క్రీడాకారుడు తెలంగాణకు రావటం ఎంత గొప్పైన విషయాన్ని రాష్ట్ర ప్రజలకు తెలిసేలా చేయటం కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుం బిగించిన వైనం చూస్తే మాత్రం ఆయన్ను అభినందించకుండా ఉండలేం.
స్వతహాగా క్రీడాకారుడైన రేవంత్ రెడ్డికి ఫుట్ బాల్ ఇష్టమైన క్రీడ అన్న విషయం అందరికి తెలియని విషయం. యూత్ లో ఉన్నప్పుడు సరదాగా ఫుట్ బాల్ మ్యాచ్ లు ఆడేవారు. వృత్తిపరమైన స్థాయిలో కాకున్నా.. ఫ్రెండ్లీ మ్యాచ్ లు ఆడిన అనుభవం ఆయనకు ఉంది. ముఖ్యమంత్రి అయ్యాక.. ఒక సరదా మ్యాచ్ కోసం సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ ప్రాక్టీస్ చేయటం ఆసక్తికర అంశంగా చెప్పక తప్పదు.
ఒక ప్రైవేటు మ్యాచ్ కోసం ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రాజకీయ ప్రముఖుడు గ్రౌండ్ లోకి దిగి.. జెర్సీ ధరించి మరీ ప్రాక్టీస్ కోసం చెమటలు చిందించటం చూస్తే.. ఇలాంటి సీన్ సమకాలీన కాలంలో మరే ముఖ్యమంత్రి చేయలేదనే చెప్పాలి. ఈ విషయంలో ఆయన చెదరలేని ఒక రికార్డును క్రియేట్ చేయనున్నారని చెప్పాలి. డిసెంబరు 13న హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా మెస్సీ జట్టుతో తలపడే మ్యాచ్ లో సీఎం రేవంత్ తన జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. ఈ మ్యాచ్ కోసం ఆయన ఆర్ఆర్9 (RR9) జెర్సీని ధరించనున్నారు.
సీఎం రేవంత్ కు ఫుట్ బాల్ ఆట అంటే ప్రత్యేకమైన అభిమానమన్న సంగతి తెలిసిందే. ఆయనకు అర్జెంటీనా దిగ్గజం డియోగో మారడోనా ఇష్టమైన ఆటగాడు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడల్ని ప్రోత్సహించే దిశగా.. యువతలో క్రీడాస్ఫూర్తిని రగిలించే దిశగా ఆయన ఈ మ్యాచ్ ను ఒక అవకాశంగా భావిస్తున్నారని చెప్పాలి. అంతేకాదు.. అంతర్జాతీయంగా తెలగాణ బ్రాండ్ ను ప్రమోట్ చేయాలన్న పట్టుదలతో ఉన్న రేవంత్ కు మెస్సీ తో కలిసి ఆడే మ్యాచ్ ఆయన్ను ప్రత్యేకంగా చూపించటమే కాదు.. జాతీయ.. అంతర్జాతీయ మీడియాలో ఆయన ప్రత్యేకంగా కనిపిస్తారు.
సరదాగా ఫుట్ బాల్ ను కాలితో తన్నటం వేరు. మెస్సీ లాంటి దిగ్గజ ఆటగాడితో ఆడే వేళలో..సీఎం రేవంత్ ప్రదర్శించే ఆట కనీస స్థాయిలో ఉన్నా.. దానికి లభించే మైలేజ్ అంతా ఇంతా కాదు. వ్యక్తిగా వచ్చే క్రెడిట్ కంటే కూడా భారతదేశంలో ఒక ముఖ్యమంత్రికి ఉన్న క్రీడా ఆసక్తి.. ఫుట్ బాల్ లో ఉన్న నైపుణ్యం ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం అవుతుందని మాత్రం చెప్పక తప్పదు. ఈ విషయాన్ని గుర్తించిన సీఎం రేవంత్ రాత్రి వేళలో ఫుట్ బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ ప్రాక్టీస్ సెషన్ లలో వల్లువార్ నగర్ ఫుట్ బాల్ క్లబ్ వంటి స్థానిక క్లబ్ ల ఆటగాళ్లతో పాటు.. ఇతర యువ క్రీడాకారులతో కలిసి శిక్షణ పొందుతున్న వైనం అందరిని ఆకర్షిస్తోంది.
తాజా సీఎం రేవంత్ రెడ్డి గ్రౌండ్ లోకి దిగి సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్నఫోటోలను.. వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. క్రీడా స్ఫూర్తి.. తెలంగాణ కీర్తి అన్న నినాదంతో మెస్సీతో జరిగే మ్యాచ్ కోసం ఆయన సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. మెస్సీని హైదరాబాద్ లో చూడటం అభిమానులకు ఒక ఉత్తేజకరమైన క్షణంగా అభివర్ణిస్తున్న సీఎం రేవంత్.. ‘‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ను క్రీడా వేదిక నుంచి మెస్సీ సహకారంతో ప్రపంచానికి మరింతగా పరిచయం చేయాలన్న వ్యూహాత్మక ఆలోచనతో క్రీడా మైదానంలోకి స్వయంగా దిగాను’’ అని పేర్కొనటం చూస్తే.. అందివచ్చిన అవకాశాన్ని సీరియస్ గా.. నిజాయితీగా తాను శ్రమిస్తానన్న విషయాన్ని సీఎం రేవంత్ మాటలతో కాకుండా చేతలతో చెబుతున్న తీరు ఆసక్తికకరంగా మారిందని చెప్పాలి.